రామ నామం రమ్యమైనది. శివ నామం సుందరమైనది. భగవన్నామం ప్రతిదీ మనోహర మైనదే! భక్తులను ఆధ్యాత్మిక తీరాలకు
చేర్చేదే! నిశ్శబ్దాన్ని ఛేదించు.. శబ్దాన్ని ప్రేమించు. నామస్మరణలో తరించు!! మనసును సంస్కరించు!!
భాష మానవుడిని జంతువు నుంచి వేరు చేస్తుంది. భాష మానవ సమాజాన్ని ఏకీకృతం చేసి ముందుకు నడిపిస్తుంది. భాషకు మూలం శబ్దం. ఈ శబ్దాన్ని జంతువులు కూడా చేస్తాయి. కాని, ఆ శబ్దం వాటి కనీస అవసరాలు తీరేంత వరకే ఉపయోగపడుతుంది. మానవుడి భాష అభివృద్ధికే కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి, సత్యశోధనకు కూడా ఉపయుక్తమవుతుంది. ఆ భాష వల్లే వివిధ శాస్ర్తాలు ఉద్భవించి, పరిణతి చెందాయి. అయితే, ఈ విద్యలన్నింటిలో పరావిద్యే గొప్పదని, దాని ద్వారానే సత్యాన్ని తెలుసుకోవచ్చని అంటుంది ముండకోపనిషత్తు.
‘నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే’ అంటుంది భగవద్గీత. జ్ఞానాన్ని మించిన విద్య లేదన్నది మన సనాతన ధర్మం. విజ్ఞానం భౌతిక శాస్ర్తాలకు చెందినది కాగా, జ్ఞానం సత్యశోధనకు సాధనం. ఐతే జ్ఞానం ఎందరికి లభ్యం? కాబట్టి, మన పూర్వికులు ఈ జ్ఞాన మార్గంతోపాటుగా, ఈతి బాధలను ఎదుర్కొందుకు, మానసిక నిబ్బరాన్ని, ప్రశాంతతను సాధించేందుకు భక్తి మార్గాన్ని కూడా సూచించారు. ఆ భక్తిమార్గాన్ని అవలంబించేందుకు వివిధ మార్గాలను నిర్దేశించారు. వాటినే నవవిధ భక్తిమార్గాలుగా పేర్కొన్నారు.
శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం
అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం
వీటిలో స్మరణమే ‘నామ స్మరణం’. శబ్దం అత్యంత ప్రభావశీలి. శబ్దం స్థాయి పెరిగే కొద్దీ మానవుడి మనసు ప్రభావానికి లోనవుతుంది. శబ్దం 70 డెసిబుల్ తీవ్రతను దాటితే మనసుకు చికాకు కలుగుతుంది. నిశ్శబ్దంలో మనసు
ప్రశాంతంగా ఉంటుంది. అయితే, మనసులో ఆలోచనలు చెలరేగకుండా చూసుకుంటేనే ఈ ప్రశాంతత సాధ్యం. శబ్ద జనిత సంగీతం విని జంతువులు తన్మయత్వానికి గురవుతాయని, చెట్లు, మొక్కలు ప్రతిస్పందిస్తాయని శాస్త్రీయ నిరూపణ కూడా జరిగింది.
ప్రస్తుత సమాజం అనేక సంక్లిష్టతలతో మనుగడ సాగిస్తున్నది. ఈ విపత్కర పరిస్థితుల్లో మానవుడు తన లక్ష్యాన్ని సాధించడం, జీవితాన్ని ధైర్యంతో, ఆనందంతో గడపడం కష్టతరంగా మారుతున్నది. జీవితాన్ని సులభరీతుల్లో గడపడం, దానికో పరమార్థాన్ని కలుగజేయడం, ఆ పరమార్థాన్ని ఆనందంతో సాధించడం అత్యావశ్యకం. అందుకే మనిషి తన మెదడును నియంత్రించాలంటే ఏదో ఒక సాధనం కావాలి. అది ధ్యానమే కావచ్చు, నామస్మరణమే కావచ్చు లేదా ఇతర ఏ
రకమైన మార్గమైనా కావచ్చు. వీటన్నింటిలో నామస్మరణ అత్యంత సులభరీతి. పనిలో ఉన్నా, కాలక్షేపంలో ఉన్నా, విశ్రాంతిలో ఉన్నా నామస్మరణను సులభరీతిలో ఆచరించవచ్చు.
మరి ఏ నామమనే ప్రశ్న ఉదయించవచ్చు. భాషలో ప్రతి పదానికి ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది. ఆ పదాన్ని ఉచ్చరించడం వల్ల, ఆ అక్షరాల వల్ల ఉత్పన్నమయ్యే శబ్దం ప్రభావం మెదడులోని న్యూరాన్ల మీద పడి వాటిని నియంత్రిస్తుంది. ఆ శబ్ద కంపనాలు న్యూరాన్లపై ప్రభావం చూపి ఆ దిశగా వాటిని ప్రేరేపిస్తాయి. ఆ కంపనాలు ధనాత్మకమైనవైతే మన మనసు ధనాత్మక ఆలోచనలు చేస్తుంది. ఆ కంపనాలు రుణాత్మకమైనవి అయితే మన మనసు రుణాత్మకమైన ఆలోచనలు చేస్తుంది. మన ఆలోచనలే మన భవిష్యత్తు. అదే మన జీవితం.
మన మెదడు మీద చక్కని ప్రభావాన్ని చూపే శబ్దాలను ఉచ్చరించడం అలవర్చుకోవాలి. అందుకు మన పూర్వికులు చూపిన విజయవంతమైన నామాలనే ఎంచుకుందాం! రామా! శివా! కృష్టా! తదితర నామాలు జీవితాన్ని తరింపజేస్తాయి. ‘రామ’ అంటే ఆనందం కలిగించువాడు, సుందరుడు, మనోహరుడు అని అర్థం. శివ అంటే మంగళాన్ని కలిగించేవాడనే అర్థాన్ని ఇస్తుంది. ‘కృష్ణ’ పదానికి సచ్చిదానంద స్వరూపమని అర్థాన్ని సూచించారు ఆదిశంకరాచార్యులు. అనంతకల్యాణ గుణాలతో ఆకర్షించేవాడని మరో అర్థం. ఈ విధంగా మన సనాతన ధర్మంలోని ఉత్కృష్టమైన నామాలు అత్యంత ధనాత్మక
అర్థాలను కలిగి ఉండి, మన హృదయంలో చక్కని కంపనాలు జనింపజేస్తాయి. తద్వారా మన మనసు మంగళకరమైన ఆలోచనలకు నెలవై ఉంటుంది. ఆ ఆలోచనలే మన జీవితంలోకి శుభఫలితాలను ఆహ్వానిస్తాయి. సమస్యలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. అలాంటి మానసిక స్థితి మనకు అవసరం. ఆ మానసిక స్థితి మన లక్ష్యాలను సాధించడానికి దోహదమవుతుంది.
‘నామస్మరణ’ ఒక సులభమైన పద్ధతిగా తరతరాలుగా ఒప్పారుతూ వస్తున్నది.
నిరంతరం స్మరించు
స్మరణం అంటే తలచుకోవటం. ఎక్కడ ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవం గురించి తలచుకుంటూనే ఉండాలి. చివరకు నిద్రలో కూడా పరమాత్మను మర్చిపోలేని స్థితిని చేరుకోవాలి. అదే స్మరణ భక్తి. హనుమంతుడు, నారద మహర్షి ఇందుకు చక్కటి ఉదాహరణలు. ‘నారాయణ’ నామస్మరణ చెయ్యకుండా నారదుడు, ‘రామ’ నామ స్మరణ లేకుండా హనుమంతుడు క్షణం కూడా ఉండలేరు. అదీ నిజమైన స్మరణ అవుతుంది. గొప్పవ్యక్తుల ప్రవచనాలు విన్న కొద్దిసేపటికే వాటిని చాలామంది మర్చిపోతారు. కారణం స్మరణ లేకపోవటమే. ఎప్పుడైతే క్షణం కూడా విడిచిపెట్టకుండా దైవ నామ స్మరణ చేసేందుకు ప్రయత్నిస్తామో అప్పటినుంచి దైవానికి మరింత సన్నిహితులం అవుతాం.
-రావుల నిరంజనాచారి