దీపావళి అంటే ఏదో అభ్యంజనం చేయటం, కొత్త దుస్తులు వేసుకోవటం, టపాసులు కాల్చటం…. ఇంతవరకే ఇప్పటి సమాజంలో వాడుకలో ఉంది. కానీ, దీపావళి రోజున పాటించాల్సిన ఆచారాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చాలా వరకు కాలక్రమంలో మరుగున పడిపోయాయి.
నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగాదేవి ఉంటుందని శాస్ర్తాలు చెబుతున్నాయి. అందుకనే నరకచతుర్దశి రోజున సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, నువ్వులనూనెతో అభ్యంజనం చేయాలి. ఆ తర్వాత నరకుడిని ఉద్దేశించి నాలుగు వత్తులతో కూడిన దీపాన్ని దానం చేయాలి. సాయంత్రం వేళ దేవాలయాల్లో దీపారాధన చేయాలి.
దీపావళి రోజున సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో స్నానం చేసి, కొత్తదుస్తులు ధరించాలి. మామిడి, అత్తి, నేరేడు బెరళ్లను నీటిలో వేసి స్నానం చేసే ఆచారం కూడా కొన్నిచోట్ల ఉంది. శక్తిని అనుసరించి అన్నదానం, సాయంత్రం వేళ దేవాలయాల్లో దీపారాధన, దీపదానం చేయాలి.
కొన్ని ప్రాంతాల్లో చెక్కతో చెట్లవలే చేసి, అందులో దీపాలు వెలిగించే ఆచారం కూడా ఉంది. వీటినే దీపవృక్షాలు అంటారు.
మరికొన్ని చోట్ల ఆకుదొన్నెల్లో దీపాలు వెలిగించి, నదిలో వదిలే ఆచారం కనిపిస్తుంది. దేవాలయాల్లో నిలువెత్తు ఇత్తడి కుందుల్లో దీపాలు వెలిగిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో దీపావళి సాయంత్రం వేళ మహిళలు చీపుర్లు పట్టుకుని, తప్పెట్లు వాయిస్తూ జ్యేష్ఠాదేవిని (లక్ష్మీదేవి సోదరి, దరిద్ర దేవత) ఇంటి నుంచి తరుముతున్నట్లు అభినయిస్తారు. ఆ తర్వాత ఇంటిని ఊడ్చి, ముగ్గులు వేసి, ఇంటిని అలంకరిస్తారు.
దీపావళి రోజున ఇంటి ఆచారాన్ని అనుసరించి లక్ష్మీదేవిని పూజించాలి. ప్రదోషకాలంలో దీపారాధన చేసి, శాస్ర్తోక్తంగా లక్ష్మీపూజ చేసి, బంధుమిత్రాదులతో కలిసి మధురపదార్థాలు భుజించాలి. పూజ అనంతరం ఇంటి నిండా దీపాలు వెలిగించాలి.