దైవభీతి అంటే అల్లాహ్ ఎల్లప్పుడు తనను చూస్తున్నాడనే ఎరుకతో ఉండటం. ఉపవాసాలు దైవభీతిని జనింపజేస్తాయి. దైవభీతిని ఖురాన్ పరిభాషలో ‘తఖ్వా’ అంటారు. తఖ్వా కలిగిన మనిషి పాపాలకు దూరంగా ఉండి, అల్లాహ్ ఆగ్రహానికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అల్లాహ్ ఆజ్ఞలను పాటిస్తూ, ఆయన పట్ల అవిధేయతకు దూరంగా ఉంటాడు. దైవం పట్ల భయభక్తులు మనిషికి గొప్ప ప్రేరణనిస్తాయి. మనిషిని అల్లాహ్కు పూర్తి విధేయుడిగా మార్చి, పాపాలకు దూరంగా ఉండేలా చేసే గుణమిది.
అల్లాహ్ నిఘాలో ఉన్నామనే గొప్ప చైతన్యాన్నిచ్చే అవకాశం తఖ్వా. మనిషిలో ధార్మిక విశ్వాసాన్ని ఆచరణలుగా మార్చే మార్గమిది. మనిషిని పాపాలనుంచి నిరోధిస్తుంది. పుణ్యాల వైపు నడిపిస్తుంది. ఏడాదంతా ఈ స్ఫూర్తిని నింపడమే రంజాన్ ఉపవాసాల ఆశయం. ఉపవాసం పాటించేవారు అబద్ధం, మోసం, దొంగతనం, లంచం లాంటి చెడులకు దూరంగా ఉంటారు. ఇలాంటి సుగుణాలను రంజాన్ ఉపవాసాలు ప్రేరేపిస్తాయి. నెల రోజుల సుశిక్షణ ఏడాదంతా కొనసాగించేలా చేయాలన్నదే అల్లాహ్ ఉద్దేశం. ఉపవాసం పాటించే వ్యక్తి స్వయంగా ఆకలిని అనుభవించడం వల్ల అన్నార్తుల పట్ల సానుభూతి, జాలి జనిస్తాయి. ఫలితంగా, ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని అందించే ప్రయత్నాలు చేస్తారు.
దానధర్మాలు, సదకాలు, జకాత్, విరాళాలను విరివిగా అందిస్తారు. రంజాన్లో ఉపవాసులకు భోజనం పెట్టాలని ప్రోత్సహించడం జరిగింది. భోజనం పెట్టినవారికి కూడా ఉపవాసికి సమానమైన పుణ్యం లభిస్తుంది. ఉపవాసి స్వయంగా పొందే పుణ్యంలోను ఎలాంటి తగ్గుదల ఉండదు. ధర్మపరులు, సేవా సంస్థలు ప్రత్యేకంగా రంజాన్ మాసంలో ఇఫ్తార్, సహరీలకు భోజన ఏర్పాట్లను నిర్వహిస్తుంటారు. రంజాన్ తర్వాత కూడా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టే అలవాటు పెంపొందించుకోవాలి. ‘ఆకలి కడుపుతో ఇరుగుపొరుగు నిద్రిస్తున్నప్పుడు తాను కడుపునిండా తినే వాడు విశ్వాసి కాదు’ అని పేర్కొన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). మొత్తంగా రంజాన్ ఉపవాసాలు అందించే సుగుణాలను కడవరకూ పాటించేవాడే నిజమైన విశ్వాసి!
– ముహమ్మద్ ముజాహిద్ 96406 22076