ఈ సృష్టి ఆవిర్భావంతో మానవుడికి ఎటువంటి అధికారిక బంధం లేకున్నా, ఎన్నెన్నో అద్భుతాలు చేయగలుగుతున్నాడు. అయితే, ఈ మనిషి దారి తప్పినప్పుడు.. ఆ దేవుడు సరిదిద్దలేడా? ఈ బొమ్మలకు రంగులు వేసి, అలంకరించి ప్రయోజకులుగా తీర్చిదిద్దలేడా? అవును ఆయన మహాశిల్పి. అంత పనీ చేయగలడు. అదే ఆయన శిల్ప చాతుర్యం. మనం మనుషులం. ఎటైనా మళ్లించుకోవడానికి అనువైన బంకమట్టితో సమానులం. ఇదే విషయం బైబిల్లోని పాత నిబంధనలో ఇర్మియా సంఘటన ద్వారా తెలుస్తుంది. ఇర్మియా ఒక ప్రవక్త. తన ఇరవయ్యో ఏట నుంచీ దైవ మార్గంలో ప్రయాణిస్తూ ఉన్న భక్తుడు. దేవుడి వాక్కు అందరికీ పంచాల్సిన సమయం వచ్చింది.
‘దేవుడు తన బిడ్డల్ని తనవైపు మళ్లించుకుంటాడా’ అనే సందేహాలతో, ఆందోళనలతో ఇర్మియా మనసు డోలాయమానంలో పడింది. ఆ సమయంలో దైవవాక్కు వినిపించింది. అతణ్ని ఒక కుమ్మరి ఇంటికి వెళ్లమన్నది. దైవాదేశాన్ని గౌరవించి ఇర్మియా.. కుమ్మరి ఇంటికి వెళ్లాడు. అక్కడ సారె మీద మట్టితో పని చేస్తున్నాడు కుమ్మరి.
జిగట మన్ను తీసుకొని తనకు కావలసిన రీతిలో దాన్ని మలుస్తూ కనిపించాడు. చిగురు గోటితో అతిసున్నితంగా వయ్యారంగా పాత్రలు తీర్చిదిద్దుతున్నాడు. తన అధీనంలో ఉన్న సారె వేగాన్ని తగ్గిస్తూ, పెంచుకొంటూ కుండలను తయారు చేస్తున్నాడు. ఇర్మియాకు కుమ్మరి చేసిన శిల్పంలో దేవుడి శక్తిసామర్థ్యాలూ స్మరణకు వచ్చాయి. ఆ కుమ్మరి తానే అన్నట్టుగా దేవుడి అంతరార్థం వినిపించింది. దేవుడు చేయనున్న అద్భుతమూ గుర్తుకు వచ్చింది. తన కర్తవ్యం బోధపడింది.
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024