Maha Shivratri 2025 | ఈ చరాచర సృష్టికి లయకారకుడు మహేశ్వరుడు. పరమేశ్వరుడు లింగోద్భవం చెందిన రోజునే మహాశివరాత్రి. ఈ జగత్తును నడిపించే శివుడు మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజున శివలింగంగా ఆవిర్భవించిన రోజు కావడంతో మహాశివరాత్రి జరుపుకుంటారు. శివ అనే పదానికి శుభపద్రం, మంగళకరం అన్న అర్థాలు ఉన్నాయి. శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ చేయాల్సిందే.
లింగోద్భవ కథ..
మహాశివరాత్రి, లింగోద్భవానికి సంబంధించిన ఓ పురాణ కథ ఉన్నది. లింగ పురాణం, శివ పురాణం, స్కంద పురాణం, కూర్మ పురాణం, వామన పురాణం, బ్రహ్మాండ పురాణం, వాయు పురాణం వంటి అనేక పురాణాల్లో లింగోద్భవం గురించి ప్రస్తావన ఉంటుంది. పూర్వం విష్ణువు, బ్రహ్మల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం తలెత్తింది. ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై.. లింగంగా జ్యోతిర్లింగంగా ఆవిర్భవిస్తాడు. ఆ మహా శివలింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని బ్రహ్మ, విష్ణువులకు చెబుతారు. ఇద్దరూ ఈ శివలింగం ఆది, అంతాలను గుర్తించలేకపోతారు. ఆ తర్వాత ఇద్దరికీ కనువిప్పు కలుగుతుంది. పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భవించిన ఈ రోజునే శివరాత్రిగా పండితులు చెబుతారు.
అయితే, ప్రళయ కాళరాత్రి అనంతరం.. జగన్మాత కోరిక మేరకు పరమేశ్వరుడు మళ్లీ జీవకోటిని ఉద్భవింపజేసినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఇక శివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం సంప్రదాయంగా వస్తున్నది. శివరాత్రికి ముందు రోజు ఒక్కపూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి రోజున ఉదయం స్నానం పూర్తి చేసుకొని ఆలయానికి వెళ్లి ఆ మహేశ్వరుడి దర్శనం చేసుకొవాలి. నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉపవాసం చేయాలి. రాత్రి వేళలో శివలింగానికి పూజలు చేస్తూ.. జాగరణ చేయాలి. ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకం తదితర కార్యక్రమాల్లో పాల్గొంటే శివానుగ్రహం తప్పక లభిస్తుంది. వాస్తవానికి.. అందరు దేవతామూర్తులను వారి రూపంలో ఉండే విగ్రహాలను కొలుస్తాం.
అయితే, కేవలం శివుడిని మాత్రమే లింగంగా పూజిస్తాం. నిండు మనసు, భక్తితో కొలిస్తే ఆ భోళాశంకరుడు ప్రత్యక్షమై వరాలను కురిపిస్తాడు. క్షీరసాగర మధనతో బయటకు వచ్చి.. యావత్ సృష్టిని దహించేందుకు సిద్ధమైన హాలాహలాన్ని కంఠంలోనే దాచుకొని నీలకంఠుడిగా నిలిచాడు. తన శరీరంలోనే పార్వతీదేవికి అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. యముడి బాధ నుంచి రక్షించాలని కోరిన భక్త మార్కండేయుడిని చిరంజీవిగా దీవించాడు ఆ మహేశ్వరుడు. లింగోద్భవ సమయంలో మారేడు దళాలతో అర్చిస్తే 76 జన్మల్లో చేసిన పాపలు నశిస్తాయని సాక్షాత్తు ఆ శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని జలంతో అభిషేకించడం, భస్మం సమర్పించడం కూడా శుభకరమని పండితులు పేర్కొంటున్నారు.