చిన్నాపెద్దా, ఆడామగా, పేదలు, ధనికులు అందరూ కోరుకునేది లక్ష్మీ కటాక్షమే. మతాలకు, ప్రాంతాలకతీతంగా సంపద కలగాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తుంటారు. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనుషులే కాదు దేవతలు కూడా ఎదురుచూస్తుంటారు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాదులే కాదు, లక్ష్మీపతి అయిన శ్రీ మహా విష్ణువు కూడా లక్ష్మీకటాక్షం పొందాలనే భావనతో ఉంటాడు.
గ్రామాధికారి మొదలుకొని సృష్టికర్త అయిన బ్రహ్మ వరకు ఎవరెవరికి అధికారం కావాలన్నా, ఐశ్వర్యం పొందాలన్నా శ్రీమహాలక్ష్మి అనుగ్రహం ఉంటేనే అది సాధ్యమవుతుంది. శాపగ్రస్తులు, పాపభ్రష్టులు, నష్టాలబారిన పడినవారు, కష్టాల్లో కూరుకుపోయినవారు, వారూ వీరూ అనే భేదభావం లేకుండా అందరూ శ్రీమహాలక్ష్మిని శరణు వేడి, కరుణ రసభరితమైన అమ్మవారి కటాక్ష లాభాన్ని పొందాలని కోరుకుంటూ ఉంటారు. శ్రీమహాలక్ష్మి కటాక్షం.. లోకాధిపతులకు, దిక్పాలకులకు, అధికారులకు, క్షేమ లాభాపేక్ష కలవారికి అందరికీ అవసరమే!
యస్యాః కటాక్షణ మనుక్షణ మీశ్వరాణాం
ఐశ్వర్యహేతురితి సర్వజనీనమేతత్- అని శ్రీవైకుంఠస్తవంలో కూరత్తాళ్వాన్ అనే ఆచార్యులు పేర్కొన్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీహరి చరాచరాత్మక సువిశాలమైన జగత్తునంతటినీ సృష్టించిన తర్వాత, మహాలక్ష్మి ఆమోదాన్నీ, అంగీకారాన్నీ తెలిపే ఆమె అనుగ్రహం కోసం ఎదురుచూస్తాడు. లక్ష్మీదేవి ప్రసన్నవదనంతో తన సంతోషాన్ని, అంగీకారాన్ని తెలియజేసే చూపును (కటాక్షాన్ని) ప్రసరింపజేయగానే పరమాత్మ తన సృష్టికార్యం సఫలమైనట్టు భావించాడని ఆచార్యులు పరాశరభట్టార్ వివరించారు.
సంసార చక్రంలో పడి తిరుగుతూ, పీకల్లోతు కష్టాలకు గురై బాధపడేవారు ఎందరో ఉంటారు. ‘అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ- ఓ పరమాత్మా! మాకు నీవు తప్ప మరే దిక్కులేదు’ అని ప్రార్థించిన వారిని రక్షించి పరమాత్మ శరణాగత వత్సలుడని ప్రసిద్ధిపొందాడు. ఈ విషయాన్నే విభీషణ శరణాగతి ఘట్టం, కాకాసుర వృత్తాంతం, గజేంద్ర మోక్షం, ద్రౌపది శరణాగతి వంటి సందర్భాలు నొక్కివక్కాణిస్తున్నాయి. సీతాదేవి మాత్రం శరణాగతి చేయనివారిని (రక్షించమని కోరనివారిని) కూడా ఆదుకునే స్వభావం ఉన్న తల్లి. ఎప్పుడో తప్పుచేసిన వారినే కాకుండా, తన విషయంలో ఆ క్షణం వరకూ తప్పులు చేస్తూనే ఉన్న రాక్షస స్త్రీలకూ అభయమిచ్చి రక్షించింది. శ్రీమహా విష్ణువునే మించిన గొప్ప రక్షకత్వ దీక్ష కలిగిన దయా స్వభావురాలిగా ప్రసిద్ధి చెందింది.
పరమాత్మ జీవుల హితాన్ని కోరి వారు వారు చేసిన తప్పులను గుర్తిస్తారు. వారిని మంచిమార్గంలో పెట్టడానికి, పశ్చాత్తాపం పొందేలా శిక్షింపజూస్తాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి పరమాత్మను తన రూప, గుణ, సౌందర్యాలతో ఆకర్షించి, బుజ్జగింపు మాటలతో తన వశం చేసుకొని ‘తప్పులు చేయనివారు ఎవరుంటారండీ? అందరూ చిన్నవో, పెద్దవో తప్పులు చేసేవారే! తప్పులు చేసినవారిని కూడా రక్షించినపుడే మీ దయాగుణం బాగా ప్రకాశిస్తుంది. మీ దయ, క్షమ, ఔదార్యం వంటి గుణాలను అందరూ కీర్తిస్తారు’ అని బుజ్జగింపు మాటలతో అందరినీ రక్షించేలా చూస్తుంది లక్ష్మీదేవి. భక్త రక్షణ కోసం ప్రేరేపించే, శిక్షించనీయకుండా అందరినీ రక్షింపజేసే లక్ష్మీదేవి వంక శ్రీహరి ఆరాధనగా చూస్తుంటాడు. ఒక్కక్షణం కూడా తనను వదిలి ఉండకుండా, ఎల్లప్పుడూ తన వక్షః స్థలంలో ఉండే లక్ష్మీదేవి అంటే శ్రీహరికి చాలా ఇష్టం. అందుకే లక్ష్మీదేవిని పొందడానికి క్షీరసాగర మథనం చేయించాడు. లక్ష్మీదేవి జన్మించిన పాలకడలిపై పడుకున్నాడు. శ్రీరామ అవతారంలో సీతాదేవి కోసం అవలీలగా శివధనస్సును ఎక్కుపెట్టాడు. సముద్రంపై వారధిని నిర్మింపజేశాడు. రావణుడి తలలను నరికి అతని మొండాన్ని నాట్యం చేయించాడు.
లక్ష్మీదేవి సంతోషం కోసం ఏ పని చేయడానికైనా సిద్ధపడే ఆ మహావిష్ణువు ఆమె కటాక్షం పొందాలని నిరంతరం భావిస్తుంటాడు. ఇక మనమెంత? మనకు ఏ రకమైన శుభాలు, మంగళాలు, ధన, కనక, వస్తు, వాహనాలు లభించాలన్నా, అశుభాలు, కష్టనష్టాలు, దుఃఖాలు, అనారోగ్యాలు తొలగాలన్నా ‘లక్ష్మీ కటాక్షం’ కావలసినదే అనే సత్యాన్ని గుర్తిద్దాం. అందుకే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి అవసరమైన మార్గాలను అన్వేషిద్దాం. ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభిద్దాం.
-సముద్రాల శఠగోపాచార్యులు , 98483 73067