O ROMEO | బాలీవుడ్ వెండితెరపై మరో క్రేజీ కాంబినేషన్ సందడి చేయబోతోంది. స్టార్ హీరో షాహిద్ కపూర్, సెన్సేషనల్ బ్యూటీ తృప్తి దిమ్రి జంటగా నటిస్తున్న భారీ యాక్షన్ రొమాంటిక్ డ్రామా ‘ఓ రోమియో’. ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో ‘కమినే’, ‘హైదర్’, ‘రంగూన్’ వంటి క్లాసిక్ చిత్రాలను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ నాలుగోసారి షాహిద్ కపూర్‌తో జతకడుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియాద్వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సినిమా విడుదల తేదీ దగ్గరపడటంతో మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ముంబై అండర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే పవర్ఫుల్ క్రైమ్ అండ్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా షాహిద్ కపూర్ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత భయంకరమైన ‘వైల్డ్’ లుక్‌లో కనిపిస్తూ షాక్ ఇచ్చారు. ఒళ్లంతా టాటూలు, రక్తపు మరకలతో ఉన్న ఆయన లుక్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో తృప్తి దిమ్రితో పాటు నానా పటేకర్, అవినాష్ తివారీ, విక్రాంత్ మస్సే, దిశా పటానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒక ప్రత్యేక పాత్రలో మెరవనుండటం సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.