గురునానక్ ఐక్యతకు ప్రతిరూపం. మతసామరస్యాన్ని బోధించిన మహనీయుడు ఆయన. మత విద్వేషాలు, అరాచకం ప్రబలుతూ ప్రజలు అనైతికతకు పాల్పడుతున్న రోజుల్లో నానక్ బోధనలు కొత్తదారిని చూపాయి. ‘కులం, మతం ద్వారా వ్యక్తి హోదాను నిర్ణయించలేం. అన్ని కులాలు ఒకటే’ అని ఆయన సూక్తి. ఏ మతం అయినా ప్రేమనే బోధిస్తుంది. ఎదుటివారిని ప్రేమతోనే గెలవాలని చెబుతుంది. వ్యక్తి సాధుత్వం కలిగి ఉండాలి. మితంగా మాట్లాడాలి. సాటి మనుషులపట్ల స్నేహభావం కలిగి ఉండాలి. మహిళలను గౌరవభావంతో చూడాలి. గురునానక్ చేసిన బోధనలు ఇవి. ఒక ప్రత్యేక మతాన్ని స్థాపించినా.. పరమత సహనాన్ని కూడా ఉద్బోధించారు.
గురునానక్ దేవ్ 1468లో కార్తిక పౌర్ణమినాడు, పంజాబ్లోని తల్వండి (ప్రస్తుతం పాకిస్థాన్లో ఉంది)లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు తృప్తాదేవి, కాలూచంద్. చిన్నప్పటి నుంచి నానక్ ఆధ్యాత్మిక చింతనలో గడిపేవారు. కబీర్దాస్ బోధనలు ఆయన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఎప్పుడూ ఏదో అన్వేషిస్తున్న వాడిలా తిరిగేవారు. భగవంతుడు ఒక్కడే అని ప్రబోధించారు. దుర్గుణాలు వీడటమే ఆధ్యాత్మిక సాధనకు మొదటి అర్హత అనేవారు. ఆయన బోధనలే కాదు, జీవితమూ ఆదర్శప్రాయం. జీవితంలో ఏనాడూ కోపం ఎరగని వ్యక్తి నానక్. ‘ఆ భగవంతుడి కృప నాపై ఉంది. ఎల్లప్పుడూ దైవచింతనలో గడిపేవారందరికీ దైవానుగ్రహం ఉంటుంది’ అనేవారు నానక్. అంతేకాదు మౌనాన్ని మించిన సాధన లేదని చెప్పేవారు. ‘మౌనంగా ఉండటం అంటే ఏ పని చేయకుండా సోమరిగా కూర్చోవడటం కాదు. ధర్మబద్ధమైన పనులు చేస్తూ, అందులో నిమగ్నులై ఉండటం కూడా తపస్సే. ఇది వ్యక్తులలోని రుగ్మతలను పోగొడుతుంది’ అని బోధించారు గురునానక్.
-కనుమ ఎల్లారెడ్డి , 93915 23027