పూజలు, వ్రతాల్లో తమలపాకులు ఎందుకు వినియోగిస్తారు ? – ఎర్రా వైజయంతిమాల, గంభీరావుపేట
తమలపాకును ఫణివల్లి, నాకవల్లి అని పిలుస్తారు. నాకవల్లి కాలక్రమేణ నాగవల్లిగా మారింది. ‘నాక’ అంటే స్వర్గం. ‘వల్లి’ అంటే తీగ. ఇంద్రుడి ఐరావతాన్ని కట్టిన స్తంభానికి పుట్టిన తీగ ఇది. బ్రహ్మసృష్టి కాని తమలపాకును ఎందుకు వినియోగిస్తారన్న సందేహం రాకమానదు. బ్రహ్మ సృష్టించిన ప్రతి పదార్థంలో సత్త, రజో, తమో గుణాలు ఉంటాయి. నాగవల్లి పత్రంలో ఈ గుణాలేవీ ఉండవు. నిర్మలమైన దళం కాబట్టి దీనిని పూజలు, వ్రతాలు, వివాహాలు తదితర శుభకార్యాల్లో వినియోగిస్తారు. దైవారాధన సమయంలో ముందుగా ధూప దీప నైవేద్యాలను దైవానికి నివేదిస్తారు. ఆ తర్వాత కాలోచితమైన పండ్లనూ సమర్పిస్తారు. చివరిగా తాంబూలాన్ని నివేదిస్తూ…
పూగీ ఫలం మహద్దివ్యం,
నాగవల్లీ దళైర్యుతమ్
ఏలా లవంగ సంయుక్తం
తాంబూలం ప్రతి గృహ్యతామ్ శ్లోకాన్ని పఠిస్తారు.
‘ఓ దైవమా! వక్కలు, యాలకులు, లవంగాలను కలిపి తమలపాకుతో తయారు చేసిన ఈ తాంబూలాన్ని సమర్పిస్తున్నాను. రుచికరమైన తాంబూలం స్వీకరించమ’ని ప్రార్థిస్తారు. తమలపాకును సకల దేవతల నిలయంగా చెబుతారు. ఈ ఆకు తొడిమలో లక్ష్మీదేవి, మధ్య భాగంలో పార్వతీదేవి, చివరి భాగంలో సరస్వతి కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. తమలపాకులోని మిగతా భాగాలలో కూడా వివిధ దేవతలు ఆసీనులై ఉంటారని శాస్త్ర వచనం. అందుకే దైవారాధనలో నాగవల్లీ పత్రానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. వ్రతాల్లో భాగంగా చేసే కలశారాధనలో కూడా తమలపాకులను ఉంచుతారు. మహిళలు ఇచ్చిపుచ్చుకునే వాయనాల్లోనూ పండ్లు, వస్త్రంతోపాటు రెండు తమలపాకులను ఉంచడం సంప్రదాయం. వివాహ నిశ్చయ సందర్భాన్ని కూడా నిశ్చితార్థ తాంబూలాలు అని పిలుస్తారు. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతున్నది. అందుకే భోజనానంతరం తాంబూల సేవనం పరిపాటిగా మారింది. జీర్ణశక్తిని వేగవంతం చేసే శక్తి తమలపాకులో ఉంది. ఇలా ప్రకృతి పరంగా, ఆధ్యాత్మికంగా ఇన్ని విలువలున్న తమలపాకులను పూజల్లో, వ్రతాల్లో వినియోగిస్తుంటారు.
-డా॥ శాస్ర్తుల రఘుపతి , 73867 58370