ఆధ్యాత్మిక సాధకులకు పౌర్ణమి విశేష తిథి. ఆనాడు మనసు నిశ్చలంగా ఉంటుందనీ, భగవత్ ఆరాధనకు అనుకూలమనీ భావిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి కార్యసాధకులైన కర్షకుల తిథి. హలం పట్టి.. పొలం దున్నడానికి వారిని ఉద్యుక్తులను చేసే పర్వం ఇది. అదే ‘ఏరువాక పౌర్ణమి’. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అనీ, ఏరువాక అంటే దున్నడానికి వెళ్లడమనీ అర్థం. జ్యేష్ఠ మాసం సగానికి వచ్చేసరికి.. రుతుపవనాలు విస్తరించి వానలు మొదలవుతాయి. పుడమి తల్లి మెత్తబడి.. దున్నకానికి సిద్ధమవుతుంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ‘ఏరువాక’కు సాగిపోతారు రైతులు. పౌర్ణమి నాటికి మృగశిర కార్తె ప్రభావంతో జల్లులు మొదలవుతాయి. ఆపై వచ్చే ఆరుద్ర నుంచి పుబ్బ కార్తె వరకు పడే వర్షాలపైనే పంటలు ఆధారపడి ఉంటాయి. ‘ఏరువాక’ పౌర్ణమి సందర్భంగా సమృద్ధిగా వానలు కురవాలని రైతులు దైవాన్ని ప్రార్థిస్తారు.
పంట పనుల్లో తమకు చేదోడువాదోడుగా ఉండే పశువులను పూజిస్తారు. పశువులను, నాగలి, పార, గునపం వంటి పరికరాలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. ఎడ్లను చక్కగా అలంకరించి, వాటి కొమ్ములకు రంగులు అద్దుతారు. పొలం పనుల్లో తమకు అండగా నిలవాలని కోరుకుంటారు. పొంగలి వండి వాటికి నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత రైతులంతా ఉమ్మడిగా పొలంలోకి దిగి దుక్కులు
దున్నే కార్యక్రమం చేపడతారు.
– శ్రీచరణ్