ఒక పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చేవాడు. ఆయన చక్కటి ఉపన్యాసకుడైనా గర్వం ఎక్కువ. తనకు అంతా తెలుసని, తనంత తెలివైనవాడు ఆ చుట్టుపక్కల ఎవ్వరూ లేరని నమ్మేవాడు. తక్కువగా చదువుకున్నవారు ఎవరైనా ఎదురైతే లోకువ చేసి మాట్లాడే వాడు. పండితుడి ప్రవర్తనకు వారి మనసు గాయపడినా ఆయనకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు. దాంతో ఆ పండితుడు మరింతగా రెచ్చిపోయేవాడు. ఓ రాత్రి దూరంగా ఉన్న ఒక గ్రామానికి తన శిష్యులతో ఉపన్యాసానికి వెళ్లాడు పండితుడు. అక్కడినుంచి వెనుదిరిగే సమయానికి బాగా చీకటిపడింది. తిరిగి వస్తుండగా దారిలో వారికి ఓ పొలంలో ఒక రైతు కనిపించాడు. చేతిలో దీపం పట్టుకుని పొలాలకు నీళ్లు పెడుతున్నాడు ఆ రైతు. పండితుడు అతణ్ని సమీపించే సమయానికి.. రైతు పొలానికి నీళ్లు సరిగ్గా పారుతున్నాయో లేదో గమనిస్తున్నాడు.
పొలాల్లో మట్టిపని చేసే రైతు అంత జ్ఞానవంతుడు కాకపోవచ్చని భావించాడు పండితుడు. అక్కడ తన గొప్పతనాన్ని చాటుకోవాలని భావించాడు. రైతు చేతిలోని దీపాన్ని చూపుతూ ‘ఈ కాంతి ఎక్కడినుంచి వచ్చింది?’ అని అడిగాడు పండితుడు. ఇలాంటి పెద్ద ప్రశ్నలకు సామాన్య రైతు సమాధానం ఇవ్వలేడని భావించారు శిష్యులు. రైతు చిన్నగా నవ్వి తన చేతిలోని దీపాన్ని చప్పున ఆర్పేశాడు. పండితుడితో ‘ఇంతసేపు ఉన్న కాంతి ఎక్కడికి వెళ్లిందో చెప్పండి, అప్పుడు నేను మీ ప్రశ్నకు సమాధానం చెబుతాను’ అన్నాడు. చిన్నబోయిన పండితుడి ముఖం చూసిన శిష్యులు ‘కాంతి ఎక్కడినుంచి వస్తుందో, ఎక్కడికి వెళ్లిపోతుందో ఎవ్వరికీ తెలియదు కదా. సమాధానం తెలియని ప్రశ్నలు అడగటం వల్ల వచ్చిన సమస్య ఇది’ అని అనుకున్నారు. ‘నాకు చాలా తెలుసనుకున్నాను. కానీ, నాకు తెలిసింది సముద్రంలో చిన్న ఇసుక రేణువంత కూడా లేదు’ అని తెలుసుకున్న పండితుడు చిన్నగా అక్కడినుంచి కదిలాడు.