ఇటీవల స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక సదస్సులో అతిథిగా పాల్గొన్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ‘ప్రయత్నాలకు ప్రతిఫలం ఆశించండి. ఫలితానికి కాదు’ అని పేర్కొన్నారు.
కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి॥
‘విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడానికి నీకు అధికారం ఉన్నది. కర్మ ఫలాలకు నీవు హేతువు కారాదు. కర్మలను ఆచరించడంలో అనాసక్తతను పొందకు’ అని పై శ్లోకానికి భావం. భగవద్గీతలోని ప్రతి శ్లోకం మనిషిని సత్య పథంలో నడిపించే ఆచరణాత్మక విజ్ఞాన నిధి. ప్రతి ఒక్కరికీ కర్మను ఆచరించే ఆధికారం ఉందని, అయితే ఆ కర్మ ఫలితం మాత్రం మానవుని చేతిలో లేదని శ్రీ కృష్ణుడు గీతలో వివరించారు. మానవుని ప్రయత్నానికి భగవంతుడైన తన అనుగ్రహం తోడైనపుడే సత్ఫలితం లభిస్తుందని తెలిపారు.
ఒక విద్యార్థి తాను మంచి మార్కులు తెచ్చుకోవాలనే సంకల్పంతో ఎంతో కష్టపడి చదువుతాడు. ఆ విద్యార్థి వందకు తొంభై మార్కులు సాధించాలన్న ఆశయాన్ని కలిగి ఉండటం సమంజసమే! ఆశయాలను, లక్ష్యాలను నిర్దేశించుకోవటాన్ని భగవద్గీత ఎప్పుడూ వద్దనదు. అయితే, ఆ విద్యార్థి తాను సాధించాలనుకున్న ఫలితం గురించి ఆలోచించకుండా, విద్యను అభ్యసించటంపై ఎక్కువ దృష్టి సారించాలని సూచిస్తున్నది భగవద్గీత. రాబోయే ఫలితం కోసం పదేపదే ఆలోచించడమే ఆతృత ఆవేదనలకు మూలమవుతుంది. ప్రయత్నంపై మాత్రమే మనసును కేంద్రీకరిస్తే ఏ ఆవేదనా ఉండదు.
ఆశించిన మార్కులు రాలేదని నేడు చాలామంది విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఆవేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. విద్యార్థులకు చిన్నప్పటి నుంచే భగవద్గీతను బోధించాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటనలు తెలియజేస్తున్నాయి. మనసును ఎలా నియంత్రించాలన్నది ప్రతి ఒక్కరూ అభ్యసించాల్సిన విద్య. లేదంటే దేశం ఇలా ఎందరో విద్యార్థులను కోల్పోయే ప్రమాదం ఉన్నది. మన విద్యాలయాలు బయటి ప్రపంచం గురించి జ్ఞానాన్ని అందిస్తే, భగవద్గీత మన అంతర్ ప్రపంచంతోపాటు బాహ్య ప్రపంచాన్ని సైతం అందంగా మలచుకోగల విజ్ఞానాన్ని అందిస్తుంది. భగవద్గీత అందించే ఈ రెండు విజ్ఞానాలను పొందినపుడే మనిషి పరిపూర్ణుడు అవుతాడు.
– శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి, 93969 56984