Dharmapuri | ధర్మపురి : లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ధర్మపురిలో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ధర్మపురి బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో ఉగ్ర నారసింహుని తెప్పోత్సవం, డోలోత్సవం ఘట్టం బుధవారం కనుల పండువలా సాగింది. ఆస్థాన వేదబ్రాహ్మణుల మంత్రోచ్చరణల మద్య ఆలయ అర్చక స్వాములు మధ్యాహ్నం వేళలో స్వామివారల ఉత్సవమూర్తులను సేవలపై వేంచేపు చేసి మంగళవాయిద్యాలతో బ్రహ్మపుష్కరిణికి వద్దకు తీసుకువచ్చారు. అనంతరం తెప్పపై బ్రహ్మపుష్కరిణి నీటిలో ఐదుసార్లు ప్రదక్షిణలు చేయించారు.
భక్తులు నారసింహ నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి హంసవాహనం ముందు మహిళల కోలాటలు అలరించాయి. అనంతరం స్వామివారల సేవలను బ్రహ్మపుష్కరిణి మధ్యగల మండపంలోని ఊయలపై ఆశీనులను చేసి, సంప్రదాయం ప్రకారం.. అర్చకులు స్వామివారల డోలోత్సవం నిర్వహించారు. భక్తులు క్యూలైన్లో వెల్లి స్వామివారలపై బుకాగులాలు చల్లి కట్నకానుకలు సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.
మహారాష్ట్రతో పాటు నిజామాబాద్ జిల్లా నుంచి అధికంగా భక్తులు డోలోత్సవానికి తరలివచ్చారు. అనంతరం నెత్తిమీద ముల్లెమూట పెట్టుకొని తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి వరకూ స్వామివారి డోలోత్సవం నిర్వహించగా బ్రహ్మపుష్కరిణి విద్యుత్ దీపాలతో కాంతులీనింది. కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్, రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, ఇనుగంటి రమావేంకటేశ్వరరావు, గందె పద్మ, గునిశెట్టి రవీందర్, వేముల నరేశ్, చుక్క రవి, గుంపుల రమేశ్, జైన రాజమౌళి, సంగెం సురేశ్ తదితరులు పాల్గొన్నారు.