భూమ్మీద ప్రతిరోజూ ఎన్నో జీవులు పుడుతున్నాయి, కన్నుమూస్తున్నాయి. వాటిలో మనిషి ఒకడు. ప్రతి జీవికీ బతుకు పోరాటం ఉంటుంది. ఆపద వస్తే అందులోంచి బయటపడాలనే ఆరాటమూ ఉంటుంది. అందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మనిషి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తాడు. పోరాడాల్సిన సమయంలో పారిపోవాలనుకుంటాడు. కష్టాలు వస్తే ఎవరినో నిందిస్తాడు. సంతోషాలు వెల్లువెత్తితే అవి శాశ్వతమని భ్రమలో పడిపోతాడు. మనసు విసిరే ప్రలోభాలకు చిక్కుకుపోయి స్వార్థంతో వ్యవహరిస్తుంటాడు. తాత్కాలిక సంతోషం కోసం సాటి మనుషుల, ఇతర జీవుల శాంతిని, ఆనందాన్ని దూరం చేస్తున్నాడు. తనూ సుఖిస్తున్నాడా అంటే, ఆ సంతోషం మూణ్నాళ్ల ముచ్చటే! మళ్లీ కష్టాలు, మళ్లీ పోరాటాలు.
కష్టాలకు కుంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా కట్టుదిట్టంగా బతకడం ఎలా సాధ్యం? మనసును అదుపులో ఉంచుకోగలిగితే అది సాధ్యమే అన్నారు మన రుషులు. మనసును ఎలా అధీనంలో ఉంచుకోవాలో, జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో పెద్దలు సూచించారు. దానికి అనువైన మార్గం ధ్యానం. ధీ, యానం పదాల కలయికే ధ్యానం! ధీ అంటే బుద్ధి. యానం అంటే ప్రయాణం. అందరూ బుద్ధితో జీవనం కొనసాగించడమే ధ్యానం. దీన్నే తపస్సు అన్నారు. తపస్సు అంటే కారడవిలో ఒంటరిగా కూర్చోవడం కాదు. హిమగిరులకు వెళ్లి సమాధి స్థితికి చేరుకోవడమూ కాదు. ఉన్నచోటే ఉన్నతంగా ధ్యానం కొనసాగించవచ్చు. ధ్యానం ఒక ప్రక్రియ. అనుక్షణం సంకల్ప వికల్పాలకు గురయ్యే మనసును నిలబెట్టడమే ధ్యానం. ఏ ఆలోచనా లేని స్థితికి చేరుకోవడమే దాని లక్ష్యం. మనసులో శూన్యమైనప్పుడు మనిషికి తనేంటో అర్థమవుతుంది. నిజమైన సంతోషం ఏంటో అవగతమవుతుంది.
ధ్యానం అంటే కష్టంతో కూడుకున్న క్రతువు అనుకోవద్దు. అతి తేలికైన పని. అంతులేని ఆనందాన్ని ఫలితంగా ఇచ్చే క్రియ ఇది. మంత్రాన్ని పఠిస్తూ, జపమాలను తిప్పితే ధ్యానం అనిపించుకోదు. శ్వాసక్రియపై దృష్టి సారించడమే నిజమైన ధ్యానం. సహజంగా సాగే ఉచ్ఛ్వాస, నిశ్వాసను ఏకధారగా గమనించాలి. ఈ క్రమంలో మనసు పక్కకు మళ్లుతుంది. మస్తిష్కంలో రకరకాల ఆలోచనలు రేగుతుంటాయి. వాటిని పట్టించుకోకుండా దృష్టంతా శ్వాసపైనే కేంద్రీకృతం చేయాలి. కొన్నాళ్ల సాధన తర్వాత మనసు కాస్త కుదుటపడుతుంది. ఆలోచనలు తగ్గుముఖం పడతాయి. శ్వాసక్రియ సజావుగా సాగుతుంది. మరికొన్నాళ్లకు మనసు ఆలోచనారహిత స్థితికి చేరుకుంటుంది.దాంతో ఆధ్యాత్మిక అవగాహన మొదలవుతుంది. గౌతముడు ధ్యాన సాధనతోనే బుద్ధుడిగా అవతరించాడు.
‘పని చేస్తుంటే పనిమీద ధ్యాస- పని లేకుంటే శ్వాసమీద ధ్యాస’ అని మన రుషులు పేర్కొన్నారు. అంటే పని మీదే పూర్తి ధ్యాస పెట్టడంతో మనకు ఏ ఆలోచనలూ ఉండవు. ఆసక్తి ఉన్న పనిలో ఇట్టే నిమగ్నులమవుతాం. ఇష్టం లేని పని దగ్గరికి వచ్చేసరికి కుదురుగా ఒక్క పది నిమిషాలూ చేయలేం. ధ్యానం విషయంలోనూ అంతే, దానిపై ఇష్టం పెంచుకుంటే గానీ, సాధన కొనసాగించలేం. శారీరక సమస్యల నుంచి బయటపడటానికో, మానసిక ఉత్సాహం కోసమో ధ్యానం వారధి అనుకుంటే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆరోగ్యం అనేది ధ్యానం వల్ల కలిగే తొలి ప్రయోజనం మాత్రమే! ధ్యానంతో సిద్ధించే అంతిమ ప్రయోజనం ఊహాతీతమైన ఆనందానికి కారణమవుతుంది. ధ్యానంపై మనసు నిలపగలిగితే, జీవన సౌందర్యం అవగతమవుతుంది. దైవీశక్తి విశిష్టత తెలుస్తుంది. మనిషిని క్షణక్షణం వెంటాడే మరణ భయం కూడా మాయమైపోతుంది. అతీతమైన స్థితికి చేరిన మనిషికి అనంతమైన తృప్తి, అచంచలమైన విశ్వాసం వరాలుగా లభిస్తాయి.
-టి.వి.ఫణీంద్రకుమార్