కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్
పల్ మే పర్లయ హోయగీ, బహురి కరేగా కబ్
తత్త్వవేత్త కబీరు ప్రవచించిన దోహాలలో ఇది ప్రసిద్ధమైనది. దీని భావాన్ని ఆకుల శివరాజ లింగకవి ‘సంతు కబీరు సూక్తి సుధ’ గ్రంథంలో ఇలా ఆవిష్కరించారు.
రేపటి కార్యము నేడొనరించుము
ఇప్పుడే సేయుము నేటి కర్మమును
ఏ క్షణమున నే ప్రళయము జరుగునో
ఏమిసేయలేవటు తర్వాతను
ఇందులోని భావం సామాన్యంగా అందరూ చెప్పుకొనేదే! కానీ, దీనిలో కబీరు చెప్పదలుచుకున్న అంతరార్థం వేరే ఉంది. ఇందులో ఆయన కర్మను గురించి హెచ్చరించాడు. ‘ఎందుకంటే కర్మే దైవం. అదే మన నొసటి రాతను రాసేది’ అని ప్రాజ్ఞులు అంటారు. కర్మ గురించి చెబుతూ ‘ఏ విత్తనం నాటితే ఆ చెట్టే మొలుస్తుంది..’ అని కొందరు విశ్లేషిస్తారు. రేపు చేసేది ఈ రోజే చేయమని, ఈ రోజు చేసేది ఇప్పుడే చేయమని కబీరు ప్రబోధించినది మనం నిర్వర్తించే కర్మ గురించి. గుణవంతుడు అంటే సద్గుణవంతుడే అన్నట్టు.. కర్మ అంటే సత్కర్మ అని ఇక్కడ అర్థం గ్రహించాల్సి ఉంటుంది.
సత్కర్మలను అనుకున్న వెంటనే ఆచరించాలి. ‘రేపు చేద్దాంలే! తర్వాత చూద్దాం లే!’ అని వాయిదా వేయకూడదు. రేపటికి మన మనసెలా మారిపోతుందో? ఎవరూ ఊహించలేరు. ఉదాహరణకు ధార్మిక కార్యక్రమాల కోసం ఉదార విరాళాన్ని ప్రకటించిన పెద్దమనుషులు ఎందరో మనసు మారిపోగా, సమయానికి మాట తప్పిన సందర్భాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. తర్వాతి రోజు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. అందుకే సత్కర్మ చేయాలనుకుంటే తక్షణం కార్యరంగంలోకి దిగాలి.
మరో కోణం నుంచి కర్మనే దేవుడు అంటున్నాం. సత్కర్మనే దేవతార్చనగా భావించినా అసమంజసం కాదు. సృష్టిలో మనం చేయగలిగిన పనే మన ముందుకు వస్తుం ది. ప్రకృతి అటువంటి ఏర్పాటు చేస్తుంది. నిజం చెప్పాలంటే కర్మ మనల్ని తరింపజేయడానికే మన దగ్గరికి వస్తుంది. కాబట్టి, జాగ్రత్తగా దగ్గరికి వచ్చిన కర్మను తిరస్కరిస్తూ పోతే వెనుకబడిపోతాం. మనం ఎక్కడ కర్మను అపార్థం చేసుకొని తిరస్కరిస్తామో అనే ఆదుర్దా కొద్దీ కబీరు నిగూఢంగా ఈ దోహాలో సత్కర్మను తక్షణం చేయాల్సిందిగా హెచ్చరించాడు.
-డా॥ వెలుదండ సత్యనారాయణ, 94411 62863