భగవంతుడు అంటే జ్ఞానం అనీ, ప్రపంచం విజ్ఞానమనీ రెండు విధాలుగా పేర్కొనే వాళ్లు ఉన్నారు. భగవంతుడిని ‘సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ’గా వర్ణించారు. భగవంతుడిని సత్యం అనడం వల్ల శాశ్వతుడనీ, మార్పులేని వాడనీ, అన్ని కాలాల్లో ఉన్నవాడనీ తెలుస్తున్నది. కొందరు అనుకున్నట్లు భగవంతుడు నమ్మకం కాదు, సత్యం, పరమ సత్యం. ‘సత్’ స్వరూపడనే మాటకు సత్యమే స్వరూపంగా కలిగినవాడని అర్థం చెప్పకొంటాం. అలాగే భగవంతుడంటే జ్ఞానం. ‘చిత్’ స్వరూపుడనే మాటకు జ్ఞానమే స్వరూపంగా కలిగినవాడని అర్థం.
సత్యానికి, జ్ఞానానికి రూపం ఉండదు. కాబట్టి రూపంలేని భగవంతుణ్ని సత్యమని, జ్ఞానమని పేర్కొన్నారు. జ్ఞానమే స్వరూపంగా కలిగిన భగవంతుడు సృష్టి రచన ఎలా చేశాడనే ప్రశ్నకు ముండకోపనిషత్తు సమాధానమిస్తుంది. భగవంతుడు జ్ఞానంతో సంయుక్తుడు కావడం వల్ల సృష్టి ఏర్పడింది. భగవంతుడిలో ఉన్నదంతా జ్ఞానమే. అలాంటి జ్ఞానంతోనే ప్రపంచం నడుస్తున్నది. భగవంతుడు ‘ప్రజ్ఞాన ఘనుడు’ కాబట్టి ఈ ప్రపంచం లయమవుతుంది కూడా! భగవంతుడి జ్ఞానమే మనకు వేదాల రూపంలో లభిస్తుంది. మంత్రద్రష్టలైన రుషులు వేదాలను ఈశ్వరీయ జ్ఞానంగా భావించారు.
రుషులు మొదట భగవంతుడి నుంచి జ్ఞానాన్ని పొందలేకపోతే మనం జడంగా మిగిలిపోయేవాళ్లం. జీవుడు ఇచ్ఛాద్వేషాలు కలిగినవాడు మాత్రమే కాదు, ప్రయత్నశీలుడు కూడా. ఆ ప్రయత్నం సంకల్పంతో కూడింది. ఈ సంకల్పమే సృష్టి రహస్యాలను అన్వేషించడానికి దోహదకారి అయింది. విజ్ఞానశాస్ర్తాభివృద్ధికీ తోడ్పడింది. మనిషి ఎంత జ్ఞానవంతుడైనా… వైజ్ఞానికంగా ఎదిగినప్పుడే జీవితంలో సుఖపడగలడు. అందుకే వ్యవహార జ్ఞానం (లౌకిక జ్ఞానం) అవసరమని పెద్దలు చెబుతుంటారు. లౌకిక జ్ఞానం సంసారంలో విజేత కావడానికి తోడ్పడుతుంది. ఇది ప్రధానంగా విజ్ఞానశాస్ర్తానికి సంబంధించినది. మనిషి ఆధ్యాత్మికంగా జీవన సాఫల్యం పొందడానికి ఉపయోగపడేది ‘జ్ఞానం’. లౌకిక జగత్తుకంటే భిన్నమైనదాన్ని పొందడానికి ఉపయోగపడే విద్య.. పరావిద్య. ఇది పూర్తిగా అలౌకికమైనది. ఏ విజ్ఞాన శాస్త్రం మనల్ని సుఖంగా ఉండేలా చేస్తుందో అలాగే పరావిద్య మనల్ని ముక్తివైపు నడిపిస్తుంది. శాస్త్రవేత్తలు లౌకిక సుఖాన్వేషకులైతే, యోగులు శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి ప్రయత్నించే జ్ఞానులు. ఈ రహస్యం తెలిసిన శాస్త్రవేత్తలు జీవితాన్ని సుఖమయం చేయడానికి పరిశోధనలు కొనసాగిస్తూనే, శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి సంసిద్ధులు అవుతారు. అలాంటివారికే జ్ఞాన విజ్ఞాన ఫలాలు కరతలామలకం అవుతాయి.
-ఆచార్య మసన చెన్నప్ప , 98856 54381