‘ఆరు నెలలు సావాసం చేస్తే.. వాళ్లు వీళ్లవుతారు’ అని నానుడి. జీవన ప్రస్థానంలో మంచివారు తారసపడటం, వారితో స్నేహం కుదరడం గొప్ప వరం. అలాంటి స్నేహాన్ని పొందిన వారంతా తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకున్నవారే. చెడ్డవారితో పొసగేది కొద్దిరోజులే అయినా.. అది దిద్దుకోలేని తప్పుగా పరిణమిస్తుంది. రాముడితో స్నేహం చేసి సుగ్రీవుడు బాగుపడ్డాడు. శ్రీరాముడి శరణుపొంది విభీషణుడు లంకేశ్వరుడు అయ్యాడు. ఏదో ఆశించడం వల్ల చిగురించిన స్నేహాలు కావు ఇవి. అయినప్పటికీ వీరి స్నేహం వల్ల ఇరుపక్షాలు లబ్ధిపొందాయి.
చెడు సావాసాల వల్ల జీవితాలు ఎంతగానో కుదేలవుతాయి. దుర్యోధనుడి స్నేహంతో కర్ణుడి ప్రభ మసకబారింది. అతని వీరత్వం పనికిరాకుండా పోయింది. ఎంతటి దానగుణ సంపన్నుడు అయినప్పటికీ అధర్మవర్తనుడన్న అపకీర్తి మిగిలింది. సహజంగా దుష్టస్వభావం కలిగిన దుర్యోధనుడు.. కర్ణుడిని చేరదీయడానికి అనేక కారణాలు ఉన్నాయి. వైరి పక్షంలోని అర్జునుడిని ఢీకొట్టగల శక్తిమంతుడు కర్ణుడే అని విశ్వసించాడు దుర్యోధనుడు. అతణ్ని అక్కున చేర్చుకుంటే కాగల కార్యం తీరుస్తాడని నమ్మాడు. అందుకే, ఆనాటి వ్యవస్థలో రాధేయుడి అర్హతను కురువృద్ధులు ప్రశ్నించినా పట్టించుకోలేదు. కర్ణుడిని అంగ రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. అడగక ముందే తనను అందలం ఎక్కించిన దుర్యోధనుడిని మిత్రుడిగా భావించాడు కర్ణుడు. తన జీవితం అతనికే అంకితం అని స్నేహహస్తం చాచాడు. కానీ, దుర్యోధనుడి సావాసంతో కర్ణుడు కూడా దుర్మార్గాన్ని అనుసరించాడు. తన మిత్రుడు చేసిన ప్రతి పనికీ మద్దతుగా నిలిచాడు. మాయాజూదాన్ని కళ్లప్పగించి చూశాడు. ఘోషయాత్ర సందర్భంగా పాండవులను కవ్వించాడు. వారి అజ్ఞాతవాసా న్ని భంగపరచడానికి విరాటరాజ్యంపై దండెత్తే క్రమంలోనూ ముందున్నాడు. దుష్టసావాస ఫలితం అనుభవించాడు. వర పుత్రుడిగా జన్మించిన కుంతీసుతుడు వరుస శాపాలతో సమరంలోకి అడుగుపెట్టడానికి ముందే క్షతగాత్రుడు అయ్యాడు. ఇదే సమయం లో కర్ణుడి సావాసం దుర్యోధనుడి సహజ స్వభావాన్ని మార్చకపోవడం గమనార్హం.
సుగ్రీవుడి కన్నా బలవంతుడు అని తెలిసినా, సీతాన్వేషణ సులభమవుతుందని గ్రహించినా.. దారితప్పిన వాలితో శ్రీరామచంద్రుడు స్నేహం ఆశించలేదు. అల్పులు, దుష్ట స్వభావం కలిగిన వారితో స్నేహం చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. సదాచారవంతులు అలాంటి వ్యక్తులకు ఎప్పుడూ దూరంగా ఉంటారు.
– టి.వి.ఫణీంద్రకుమార్