ఒకానొక గ్రామంలో ఓ రైతు ఉండేవాడు. దేవుడంటే అతనికి వల్లమాలిన భక్తి. ఒకరోజు రైతు కొడుకు తండ్రితో ‘ఎప్పుడూ గుళ్లూ గోపురాలూ అంటుంటావు. అసలు భక్తి అంటే ఏమిటి?’ అని అడిగాడు. ‘సందర్భం వచ్చినప్పుడు సమాధానం చెబుతాన’ని బదులిచ్చాడు రైతు. కొన్ని రోజులు గడిచాయి. ఆడి కృత్తిక నాడు కొండ మీద ఉన్న సుబ్రమణ్య స్వామికి కావడి పూజ చేసే రోజు రానే వచ్చింది. అటక మీద ఉన్న కావడిని దించమని కొడుకును కోరాడు రైతు. నిచ్చెన వేసుకుని అటక మీద కావడిని దించుతున్న కొడుకుతో రైతు ‘కావడి బరువుగా ఉందా?’ అని అడిగాడు. ‘కొంచెం బరువుగా ఉంది’ అని సమాధానం ఇచ్చాడు అబ్బాయి. ఇంట్లో పూజ చేసుకుని కావడిలో పూలు, పండ్లు, ఇతర పూజా సామగ్రి పెట్టుకుని ‘హరోం హర!’ చెబుతూ తండ్రీకొడుకులు ఇద్దరూ కొండ ఎక్కడం ప్రారంభించారు.
ఎంతో ఉత్సాహంగా కొండ మెట్లు ఎక్కుతున్న కొడుకుతో రైతు, ‘కావడిలో స్వామికి సమర్పించే వస్తువులు చాలా పెట్టాం. గుడి కూడా కొండపైన ఉంది. చాలా మెట్లు ఎక్కవలసి ఉంది. నీకు కష్టంగా అనిపించడం లేదా?’ అని ప్రశ్నించాడు. మెరుపు ముఖంతో ‘చాలా తేలికగా ఉంది, ఏమాత్రం బరువు తెలియడం’ లేదు అని బదులిచ్చాడు. చిన్నగా నవ్విన రైతు ‘అటక మీద నుంచి ఖాళీ కావడిని దించేటప్పుడు నీకు అది బరువుగా తోచింది. ఇప్పుడు అందులో బరువు ఉన్నా, కొండ మెట్లు ఎక్కుతున్నా అదే కావడి నీకు బరువుగా తోచడం లేదు. దీన్నే భక్తి అంటారు. భక్తి భావం వల్ల మనం చేసే పని పట్ల శ్రద్ధ పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. ఎంతటి బాధ్యతలనైనా ఇష్టంగా స్వీకరించే సమర్థత కలుగుతుంది. కష్టంగా అనిపించినా ఇష్టంగా చేస్తాం కాబట్టి పని సులభం అవుతుంది. చేరాలనుకున్న గమ్యాన్ని నిశ్చింతగా చేరుకుంటాం’ అని వివరించాడు. ‘నిజమే, భక్తి భావం మనతో ఎన్నో అద్భుతాలు చేయిస్తుంది’ అని తెలుసుకున్నాడు రైతు కొడుకు. కావడి గంటల గణగణ శబ్దాల నడుమ స్వామి వారి దర్శనం చేసుకుని మొక్కుబడి చెల్లించి వెనుదిరిగారు.