తాను నమ్మింది, తనకు ఆచారమైనది, తన గురు పరంపర ఇచ్చిన అవగాహన కు పరిమితమైన జీవనాన్ని గడిపేవారు ఎందరో ఉంటారు. వాళ్లు క్రమంగా ఆ పరిధిలో సంస్కారవంతులై నిర్భయంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారన్నది సత్యం. తాము తపించిన పరలోక ప్రాప్తికి సులభంగా పాత్రతను సాధిస్తారన్నది కూడా సమర్థనీయం. ఇది ఏ మత విశ్వాసానికి సంబంధించైనా నిలబడగలిగే నిజం. అయితే, ఆయా దేశకాలాల్లో, సంప్రదాయాల్లో కొన్ని వైపరీత్యాలు చోటుచేసుకొనే సందర్భాలు వస్తాయి. అప్పుడు కొందరు ప్రతిభావంతులైన, కరుణామయులైన, కర్తవ్య నిష్ఠులైన చింతనాపరులు వారివారి దర్శనానికి అందినమేరకు ఆనాటి సంప్రదాయాలలో సంస్కరణలను ప్రవేశపెడతారు. కొందరు ఆ సంస్కరణలను ప్రత్యేక మార్గంగా ప్రకటించి, ప్రస్థాపించి, వాటి పరివ్యాప్తికై ప్రచారం చేస్తారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న వికారాలను మాత్రమే ఎత్తిచూపి పూర్వ సంప్రదాయంలోని గొప్ప విశిష్టతలను ప్రశంసించక నిరసిస్తారు. ఇక వారి తర్వాతి అనుయాయు ల్లో మరింత లోతైన, సంకుచితమైన, విభజనాత్మకమైన హానికర ధోరణులకు దారితీస్తుంది.
ఏ దేశంలో అయినా, ఏ కాలంలో అయినా మత, సామాజిక, సాంస్కృతిక సంస్కరణలు ప్రధానంగా మానవ జీవితానికి మరింత భద్రతను, శాంతిని, సమృద్ధిని ఇవ్వడానికేనన్నది ఎవ్వరూ నిరాకరించలేని నిజం. వీటిలో మతం, మత సంస్కరణలు సగటు మనిషిపై అధిక ప్రభావాన్ని చూపుతాయి. ప్రత్యక్షంగా అనుభవించే ఇహానికి, ఊహాత్మకమైన శాశ్వత పరానికి కూడా విస్తరించిందని అనడం వల్ల; మత ప్రభావం మానవ సమాజంపై విస్తారంగా, ప్రగాఢంగా ఉంటుంది. సాధారణంగా మతంలో విజ్ఞత పాలుకన్నా విశ్వాసం పాలు చాలా ఎక్కువ. అది ఆచారనిష్ఠను, ఆ పరిమితులలో అనుభూతి గాఢతను పెంచడంలో దోహదపడుతుంది.
కానీ, తమకు భిన్నమైన సంప్రదా యాల విశిష్టతను, ఔన్నత్యాన్ని అవగాహన చేసుకొని అనుభూతి చెందగల ఆర్ద్రతను దూరం చేస్తుంది. చాలా సందర్భాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత కొంతకాలం వరకు సమర్థంగా, ఫలవంతంగా కొనసాగి మెల్లగా బలహీనపడతాయి. కాలక్రమేణా వాటి ప్రవర్తకులు అధికార కేంద్రాలకు దగ్గరై, అహంకరించి, ఇక తమది ఏ సంస్కరణం అవసరం లేని పరమోన్నతిగా నిర్ణయించుకొని, ఇతర సంప్రదాయ మార్గాల వన్నెను గ్రహించక దూషిస్తూ తమ మార్గవ్యాప్తికై అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
అన్ని మతాలవారికి ఆధారమైన ప్రకృతి ఒకటేనని, మతాతీతంగా అందరి భౌతిక అవసరాలు ఒకటేనని, అన్ని రకాల వ్యాధులు అన్ని మతాలవారికి వ్యాపిస్తాయని, వాటి చికిత్సకు కావలసిన వైద్యం అందరికీ సమానమేనని, అందరి మరణం ఒకే రకమైనదని, మరణానంతరం దేహం శిథిలమై ఒకే విధంగా మట్టిలో కలుస్తుందన్న మామూలు జ్ఞానం కూడా కరువై కల్పించుకున్న విభజనలలోనే కూరుకుపోతారు. ఏ మతమైనా, సంప్రదాయమైనా బుద్ధిని తేటపరచడానికి, మనసును తేలికపరచడానికి, బాధ్యతగా ధర్మాన్ని ఆచరింప జేయడానికి, ఆర్ద్రతతో సమాజంలో వ్యవహరించడానికి, ప్రకృతిపై ఆరాధనా భావాన్ని పెంచడానికి దోహదపడే పవిత్ర ఉపకరణమన్న ‘విజ్ఞత’ను కోల్పోతా రు. గుడ్డి నమ్మకంతో, సంకుచితమైన పిడివాదంతో జీవనాన్ని సాగిస్తారు.
మనిషిని సంస్కరించడానికి మతమెంత అవసరమో, మతాన్ని సంస్కరించడా నికి విజ్ఞత, శాస్త్రవిజ్ఞాన నిరపేక్ష దృష్టి అంతే అవసరం. అదే సంస్కరణ పథాన్ని నిర్దేశించేది, నిర్మించేది. ఆ దృష్టే లేకుంటే తమ దైవభావన ఆధారంగా కలిగే పారవశ్యమే భక్తిగా నిర్ణయించుకొని, ఒక అలగానే బతికి, తమ సముద్ర తత్వానికి దూరమై విశ్వాత్మీయమైన, భక్తియోగమైన శివానుభవాన్ని చేజార్చుకొని నిష్క్రమించడం జరుగుతుంది. విశ్వాసం విశ్వాసంగా వికసించ గలుగుతుంది. కానీ, అది విభిన్నతను కౌగిలించుకుంటూ వీచగలిగింది మాత్రం విజ్ఞతతోనే!
-యముగంటి ప్రభాకర్ 94401 52258