శక్తి ఒక్కటే.. వ్యక్తమయ్యే మార్గాలు అనేకం. మూలపుటమ్మ ఒక్కరే.. రూపుదాల్చిన అవతారాలు అనేకం. లలితగా సాత్తికంగా అనుగ్రహించినా.. దుర్గగా రాజసంగా కరుణించినా.. కాళిగా తామసంగా అభయమిచ్చినా.. ఆ తల్లి ప్రతిరూపం అపురూపమే! సర్వభూతాల్లోనూ శక్తిగా సంస్థితమై ఉన్న అమ్మను దశమహావిద్య రూపాల్లో కొలుచుకుంటారు శాక్తేయులు. దశమహావిద్యలు అంటే ఏమిటి? అవి ఏం దిశానిర్దేశం చేస్తున్నాయి?
‘ఆధ్యాత్మికత’ అంటే అష్ట ఐశ్వర్యాలను త్యజించడమనీ, భౌతిక సుఖాలను తృణీకరించడమనీ మన పూర్వులు ఎన్నడూ చెప్పలేదంటారు శ్రీ అరవిందులు. శరన్నవరాత్రులలో జరిగే అమ్మవారి అలంకారాలు చూస్తే శ్రీ అరవిందుల మాట అక్షర సత్యమని తెలుస్తుంది. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారిని పది రకాలుగా అలంకరించి పూజిస్తారు. ఒక్కొక్క అలంకారానికీ ఒక్కొక్క నామం ఉన్నది. ఒక్కొక్క నామానికీ ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. వైభవోపేతమైన, శాంతియుతమైన మానవ జీవన కల్యాణార్థం ఈ ఉత్సవాలు జరుగుతాయి.
సౌరం, గాణాపత్యం, స్కందం, శైవం, వైష్ణవం, శాక్తేయం అన్నవి హైందవ జీవన విధానంలో వేద ప్రమాణాన్ని అంగీకరించే మతాల (ఉపాసనా విధనాలు)లో ప్రధానమైనవి. ఈ ఆరు మత విధానాల్లోనూ నిత్య పూజావిధానం నిర్దేశించి ఉంది. అయినప్పటికీ మాఘమాసం సూర్యోపాసనకు, భాద్రపదం వినాయకుడి ఉపాసనకు, కార్తిక, మార్గశిర మాసాలు కుమారస్వామి ఆరాధనకు, కార్తికం శైవ, వైష్ణవ ఆరాధనకు, ఆశ్వయుజం శక్త్యుపాసనకు శ్రేష్ఠమైనవిగా భావిస్తారు. ఆశ్వయుజ, కార్తిక మాసాలు శరత్ రుతువు. ఈ రుతువులోని మొదటి తొమ్మిది రాత్రులను శరన్నవరాత్రులుగా పిలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది. మాసం చివరి రోజు అయిన అమావాస్య నాడు కమలాత్మికగా అర్చనలు స్వీకరిస్తుంది.
సౌర, గాణాపత్య, స్కంద, శైవ, వైష్ణవ మతాల మధ్యన అక్కడక్కడా వైరభావం కనిపిస్తుంది. కానీ శాక్తేయం పట్ల వీరందరికీ స్నేహభావమే ఉన్నది. దేవమాత కారణంగా సూర్యోపాసకులు, పార్వతి కారణంగా శైవులు, గాణాపత్య, స్కందులు, మహాలక్ష్మి కారణంగా వైష్ణవులు శాక్తేయంతో ముడిపడి ఉన్నారు. సృష్టి, స్థితి, లయలకు కారణభూతులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు వారి వారి కర్తవ్య నిర్వహణకు కావలసిన శక్తిని ఇచ్చే మహా సరస్వతి, మహాలక్ష్మి, మహాకాళులకు మూలపుటమ్మ అయిన ఆది పరాశక్తి శక్త్యుపాసనకు మూలవిరాట్టుగా నిలిచి ఉన్నది. భారతీయులందరినీ ఒక్కతాటిపై నిలిపి ఉంచగలిగిన శక్తి శాక్తేయానికి మాత్రమే ఉన్నదన్నది నిర్వివాదాంశం. ఈ విషయం గ్రహించిన కారణంగానే బంకిం చంద్రఛటర్జీ తన వందేమాతరం గీతంలో భారతమాతను దుర్గాభవానిగా అభివర్ణించాడు.
శరన్నవరాత్రుల్లో అమ్మవారిని వివిధ రూపాల్లో అర్చిస్తుంటారు. బాలాత్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలితా త్రిపుర సుందరి, మహాచండి, మహాలక్ష్మి అన్నవి మొదటి ఆరు రోజుల అర్చనా రూపాలు. కాగా, వీటికి నామాంతరాలు ఉన్నాయి. ఒక్కొక్క గుడిలో ఒక్కో విధానం ఆచరణలో కనిపిస్తుంది. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయనీ, కాళరాత్రి వంటి రూపాలలో ఆయా ఆలయాలలో అర్చనలు జరుగుతుంటాయి. ఇక చివరి నాలుగు రోజు అంటే సప్తమి నుంచి విజయ దశమి వరకు అలంకారాలు స్థిరంగా ఉంటాయి. సప్తమి (మూలా నక్షత్రం) నాడు సరస్వతి, అష్టమి రోజు దుర్గాదేవి, మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్దని, విజయ దశమినాడు శ్రీరాజరాజేశ్వరి అలంకారాలు ఉంటాయి. సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రీరాజరాజేశ్వరీదేవి పట్టాభిషేకంతో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగుస్తాయి. ఇందులో సరస్వతిని కాత్యాయనీ అనీ, దుర్గను కాళరాత్రి అనీ, మహిషాసుర మర్దనిని సిద్ధిధాత్రి లేదా మహాగౌరి అని భావన చేస్తారు.
అమ్మవారి రూపాలు అనంతం. కాగా సమస్త మానవాళి ఇష్టకామ్యార్థ సిద్ధి నిమిత్తం రుషులు అమ్మవారిని పది ప్రధాన రూపాలలో దర్శించి, అందుకు సంబంధించిన ఉపాసనా మార్గాలను మనకు ప్రసాదించారు. నెరవేర్చుకోవలసిన కామ్యాన్ని బట్టి అమ్మవారి రూపం ఉంటుంది. అందుకు తగిన నామం ఉంటుంది. ఉపాసకుడు ఆచరింపవలసిన కర్తవ్యాన్ని, లేదా పయనించవలసిన మార్గానికి ‘మహావిద్య’ అని పేరు. వాటి సంఖ్య పది కాబట్టి అవి ‘దశ మహావిద్య’లయ్యాయి. ఈ కారణంగా దశమహావిద్యలను కూడా శరన్నవరాత్రుల్లో అర్చించడం ప్రధానంగా కనిపిస్తుంది. కాళి లేదా మహాకాళి, తార, షోడశి, భువనేశ్వరి, త్రిపుర భైరవి, ఛిన్నమస్త, ధూమ్రావతి, బగళాముఖి, మాతంగి, కమల (కమలాత్మిక) అని దశమహావిద్యల పేర్లు.
దశ మహావిద్యల్లో మొదటి శక్తి మహాకాళి. మహారాత్రి ఈమె లక్షణం. మహాకాలుడి భార్యగా కాలాన్ని నియంత్రించగల శక్తిశాలిని. కలకత్తాలోని కాళీమాత శ్రీరామకృష్ణ పరమహంస దక్షిణాచార పద్ధతిలో కొలిచాడు. ఈమె స్వయంగా తన భర్త అయిన శివుడి దేహంపైన పాదాలను నిలిపి ఉంటుంది. శ్మశానాలు ఈమె నివాసం. శ్రావణ బహుళ అష్టమి నాడు మహాకాళి జన్మించింది.
దశమహావిద్యల్లో రెండోది తార. క్రోధరాత్రి ఈమె స్వభావం. సిద్ధవిద్యా అన్నది మరోపేరు. చైత్రశుద్ధ నవమి (శ్రీరామనవమి) ఈమె జయంతి. ఏక జాతి, ఉగ్రతార, నీల సరస్వతి అన్నవి ఈమె ప్రసిద్ధ రూపాలు. ఈమె భర్తగా శివుని పేరు అక్షోభ్యుడు. ఈ దేవత కొలువుదీరిన పశ్చిమబెంగాల్లోని తారాపీఠ్ దేవాలయం ప్రసిద్ధి.
మూడోదైన షోడశీ మహావిద్యకున్న మరోపేరు బాలాత్రిపుర సుందరి. మూలాధార, అనాహత, ఆజ్ఞాచక్రాలకు అధిష్ఠాత్రి. బాలాత్రిపుర సుందరి పంచప్రేతాసినిగా గుర్తింపు పొందింది. బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు ఈమె సింహాసనానికి కాళ్లుగా ఉండగా, సదాశివుడు పరుపు అయ్యాడు. మాఘ శుద్ధ పౌర్ణమి షోడశీ జయంతి.
భువనేశ్వరీదేవి సిద్ధ విద్య. రాజరాజేశ్వరి అన్నది ఈమెకున్న మరో నామం. శివుడు త్య్రంబక నామంతో ఈమెకు భర్తగా ఉన్నాడు. భాద్రపద శుద్ధ ద్వాదశి భువనేశ్వరి జయంతి. ఈమె స్వాధిష్ఠాన చక్రానికి అధిష్ఠాత్రి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులను సృష్టించి వారిని వరుసగా రుద్ర, విష్ణు, బ్రహ్మలకు ప్రసాదించిన ఆదిపరాశక్తిగా భువనేశ్వరి ప్రసిద్ధురాలు.
ఛిన్నమస్తా స్వభావం వీరరాత్రి. కబంధ నామంతో శివుడు ఈమెకు భర్తగా ఉన్నాడు. వైశాఖ శుద్ధ పౌర్ణమి ఈమె జన్మదినం. ప్రహ్లాదుని కుమారుడైన విరోచమని కుమార్తెగా ఈమె వైరోచని. కుడిచేత ఖడ్గాన్ని ధరించి, తన శిరస్సును తానే ఖండించుకొని దానిని ఎడమ చేతితో పట్టుకొని ఉంటుంది. ఆమె కంఠభాగం నుంచి మూడు ధారలుగా ఎగజిమ్మిన రక్తాన్ని ఖండిత శిరస్సుతోపాటు ఇరువురు పరిచారికలు తాగుతుంటారు. మైథున క్రీడలో నిమగ్నమైన జంటపై నగ్నంగా నిలబడిన రూపం ఛిన్నమస్తాదేవి. కావ్యకంఠ వాశిష్ఠ గణపతిముని ఈమె నామాన్ని జపిస్తూ ఉండగా ఆయన శిరస్సునుంచి పొగలు వెలువడ్డాయట!
త్రిపుర భైరవీ మహావిద్యకున్న మరొకర పేరు కాళరాత్రి. ఈమె సిద్ధి విద్యగా ప్రసిద్ధి. కాలభైరవ నామంతో దక్షిణామూర్తి అయిన శివుడు ఈమెకు భర్త. మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు ఈమె జన్మించింది. త్రిభువనాలకు, త్రిగుణాలకు, త్రిమూర్తులకు, అవస్థా త్రయానికి, ఇచ్ఛాజ్ఞానక్రియా శక్తులకు త్రిపుర భైవరి అధిష్ఠాత్రి.
ధూమావతి అలక్ష్మిగా, జ్యేష్ఠాదేవిగా ప్రసిద్ధురాలు. కాకి ఈమె వాహనం. ఈమె భర్త శివుడు శూన్యుడు. దారుణ రాత్రి ఈమె స్వభావం. జ్యేష్ఠ శుద్ధ అష్టమి ఈ అమ్మవారి జయంతి. కోపం, దురదృష్టం, క్షయం, మరణం లాంటివి తొలగిపోవడానికి ఆమెను ప్రార్థించాలి. నైరుతి దిశతో ఈమెకు సంబంధం ఉందంటారు. దక్షయజ్ఞంలో సతీదేవి తనను తాను దహించుకున్నప్పుడు వెలువడిన ధూమంలోంచి పుట్టుకొచ్చిన మహావిద్యయే ధూమావతి అన్న ఐతిహ్యం ఉన్నది.
బగళాముఖిని పీతాంబరి అని కూడా అంటారు. కోర్టు కేసులు, అప్పుల నుంచి బయటపడవేసే దేవతగా ఈమె ప్రసిద్ధురాలు. బంగారుమేని ఛాయతో ప్రకాశించే ఈ దేవత తనకు ఎదురుపడిన వారిని లోబరుచుకొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ శక్తిని తన భక్తులకు ప్రసాదిస్తుంది. వైశాఖ శుద్ధ తదియ బగళా జయంతి.
లఘుశ్యామలగా కీర్తించే మాతంగీదేవి స్వభావం మోహరాత్రి. మాతంగ నామంతో శివుడు ఈమెకు భర్తగా ఉన్నాడు. వైశాఖ శుద్ధ తదియ ఈమె జన్మదినం. వాక్కు, సంగీతం, జ్ఞానం, కళలను నియంత్రించే మాతంగి సరస్వతీదేవి తాంత్రికరూపంగా చెబుతారు. అధికారంతో కూడిన పదవులను పొందడానికి చేసే రాజశ్యామల యాగం మాతంగి మహావిద్యకు సంబంధించినదే!
దశమహావిద్యల్లో చివరిది కమల (కమలాత్మిక)! దీపావళి ఈమె జన్మదినం. సదాశివ విష్ణు నామంతో శివుడు ఈమెకు భర్తగా ఉన్నాడు. మహారాత్రి ఈమె స్వభావం. లక్ష్మీనామంతో ఈమె వరదాయిని. దీపావళి నాటి అర్ధరాత్రి సమయంలో పూజలు అందుకునే మహాలక్ష్మి ఈ దేవతే!
వాక్కు మనదేహంలో ‘పరా’నుంచి ప్రారంభమై ‘పశ్యంతి’, ‘మధ్యమా’లుగా ప్రవహించి ‘వైఖరి’గా వెలువడుతుందని చెబుతారు. ఈ క్రమంలో ‘పరా’ కు త్రిపురభైరవి, ‘పశ్యంతి’కి తారాదేవి, ‘మధ్యమా’కు ఛిన్నమస్తా, ‘వైఖరి’కి మాతంగి అధిష్ఠాన దేవతలుగా ఉంటారు. సృష్టికి మూలమైన ఓంకారానికి మాతంగి అధిష్ఠాత్రిగా చెబుతారు. అస్సాంలోని గువాహటి సమీపంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న పర్వత శ్రేణుల్లో వెలసిస కామాఖ్యాదేవి వామాచార, దక్షిణాచార సంప్రదాయాలతో కూడిన దేవ్యుపాసనకు ఆటపట్టుగా ఉన్నది. దశ మహావిద్యలకు ఆ కొండలలో విడివిడిగా దేవాలయాలు ఉన్నాయి. నవదుర్గలైన శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాళరాత్రి, మహాగౌరి, కాత్యాయని, సిద్ధదాత్రులు కూడా అక్కడ కొలువై ఉన్నారు.
శక్త్యుపాసనలో కేవలం విగ్రహారాధనమే కాదు, శక్తి స్వరూపాలుగా భావించే మహిళలను ప్రత్యక్షంగా ఆరాధించే సంప్రదాయం కనిపిస్తుంది. శరన్నవరాత్రుల్లో ఐదేండ్లలోపు ఉన్న బాలికలను బాల గానూ, పన్నెండేండ్లలోపు వయసున్న బాలికలను కుమారి గానూ, ముత్తయిదువులను సువాసినలుగానూ పూజిస్తారు. గురుతుల్యులైన వరిష్ఠ దంపతులకు దంపతి పూజ నిర్వహిస్తారు. నరకాసురుని చెర నుంచి పదహారు వేల మంది రాకుమార్తెలు విడుదలైన రోజు ఆశ్వయుజ బహుళ అమావాస్య. అంతకుముందు రోజైన చతుర్దశి నాడు నరకుడి వధ జరిగింది. నరకాసురుణ్ని సంహరించింది సత్యభామ అని మరవకూడదు. స్త్రీ శక్తిని లోకానికి తెలియజెప్పే ప్రయత్నమే ఆశ్వయుజ మాసంలో శక్త్యుపాసన అంతరార్థం.
అమ్మలఁగన్న యమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి వుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్తకవిత్వ పటుత్వ సంపదల్
(పోతన భాగవతం)
ఈ పద్యంలో అమ్మ అన్న శబ్దం పది పర్యాయాలు వచ్చింది. ఇది దశమహావిద్యలకు సంకేతమేమో!
దైవారాధన ముఖ్యంగా శాక్తేయంలో దక్షిణాచారమనీ, వామాచారమనీ రెండు రకాలు. వేద విహిత మార్గాన్ని ఆచరించడం దక్షిణ మార్గం. తద్విరుద్ధ ఆచరణ వామాచారం. యజ్ఞయాగాదులు, తాంత్రిక విధానాలు రెండింటా ఉన్నా, దక్షిణాచార మార్గం సత్త, రజోగుణ సంపన్నం. వామాచారం రజస్తమోగుణ ప్రధానం. వశిష్ఠ, శుక, సనక, సనందన, సనత్కుమారాలనే ఐదు తంత్రాలు దక్షిణాచారంలో భాగాలు. రుషి సంప్రదాయం లేదా సమయాచారంగా పిలిచే దక్షిణ మార్గంలో జంతుబలులు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుత కాలంలో నైవేద్యానికి బెల్లం, మధుర పదార్థాలు, పాలు, పండ్లు వంటివి వినియోగిస్తున్నారు.
నవదుర్గల విషయంలో ఎలా ఉన్నా, దశమహావిద్యల విషయంలో ఇంకా వామాచార ప్రభావం ఎక్కువగా కొనసాగుతున్నది. కౌలం, వామం, చీనం, సిద్ధాంతం, శాంబరం అన్న ఐదు తంత్రాలలో వామాచారం నిర్వహిస్తుంటారు. తరతరాలుగా వస్తున్న వంశాచారాలు కౌలం అని చెబుతారు. చైనా, టిబెట్ దేశాల నుంచి మనకు సంక్రమించిన ఆచారాలకు చీనం, మహాచీనం, చీన క్రమం అన్న పేర్లున్నాయి. శబర లేదా శంబర శబ్దం నుంచి ‘శాంబరం’ వచ్చిందని భావించొచ్చు. ఇది ప్రధానంగా ఆటవికుల ఉపాసనా విధానం. వామం, సిద్ధాంతం అన్నవి మూలాచారాలై ఉండవచ్చు. వామాచారాన్ని క్షుద్ర పూజలని కూడా వ్యవహరిస్తారు. వామాచారం అనుసరణీయం కాదని విజ్ఞుల అభిప్రాయం.