Varanasi | టాలీవుడ్లో స్పెషల్ క్రేజ్ ఉన్న కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది సూపర్‌స్టార్ మహేశ్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి జంట అనే చెప్పాలి. ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై ఇప్పటికే దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. రెండు నెలల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్లో ఈ సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించడంతో పాటు, విడుదల సంవత్సరాన్ని కూడా మేకర్స్ వెల్లడించారు. అయితే రాజమౌళి సినిమాలు అనుకున్న షెడ్యూల్‌కు కచ్చితంగా పూర్తవుతాయా అనే సందేహం ప్రేక్షకుల్లో కొత్తది కాదు. గత చిత్రాల అనుభవం నేపథ్యంలో, ‘వారణాసి’ నిజంగా 2027లో విడుదల అవుతుందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో గట్టిగానే వినిపించాయి.
ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం మరోసారి స్పందించి, సినిమా 2027లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందని స్పష్టత ఇచ్చింది. ఈ ప్రకటనతో కొంతమంది అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉగాది లేదా శ్రీరామనవమి లాంటి పండుగ సీజన్లో సినిమా విడుదలయ్యే అవకాశముందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. అయితే, ఇంకా ఏడాది మాత్రమే మిగిలి ఉండటంతో అంత భారీ ప్రాజెక్ట్‌ను ఆలోపు పూర్తి చేయగలరా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది.ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది మహేశ్ కెరీర్లోనే కాకుండా, ప్రియాంకకు కూడా ఒక ప్రత్యేకమైన ఇండియన్ ప్రాజెక్ట్‌గా మారనుంది. విలన్ పాత్రలో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనుండటం మరో హైలైట్. అంతేకాదు, సినిమాలో ఒక కీలక ఘట్టంలో మహేశ్ బాబు రాముడి పాత్రలో కనిపిస్తారని రాజమౌళి ఇప్పటికే వెల్లడించడంతో ఈ అంశంపై కూడా భారీ ఆసక్తి నెలకొంది.
‘వారణాసి’ని టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో, భారతీయ పురాణాలు, ఆధునిక సైన్స్‌ను మేళవిస్తూ రూపొందిస్తున్నారని సమాచారం. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అభిమానులు “రిలీజ్ ఆలస్యమైనా పర్వాలేదు, కానీ ఇది లైఫ్‌టైమ్ ఎక్స్పీరియన్స్ మూవీ కావాలి” అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి, మేకర్స్ 2027 డేట్‌కు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేసినప్పటికీ, ఈ సినిమా చుట్టూ ఉన్న క్యూరియాసిటీ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. ‘వారణాసి’ ఎప్పుడు వచ్చినా, అది భారతీయ సినిమాకు మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో బలంగా ఉంది.
COMING IN 2027.#VARANASI pic.twitter.com/yuInvgJwIk
— Varanasi (@VaranasiMovie) January 21, 2026