ఉపనిషద్ సారం
పరాచః కామా ననుయన్తి బాలాఃతే మృత్యోర్యన్తి వితతస్య పాశమ్ (కఠోపనిషత్తు 4-2)
‘బాలురు (అజ్ఞానులు) బాహ్యములైన సుఖాల వెంట పరుగెత్తుతూ విశాలమైన మృత్యు పాశానికి తగులుకుంటున్నారు..’ అని పై శ్లోకానికి భావం. బుద్ధికి తోచిందల్లా సుఖమే అనుకొని నడుచుకుంటే పాపాలు గుట్టలుగా పెరిగిపోయి చిట్టచివరికి ఘోర నరక బాధల పాలవుతారు.
కిల్బిషం హి క్షయం నీత్వా రుచిరం చైవ చింతయేత్ (అమృతనాదోపనిషత్తు)
‘పాపాన్ని నశింపజేసికొని ఉత్తమమైన ఆత్మను గురించి చింతన చేయాల’ని శ్లోక భావం. పాపాలను నశింపజేసుకుంటే తప్ప ఆత్మ చింతన కుదరదు. కొందరు అదృష్టవంతులకు తపోనిష్ఠులు తమ పుణ్యఫలాన్ని ధారపోస్తారు. అలా వారి ఆత్మోన్నతి సుగమం అవుతుంది.
కర్కశ (నిష్ఠుర) అనే యువతి భర్తను తిడుతూ కొడుతూ అవమానించేది. అత్తమామలను లెక్కించేది కాదు. అక్రమ సంబంధాలకూ తెగబడింది. ఒక విటుడు ‘నీ మగడు లేకపోతే మనమెంతో సుఖించవచ్చు’ అంటాడు. దాంతో ఆమె తన భర్తను బండ రాతితో మోది చంపి, పాడుబడ్డ బావిలో పడవేస్తుంది. కోడలు హింస భరించలేక అత్తమామలూ ఎక్కడికో వెళ్లిపోతారు. కర్కశ మరింత బరితెగిస్తుంది. విటులను ఆకర్షించి వారి నుంచి విరివిగా డబ్బులు దండుకునేది. ఏండ్లు గడిచాయి. కర్కశ వయసు పైబడింది. అనేక వ్యాధులతో తిండి కూడా కరువై దిక్కులేనిదై చనిపోయింది.
యమభటులు ఆమెను నరకానికి తీసుకువెళ్లారు. పర పురుషుల కౌగిలింతలకు మరిగినందుకు మండే ఇనుప స్తంభాన్ని కౌగిలించుకోమన్నారు. భర్తను బండరాయితో మోదినందుకు ముండ్ల గదతో తల బద్దలు కొట్టారు. విపరీతంగా బాధించారు. ఆమె చాలాసార్లు కుక్కగా జన్మించింది. 15వ జన్మలో కళింగదేశంలో కుక్కగా పుట్టినప్పుడు ఒక పుణ్యాత్ముడు కార్తిక సోమవార వ్రతాన్ని ఆచరించాడు. శ్రద్ధగా రుద్రాభిషేకం నిర్వహించి బలి ఆహారాన్ని ఇంటి బయట ఉంచాడు. కుక్కగా పుట్టిన కర్కశ ప్రదోషకాలంలో అటుగా వచ్చి ఆ బలి ఆహారాన్ని భుజించింది. వెంటనే శునకానికి పూర్వస్మృతి వచ్చింది. ‘అయ్యా! రక్షించు’ అని అరిచింది. ఆయన విస్తుపోయాడు. కుక్క మనుష్య భాషలో ‘కామంతో కళ్లు మూసుకుపోయి ప్రవర్తించాను. భర్తను హత్య చేశాను. అనేకమంది విటులతో కులికాను. పతితనయ్యాను. నన్ను ఉద్ధరించు’ అని ప్రార్థించింది. కర్కశ దీనస్థితికి చలించిపోయిన ఆ గృహ యజమాని కార్తిక సోమవార వ్రత పుణ్యాన్ని కుక్కకు ధారపోశాడు. తక్షణమే ఆ శునకం దివ్య తేజస్సు కలిగిన వనితగా మారి కైలాసానికి వెళ్లిపోయింది. పైన పేర్కొన్న రెండు ఉపనిషత్ వాక్యాలకు.. కర్కశ కథ అద్దం పడుతుంది.
…? డా॥ వెలుదండ సత్యనారాయణ