e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, December 9, 2021
Home చింతన ఉగ్రం.. శాంతం.. మహాశక్తిమ్‌!

ఉగ్రం.. శాంతం.. మహాశక్తిమ్‌!

 • దశ మార్చే దశమహావిద్యలు
 • ఈ నెల 7 నుంచి దేవీ నవరాత్రులు

ఆలనాపాలనా సమయంలో అమ్మ కరుణామూర్తి. పిల్లలు అల్లరి చేస్తుంటే అదే అమ్మ కాఠిన్యం నటిస్తుంది. దారి తప్పితే నచ్చజెబుతుంది. వినకపోతే దండిస్తుంది. ఏం చేసినా తన బిడ్డల బాగు కోసమే! జగన్మాత కూడా అంతే! శాంతమూర్తిగా కరుణ వెదజల్లుతుంది. ఉగ్రరూపం దాల్చి నిగ్రహిస్తుంది. ఏ రూపంలో కనిపించినా, ఏ అవతారం దాల్చినా తనను నమ్ముకున్న భక్తుల కోసమే! జగన్మాతకు జగమంతా బిడ్డలే! ఈ జగత్తును ఉద్ధరించడానికి ఆదిపరాశక్తి దాల్చిన అవతారాలే దశమహావిద్యా రూపాలు! శరన్నవరాత్రి శోభ సంతరించుకుంటున్న వేళ.. దశమహావిద్యల ప్రస్తావన ఆ మహాశక్తి లీలావిలాసాన్ని స్మరించుకోవడమే..

దుర్గముడు పేరుకు తగ్గట్టే దుష్ట రాక్షసుడు. తపోబలంతో పేట్రేగిపోతాడు. వేదాలను అపహరిస్తాడు. వేదాలు లేక ధర్మం గాడి తప్పుతుంది. మనుషులు గతి తప్పుతారు. యజ్ఞాలు నిలిచిపోవడంతో దేవతలకు ఆహారం లేకుండా పోతుంది. సురులంతా కలిసి వెళ్లి ఆ పరాశక్తిని ఆశ్రయిస్తారు.‘వేద సంరక్షణం కార్యం అవతారైరనేకశః’ అంటుంది జగన్మాత. అంటే తన అవతార పరమార్థమే వేదరక్షణ అని ప్రకటిస్తుంది. దుర్గముడిని శిక్షించడానికి పది దిక్కుల్లో పది రూపాలతో అవతరిస్తుంది. ఆ అసురుణ్ని సంహరించి వేదాలను కాపాడి ధర్మాన్ని పునరుద్ధరిస్తుంది. అమ్మవారి పది అవతారాలే దశమహావిద్యా రూపాలుగా ప్రకాశిస్తున్నాయి.

- Advertisement -

‘సాధూనాం రక్షణం కార్యం హన్తవ్యా యేప్యసాధవః’ అంటుంది దేవీభాగవతం. ‘మంచివాళ్లను రక్షించడానికి, చెడ్డవాళ్లను తుదముట్టించడానికే తాను అవతరిస్తాన’ని స్వయంగా అమ్మవారే ప్రకటించింది. తన అనుగ్రహం పొందడానికి అనేక సాధనా మర్గాలను సూచించింది తల్లి. అందులో ఉత్కృష్టమైనవి దశమహావిద్యలు. మనిషి దిశను మార్చి ఇహంలో పరమానందాన్ని, పరంలో మోక్షాన్ని అనుగ్రహించే అద్భుత శక్తి దశమహావిద్యలకు ఉంది. అందుకే ఎందరో మునులు సంప్రదాయ భేదాలతో పదిరూపాలలో ఆ జగన్మాతను స్వయంగా ఆరాధించి, ఆ మార్గాన్ని మనకు అందించారు.

‘కాళీ తారా మహావిద్యా షోడశీ భువనేశ్వరీ
భైరవీ ఛిన్నమస్తా చ విద్యా ధూమావతీ తథా
బగలా సిద్ధవిద్యా చ మాతంగీ కమలాత్మికా’ (ముండమాలా తంత్రం)

కాళి, తార, ఛిన్నమస్త, షోడశి, భువనేశ్వరి, భైరవి, ధూమావతి, బగలా, మాతంగి, కమల ఈ పది రూపాలే దశమహావిద్యలుగా లోక ప్రసిద్ధి.

శక్తే.. పరబ్రహ్మ తత్వం
‘సావిద్యా యా విముక్తయే’ విద్య అనే శబ్దానికి బ్రహ్మవిద్య అనే అర్థం. దానిని పొందడానికి కారకాలైన అన్ని మార్గాలూ విద్యగానే భావించాలి. పలురకాల ఉపాసనలు, అనుష్ఠానాల ద్వారా జ్ఞానాన్ని, తద్వారా మోక్షాన్ని పొందుతున్నారు. శాక్తేయంలో దశమహావిద్యలు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉన్నాయి. ఈ ఉపాసనలో శక్తినే పరబ్రహ్మ తత్వంగా భావించి ఆరాధిస్తారు. అయితే, దశమహా విద్యల్లో కొన్ని ఉగ్రరూపాలనీ, కొన్ని శాంత స్వభావాలనీ చెబుతారు. కానీ, పులి పిల్లలకు పులి అంటే ఎలా భయం ఉండదో, అలానే సరైన గురువు ఉపదేశంతో, శాస్ర్తానుసారం అనుష్ఠానం చేయగలిగితే ఎంతటి ఉగ్రస్వరూపిణి అయినా అమ్మ ప్రశాంతంగానే దర్శనమిస్తుంది. తనను నమ్మిన భక్తుడిని శాంతమూర్తిగా అనుగ్రహిస్తుంది. అనంత కరుణధారను కురిపిస్తుంది. దేవీ నవరాత్రుల్లో దశమహా విద్యల ఉపాసన విశేష ఫలాన్నిస్తుంది.

శివుణ్ని అడ్డగించిన శివాని
దక్షుడు మహాయాగం తలపెడతాడు. ఆదిదంపతులకు ఆహ్వానం అందదు. కానీ, పుట్టింటిపై మమకారంతో తండ్రి చేస్తున్న క్రతువుకు వెళ్తానంటుంది దాక్షాయణి. ఆలిపై అలిగిన శివుడు ఆమెను కోపగించుకుంటాడు. తన ఇష్టాన్ని కాదన్న రుద్రుడిపై ఉమాదేవికి ఆగ్రహం మిన్నంటుతుంది. భీకర రూపం దాలుస్తుంది. సతీదేవి రౌద్రరూపాన్ని చూసి భయపడి పారిపోబోతాడు శంకరుడు. శివుణ్ని అడ్డుకునేందుకు శివాని దశమహావిద్యా స్వరూపాలతో (పది రూపాలు) అవతరించిందని దేవీ భాగవతంలో కథ. అయితే, పైకి ఆలూమగల పోరులా కనిపించినా.. జగన్మాత అవతారాలు తన భక్తుడిని బంధ విముక్తుణ్ని చేసి, అనుగ్రహించడమే అసలు లక్ష్యంగా అర్థమవుతుంది.

 • మధుకైటభ, రక్తబీజ సంహారిణి.. శ్రీ శివారూఢా శక్తి శ్రీమహాకాళి
 • సంసారబంధాల నుంచి తరింపజేసే శక్తి, వాక్‌ శక్తి ప్రదాయిని, నీల సరస్వతీ శక్తి శ్రీ తార
 • పంచదశి, షోడశి మంత్రాత్మిక, ప్రసన్న గుణశోభిత శక్తి శ్రీ షోడశి
 • ‘హ్రీం’కార స్వరూపిణి, మహామాయ, సమస్త భువనాధిష్ఠాన దేవత శ్రీ భువనేశ్వరి
 • త్రిపురసుందరి, లలితా పరమేశ్వరిగా ప్రసిద్ధి చెందిన సిద్ధ భైరవి, కామేశ్వరీ భైరవీ శక్తి శ్రీ త్రిపురభైరవి
 • వజ్రవైరోచనీ, ప్రచండ చండీ శక్తి శ్రీ ఛిన్నమస్తా
 • సర్వవిపత్తులను, రోగాలను, దారిద్య్రాన్ని తొలగించే శక్తి శ్రీ ధూమావతి
 • శత్రు స్తంభన దేవత, దుష్ట స్తంభన దేవత, బ్రహ్మాస్త్ర దేవతా శక్తి శ్రీ బగలాముఖి
 • శ్యామవర్ణ, కోమల స్వరూపిణి, రాజమాతంగి, కదంబ వనవాసిని శక్తి శ్రీ మాతంగి
 • ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, ముముక్షువులకు మోక్షలక్ష్మీ శక్తి శ్రీ కమలాత్మిక

డా॥ శాస్ర్తుల వేంకటేశ్వర శర్మ
98499 09165

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement