Devotional | ఓ గ్రామంలో దేవుడి మీద నమ్మకంలేని ఒక యువకుడు ఉండేవాడు. అదే గ్రామంలోని గుట్టమీద సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ప్రతి నెలా కృత్తికా నక్షత్రం నాడు స్వామివారికి గ్రామస్తులు ప్రత్యేక అభిషేకం చేసేవారు. ఆ రోజు కృత్తిక. ఊళ్లో వాళ్లంతా పూజ సామగ్రి తీసుకొని బయల్దేరుతున్నారు. గుడికి వెళ్తూ ఊరి పెద్ద ఆ యువకుడిని అభిషేకానికి రమ్మని పిలిచాడు. ‘నేను రానంటే రాను’ అని మొండికేశాడు ఆ యువకుడు. అతను మొండికేసే కొద్దీ ఊరిపెద్దలో కూడా పట్టుదల పెరిగింది. మరింత గట్టిగా గుడికి రమ్మని ఒత్తిడి చేశాడు. ఆ యువకుడు మొండికేసి.. చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఊరి జనమంతా అక్కడికి వచ్చి చేరారు. వెంటనే ఆ ఊరి పెద్ద.. ఆ యువకుడిని చెట్టు పైనుంచి కిందికి దూకమని కోరాడు. ‘ఇంత ఎత్తు నుంచి దూకితే దెబ్బలు తగులుతాయి కాబట్టి.. నేను దూకను’ అని మొరాయించాడు ఆ యువకుడు.
అప్పటికప్పుడే ఊళ్లో యువకులు కొందరిని పురమాయించి, పెద్ద వల ఒకటి తెప్పించాడు ఊరిపెద్ద. పదిమంది వల పట్టుకోమని.. ఆ యువకుడిని దూకమన్నాడు. అతను మరో ఆలోచన లేకుండా చెట్టు పైనుంచి దూకాడు. ఏ గాయమూ కాలేదు. తర్వాత యువకుడిని పిలిచిన గ్రామపెద్ద.. ‘మొదట దూకమంటే భయపడ్డావ్. వల పట్టుకోగానే దూకావు. ఆ వల లాంటిదే దైవం మీద నమ్మకం. మానవ మాత్రులమైన మనం జీవన సమరంలో ఎన్నో ఆటుపోట్లకు గురవుతుంటాం. ఎన్ని కష్టనష్టాలొచ్చినా ఆ దేవుడు మనల్ని కాపాడుతాడని నమ్మితే మనం ముందుకు పోగలం. సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలం. లేకుంటే సమస్యల దగ్గరే ఆగిపోతాం’ అని వివరించాడు. ‘దేవుడు ఉన్నాడన్న నమ్మకం మనకు బలాన్ని, సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది’ అనుకుంటూ అందరితో పాటూ గుడికి కదిలాడు.