రాత మార్చే గీత!
నారాయణుడు సారథి. నరుడు మహారథి. రథి ఆజ్ఞాపించాలి.. సారథి ఆచరించాలి. కురుక్షేత్రంలో ఇందుకు భిన్నమైన సన్నివేశం కనిపిస్తుంది. సారథి ఆజ్ఞాపించాడు.. రథి ఆచరించాడు. నారాయణుడు శాసించాడు.. నరుడు శ్వాసించాడు.
- శనివారం గీతాజయంతి
నారాయణుడు సారథి. నరుడు మహారథి. రథి ఆజ్ఞాపించాలి.. సారథి ఆచరించాలి. కురుక్షేత్రంలో ఇందుకు భిన్నమైన సన్నివేశం కనిపిస్తుంది. సారథి ఆజ్ఞాపించాడు.. రథి ఆచరించాడు. నారాయణుడు శాసించాడు.. నరుడు శ్వాసించాడు. జగద్గురువు ఉపదేశించాడు.. అర్జునుడు సాధించాడు. ఆ జ్ఞానబోధ.. అర్జునుడికి మాత్రమే పరిమితం కాలేదు. శ్రీకృష్ణపరమాత్మ బోధించిన గీత.. ఎందరెందరి తలరాతలనో మార్చింది. భగవానుడి దివ్యోపదేశం ఒకసారి ఆలకిస్తే..
పద్దెనిమిది అధ్యాయాలు.. ప్రతి యోగమూ పార్థుడి మనసులో ఇంకిపోయిన జిజ్ఞాసను తట్టిలేపిందే! 700కు పైగా శ్లోకాలు.. అన్నీ అర్జునుడి శోకాన్ని పరిమార్చినవే! విషాద యోగంలో ‘న కాంక్షే విజయం కృష్ణ..’ అని గాండీవం పక్కనపెడతాడు పార్థుడు. ‘కృష్ణా! విజయం, రాజ్యం ఇవేవీ అక్కర్లేదు’ అని నిర్లిప్త ధోరణిని ప్రదర్శిస్తాడు. నిరాశకు లోనైన అర్జునుణ్ని ‘ఇలాగైతే ఎలా.. యుద్ధం చేయాల్సిందే! లేకపోతే కుదరదు’ అని గద్దించలేదు కృష్ణుడు. అక్షరాలు రాయనని మారాం చేసిన విద్యార్థిని లాలించి, బుజ్జగించి తన మాట వినేలా చేసుకునే గురువులా.. పార్థుడి మనసును జగద్గురువు తనవైపునకు తిప్పుకొన్నాడు. ‘ముందుగా ఆ పిరికితనాన్ని విడిచిపెట్టు’ అని బుజ్జగించి అసలు కర్తవ్య బోధకు సిద్ధమయ్యాడు.
సాంఖ్యయోగంలోనే గీతాసారమంతా కనిపిస్తుంది. ముందుగా ఏది సత్యం, ఏది అసత్యం అని గుర్తుచేసి, అర్జునుడిని చుట్టుముట్టిన సందేహాలను ఒక్కొక్కటిగా పరిష్కరించాడు గీతాచార్యుడు. విద్యార్థికి కింది తరగతి పాఠాన్ని పునశ్చరణ చేసిన తర్వాత అసలు పాఠాన్ని బోధించినట్టుగా.. అర్జునుడు కాస్త కుదుటపడ్డాడు అని గ్రహించిన తర్వాత అసలు బోధకు పూనుకున్నాడు జగద్గురువు. మూడోదైన కర్మయోగంలో ‘చేయాల్సిన పని చేసి తీరాల్సిందే.. ఏ పనీ చేయకుండా ఉంటే శరీరయాత్ర సాగదు’ అని కర్మజ్ఞానాన్ని అందించాడు. ఆ తర్వాతి అధ్యాయమైన జ్ఞానయోగంలో జ్ఞానాన్నీ, కర్మనూ సమన్వయం చేస్తూ పార్థుడికి దిశానిర్దేశం చేశాడు.
‘కర్మలు చేయలా, వద్దా’ అన్న అర్జునుడి ప్రశ్నకు బదులుగా ఉపదేశించినదే కర్మసన్యాసయోగం. ఏది చేయాలో, ఏది వదిలిపెట్టాలో తెలుసుకోవడమే ఇంగితం. కర్మను ఆచరించినా, త్యజించినా ఎరుకతో చేయాలి. ఈ రెండిటిలో కర్మ చేయడమే శ్రేష్ఠమైనదని గీతాచార్యుడి భావన. కర్మ ఎలా చేయాలో విశదపరిచి అర్జునుడి విషాదాన్ని పరిమార్చాడు. శక్తియుక్తులు ఉన్న వ్యక్తి ఆత్మసంయమనంతో లేకపోతే.. అతను ఆచరించే కర్మలు ఒక్కోసారి వినాశనానికి దారితీయొచ్చు. మనసు, ఆత్మ రెండిటినీ అదుపులో ఉంచుకున్నప్పుడే బుద్ధి చేతనం పొందుతుంది. సత్కర్మ ఆచరించే అవకాశం ఏర్పడుతుంది. ఇదే విషయాన్ని ఆత్మసంయమ యోగం ద్వారా తెలియజేశాడు పరమాత్మ. ఇలా ఒక్కో అధ్యాయంలో జ్ఞానాన్ని, తాత్విక చింతనను పెంపొందిస్తూ, కర్తవ్యాన్ని పదేపదే గుర్తుచేస్తూ అర్జునుణ్ని కార్యోన్ముఖుణ్ని చేశాడు.
చివరిగా.. ‘నేను చెప్పినదంతా శ్రద్ధగా విన్నావా? అతి రహస్యమైన జ్ఞానాన్ని నీకు తెలియజేశాను. ఇక నీకు తోచిన విధంగా చేయవచ్చు’ అని నిర్ణయాధికారం అర్జునుడికే వదిలేశాడు శ్రీకృష్ణుడు. దీనికి బదులుగా అర్జునుడు ‘అచ్యుతా! నీ కృపతో నా మోహం నశించింది. ఇప్పుడు నాకు ఏ సంశయమూ లేదు. నీ ఆజ్ఞను శిరసావహిస్తాను’ అని గాండీవం అందుకున్నాడు. అనాడు అర్జునుడు మాత్రమే కాదు, గీతాసారం గ్రహించిన ప్రతి ఒక్కరూ సత్యాన్ని గ్రహించగలుగుతారు. తన కర్తవ్యం ఏమిటో గుర్తించగలుగుతారు. దాన్ని ఎలా నిర్వర్తించాలో స్పష్టతకు వస్తారు. ప్రణాళికా బద్ధంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోగలుగుతారన్నది నిస్సంశయం.
– కణ్వస
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

