పోయినోళ్లు అందరూ మంచోళ్లు! ఉన్నోళ్లు పోయినోళ్లను గుర్తుచేసుకునే పర్వం పితృపక్షం. మనకు ఏడాది.. వారికి ఒక రోజు. ఏటా ఒకరోజు శ్రాద్ధాన్ని విధిగా నిర్వహిస్తే.. పితృదేవతలకు ప్రతిరోజూ అన్నం పెట్టినట్లు అవుతుంది. ఆదమరచి,ఇంకేదో తలచి మన బాధ్యత విస్మరిస్తే.. ఆ రోజు వారికి పస్తే! పితృకార్యం
గొప్పదనాన్ని వివరించే పితృపక్షం మొదలైంది. పెత్తులమాస పర్వదినం రానుంది. ఈ సందర్భంగా శ్రాద్ధం ఔచిత్యాన్ని తెలుసుకుందాం.
పరమపదించిన వ్యక్తి స్మృతిలో ఏటా జరిపే అర్చనే పితృకార్యం. ఈ అర్చనను మరణించిన దినాన్ని గుర్తుపెట్టుకొని చేయాల్సి ఉంటుంది.తత్+దినము ఆ (మరణించిన) దినాన జరిపే కార్యక్రమం తద్దినం అయింది. మరణదినాన్ని లెక్కకట్టుకోవడంలో తిథికే పవిత్రత, ప్రాధాన్యం. తిథిని నిర్వహించే వారికి పుణ్యం వస్తుంది. కనుక పుణ్యతిథి అంటారు. తిథిని శ్రద్ధగా నిర్వహించాలి. శ్రద్ధగా చేయాల్సిన క్రతువు కాబట్టి శ్రాద్ధం అయింది. అయితే, సమాజంలో వ్యక్తులు అందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు. చాలామంది పెద్దలు మరణించిన తిథి, వార, నక్షత్రాలను గుర్తుపెట్టుకోలేరు. కొన్ని సందర్భాల్లో వ్యక్తి మరణించినట్లు తెలుస్తుంది. ఎంతకాలం కిందట మరణించినది తెలియదు. మరికొన్ని సందర్భాల్లో మరణించినదీ తెలియకపోవచ్చు. కొన్ని విపత్కర పరిస్థితుల్లో మరణించిన వ్యక్తి మృతదేహం కూడా లభ్యం కాకపోవచ్చు. ఈ సందర్భాల్లో మరణించిన వ్యక్తులకు సంబంధించిన శ్రాద్ధ విధులు వారి వారసులు చేయకుండా వదిలేయడమేనా! ఈ ప్రశ్నకు సమాధానమే మహాలయ అమావాస్య.
భాద్రపద బహుళ పక్షాన్ని మహాలయ పక్షమనీ, పితృపక్షమనీ అంటారు. భాద్రపద అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. మన రాష్ట్రంలో పెత్తులమాస అని పిలుస్తారు. పితృదేవతల అమావాస్య వాడుకలో పెత్తులమాస అయిందన్నమాట.
క్రమం తప్పకుండా తద్దినాలు పెట్టేవారు కూడా పితృపక్షాల్లో ఆయా తిథులలో పితృకార్యాన్ని నిర్వహించాలి. బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండే పదిహేను రోజుల్లో పితృకార్యాన్ని క్రమం తప్పకుండా ఆచరించే సజ్జనులూ ఉన్నారు. మరణించిన వ్యక్తుల తిథి తెలియనివారు అమావాస్య నాడు పితృకార్యాన్ని నిర్వహించాలి. తండ్రి జీవించి ఉండి తల్లి మాత్రమే మరణించినవారు భాద్రపద బహుళ నవమినాడు శ్రాద్ధ విధిని నిర్వహించాలి.
వంశాచారంలో అగ్నిహోత్రం ఉన్నవారు స్వధాకారంతో అగ్నిహోత్రుడికి కవ్యములు సమర్పించాలి. అగ్నిదేవుడికి స్వాహాదేవి, స్వధాదేవి అని ఇద్దరు భార్యలు. అగ్నిదేవుడు స్వాహాదేవి సాయంతో స్వీకరించి దేవతలకు అందించే ఆహుతులను హవ్యములు అంటారు. స్వధాదేవి సాయంతో స్వీకరించి పితృదేవతలకు సమర్పించే ఆహుతులను కవ్యములు అంటారు. మిగిలిన పితృకార్యం అందరికీ సమానమే.
వైదిక విధానం వర్తించని వంశాల వారు తమ పూర్వికులను స్మరించుకొని బ్రాహ్మణులకు ఆహార పదార్థాలను, సంభావనను సమర్పిస్తే సరిపోతుంది. నిజానికి హిందూ మతంలో దాదాపుగా అన్ని కులాల్లోనూ వివాహాది శుభకార్యాలను, అంత్యేష్టి వంటి అపరకర్మలు ఆచరింపజేసే ఉపకులాలు ఉన్నాయి. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన విద్యావిధానం, తర్వాతి కాలంలో కొనసాగుతున్న పాశ్చాత్య సంస్కృతి ప్రభావం కారణంగా ఈ ఉపకులాల ప్రాభవం తగ్గిపోయి అన్ని కులాల వారూ వైదిక బ్రాహ్మణులను ఆశ్రయించడం మొదలైంది.
పితృకార్యాన్ని కర్త నివాసం ఉన్న ఇంట్లో నిర్వహించడమే పితృదేవతలకు ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఇంటి కోడండ్లు వండి, వడ్డిస్తే భోక్తలను ఆవహించిన పితృదేవతలకు, విశ్వేదేవతలకు పరమానందం కలుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే మఠాలలో శ్రాద్ధకర్మను నిర్వహించాలి. ఈ విషయాన్ని గృహస్థులు గమనించవలసి ఉంది.
దక్షిణాయనం పితృదేవతలకు సంతోషాన్నిచ్చే కాలమైతే, భాద్రపద బహుళ పక్షం వారికి మరింత ఆనందాన్ని ఇచ్చే సమయం. పితృదేవతలకు సంతోషాన్ని కలుగజేద్దాం. మన సంతానానికి మరిన్ని సుఖసంతోషాలను అందిద్దాం.
పరమాత్మ- జీవాత్మ
మరణించిన వ్యక్తులను పూజించాల్సిన అవసరం ఉన్నదా? వారిని పూజించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి? మృతుని ఆత్మకు మనకు సంబంధం ఉన్నదా? పాశ్చాత్య విద్య కారణంగా మనలో ఏర్పడిన తర్కబద్ధమైన ప్రశ్నలు ఇవి. భారతీయ తర్క, మీమాంస శాస్త్రంలో ఈ ప్రశ్నలకు ఏనాడో సమాధానం ఇచ్చిన విషయం మనకు తెలియదు. దేహధారణ చేసిన పరమాత్మ అంశను జీవాత్మ అంటారు. అవధులు లేని పరమాత్మ అంశ ఒకానొక దేహాన్ని ధరించగానే.. ఆ దేహ పరిమితులకు లోనై, ఇష్టపూర్తిగా అజ్ఞానాన్ని ఆలింగనం చేసుకుంటుంది. అజ్ఞానానికి లోనైన జీవాత్మ తాను పరమాత్మ అంశనని తెలుసుకొని పరమాత్మతో లీనమవడమే జగన్నాటకం.
జీవాత్మ ఏకకాలంలో మూడు శరీరాలను ఒకదానిపై ఒకటిగా ధరిస్తుంది. లోక వ్యవహారంలో మనకు కనిపించే శరీరాకృతులన్నీ స్థూల శరీరాలు. దీనిలోపల సూక్ష్మ శరీరం, దానిలోపల కారణ శరీరం ఉంటాయి. ఎవరు చేసిన కర్మఫలాన్ని వారే అనుభవించవలసి ఉంటుంది. అది పాపఫలమైనా కావచ్చు, పుణ్యఫలమైనా కావచ్చు. ఈనాడు మనం చేసిన పనికి ఫలం వెంటనే లభించవచ్చు, కొన్నేండ్ల తర్వాత లభించవచ్చు. లేదా మనం మరణించే లోపు ఆ పనికి ఫలితం లభించకపోవచ్చు. అలా ఫలం లభించకుండా మిగిలిపోయిన కర్మలను ఆగామి ఫలాలు అంటారు. మరుజన్మ నిమిత్తం అవి దాగి ఉంటాయి. మరణించిన వ్యక్తి స్థూల శరీరం నశిస్తుంది. కంటికి కనిపించని సూక్ష్మ, కారణ శరీరాలు అలాగే ఉంటాయి. దాగిన ఆగామి ఫలాలను కారణ శరీరం స్వీకరించి భద్రపరుస్తుంది. ఆ విధంగా భద్రపరచిన ఆగామి ఫలాలను సంచిత కర్మలు అంటారు. ఈ సంచిత కర్మల్లో సుఖదుఃఖాలు ఉంటాయి. వీటిలో కొన్ని సుఖాలను, కొన్ని దుఃఖాల అనుభవ నిమిత్తం ఎంచుకున్న సూక్ష్మ శరీరం ఒకానొక స్థూలదేహాన్ని ధరిస్తుంది. ఇది స్థూలదేహాన్ని వదిలివెళ్లిన జీవాత్మకు సంబంధించిన పునర్జన్మ.
మరణించిన వ్యక్తి జీవాత్మ సూక్ష్మ కారణ శరీర సహితంగా ఏడాదిపాటు ఊర్ధముఖంగా పయనించి వసులోకాన్ని చేరుకుంటుంది. ఏడాదిపాటు విశ్రాంతి లేకుండా పయనించే ఆత్మను ప్రేతాత్మ అంటారు. ప్రయాణంలోని శ్రమ కారణంగా ప్రేతాత్మకు ఆకలిదప్పులు అధికంగా ఉంటాయి. మాసికాలలో పెట్టే ఆహారంతో వారి ఆకలిదప్పులు తీరుతాయి. తృప్తి చెందిన ప్రేతాత్మ తన సంతానం తరతరాలు బాగుండాలని ఆశీర్వదిస్తుంది. సంవత్సరీకం కార్యక్రమంలో సపిండీకరణం జరుగుతుంది. తద్వారా ప్రేతాత్మ వసురూపాన్ని ధరించి వసులోకంలోకి ప్రవేశించగలుగుతుంది. పితృకార్యాన్ని చేసే కర్త శాస్ర్తోక్త నిష్ఠను ఏడాదిపాటు పాటించే అవకాశాలు ఈనాటి సమాజంలో లేవు కాబట్టి సపిండీకరణను పదకొండో రోజునే పూర్తి చేస్తున్నారు. మానవలోక ప్రమాణంలో ఒక సంవత్సర కాలం పితృలోక ప్రమాణంలో ఒక దినం అవుతుంది. మనం ఏడాదికి ఒక రోజున పెట్టే తద్దిన భోజనం పితృదేవతలకు అనుదినం పెట్టినట్లు అవుతుంది. ఈ విధంగా మరణించిన మన పూర్వికులు అందరినీ పూజించుకునే భాగ్యాన్ని కలిగించే పితృపక్షాలు నిజంగా పుణ్యదినాలే కదా!
-వరిగొండ కాంతారావు , 94418 86824