చతుర్దశ భువనాల బరువు మోసేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ జగన్నాథుడి బరువు మోసేవాడు గరుత్మంతుడు. విష్ణుమూర్తిని భుజస్కంధాలపై మోసే అదృష్టం గరుత్మంతుడికి ఊరికే వచ్చింది కాదు. రెక్కలు తొడిగింది మొదలు శ్రీహరి విజయ ధ్వజంపై ఎగిరేవరకు గరుడ చరితం స్ఫూర్తిమంతం. పక్షీంద్రుడైన గరుత్మంతుడు ఇతర జీవకోటికీ ప్రభువే. కీర్తినీ, శాంతినీ ప్రసాదించే దైవం ఆయన. గరుత్మంతుడిని గరుడాళ్వార్, గరుడస్వామి అని భక్తులు కీర్తిస్తారు. శక్తి సామర్థ్యాలనూ, సంతాన సౌభాగ్యాలనూ ప్రసాదించే దైవంగా గరుత్మంతుడు మనకు పురాణాల్లో కనిపిస్తాడు.
శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా చేసుకుంటారు. ఇదేరోజున నాగపంచమి పర్వదినం కూడా. నాగులకు, గరుత్మంతుడికి మధ్య జరిగిన ఆసక్తికరమైన సందర్భమే ఈ పర్వదినానికి హేతువు. ఈ రోజు గరుత్మంతుడిని మనసారా స్మరించినా, కీర్తించినా సకల శుభాలూ కలుగుతాయని పురాణాలు పేర్కొన్నాయి. గరుడ పంచమి వ్రతం ఆచరించే సంప్రదాయమూ ఉన్నది. ప్రధానంగా సోదరులు ఉన్న స్త్రీలు దీనిని చేస్తారు. పదేండ్లు వ్రతాన్ని చేసి, ఉద్యాపన నిర్వహిస్తారు.
గరుత్మంతుడు పట్టుదలకు ప్రతీక. చేపట్టిన కార్యాన్ని ఎన్ని విఘ్నాలు ఎదురైనా చెక్కుచెదరని విశ్వాసంతో పూర్తిచేసిన ఘనుడు. ఆయన మాతృప్రేమ యుగయుగాలకు స్ఫూర్తిదాయకం. నాగులు, గరుత్మంతుడు విరోధులే అయినా, జన్మతః వాళ్లు సవతి తల్లుల బిడ్డలు. కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ, వినత. కద్రువ ద్వారా సర్పజాతి ఉద్భవించింది. అనూరుడు, గరుత్మంతుడు వినత కొడుకులు. అనూరుడు (అరుణుడు) సూర్యుడి రథసారథి. కద్రువ మోసం వల్ల వినత ఆమెకు దాస్యం చేసే పరిస్థితి ఏర్పడుతుంది. తల్లి దాస్యానికి కారణం తెలుసుకున్న గరుత్మంతుడు, ఆమె దాస్య విముక్తికి ఏం చేయాలో చెప్పమని కద్రువ సంతానమైన సర్పాలను అడుగుతాడు. స్వర్గం నుంచి అమృతం తెచ్చి ఇస్తే వినతకు దాస్య విముక్తి కలిగిస్తామంటాయి సర్పాలు. స్వర్గంలో ఇంద్రుడి అధీనంలో ఉన్న అమృతాన్ని తెచ్చి, తల్లి దాస్యాన్ని పోగొట్టాలని భావిస్తాడు గరుత్మంతుడు.
సర్పాలు కోరినట్టు స్వర్గం నుంచి అమృతాన్ని తేవడం సులభమైన పనికాదు. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించలేదు గరుత్మంతుడు. ఎలాగైనా తన తల్లికి స్వేచ్ఛ కలిగించాలని సంకల్పించుకున్నాడు. దీనికి తండ్రి కశ్యప ప్రజాపతి ఆశీర్వాదం తోడైంది. భువి నుంచి దివి వరకు సాగిన గరుత్మంతుడి ప్రయాణంలో గరుత్మంతుడు చేసిన సాహస కార్యాలు అన్నీ ఇన్నీ కావు. స్వర్గంలో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉన్న అమృతభాండాన్ని ధైర్యంతో, తెలివితేటలతో చేజిక్కించుకున్నాడు. గరుత్మంతుడి సంకల్పబలం మెచ్చిన విష్ణుమూర్తి, అతని ఎదుట నిలిచి వరాలు కోరుకోమన్నాడు. మొదటి వరంగా, విష్ణుమూర్తి ధ్వజం మీద తాను ఉండాలని కోరాడు. అమృతం తాగకుండానే తనకు నిత్య యౌవనం, అమరత్వం సిద్ధించాలని రెండో వరం అడిగాడు. ఈ రెండు వరాలు తీర్చడంతోపాటు తనకు వాహనంగా ఉండేలా గరుత్మంతుడిని అనుగ్రహించాడు విష్ణువు.
శ్రీహరి ఆజ్ఞతో అమృతభాండాన్ని తీసుకువెళ్లి సర్పాలకు సమీపంలో దర్భలపై ఉంచుతాడు గరుత్మంతుడు. దీంతో సర్పజాతికి ఇచ్చిన మాట నెరవేరినట్టయింది. అయితే, అమృతభాండం అక్కడ ఉంచీ ఉంచగానే, దానిని దేవేంద్రుడు మాయం చేశాడు. అమృతాన్ని తీసుకువస్తే చాలు తల్లి దాస్య విముక్తి కలుగుతుందన్నది సర్పాలతో కుదిరిన ఒప్పందం.
ఆ మేరకు వినతకు దాస్య విముక్తి కలిగింది. ఆయన అమృతాన్ని తెచ్చిన శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా చేసుకుంటున్నారు. అయితే, దైవకార్యంగా అమృతం సురలోకంలోనే ఉండాలి. అందుకని ఇంద్రుడు యుక్తితో అమృత కలశాన్ని మళ్లీ స్వర్గానికి చేర్చాడు. తల్లి కోసం గరుత్మంతుడు పడిన తపన
ఆయనకు శాశ్వతమైన కీర్తిని కట్టబెట్టింది. మహావిష్ణువుకు వాహనమయ్యే అవకాశాన్నీ తెచ్చిపెట్టింది.
-ఎ.వంశీధర్