ఎవరైతే తనను, నిష్కల్మషమైన మనసుతో, సంపూర్ణ విశ్వాసంతో సేవిస్తారో వారి యోగక్షేమాలను స్వయంగా తానే చూసుకుంటానని పరమదయాళువైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో పేర్కొన్నాడు. దానికి గొప్ప ఉదాహరణ భక్తాగ్రేసరుడు ధ్రువుడు. క్షత్రియ పుత్రుడైన ధ్రువుడు ఐదేండ్ల ప్రాయంలోనే జీవితంలో అవమానకర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. ధ్రువుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి మనుమడైన ఉత్తానపాద మహారాజు జ్యేష్ఠ పుత్రుడు. ఉత్తానపాదుడికి ఇద్దరు భార్యలు సునీతి, సురుచి. ధ్రువుడు సునీతి కొడుకు. సురుచి కొడుకు పేరు ఉత్తముడు.
ఒకసారి ఉత్తానపాదుడు చిన్నభార్య కొడుకైన ఉత్తముడిని ఒడిలో కూర్చోబెట్టుకొని అచ్చికలాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన ధ్రువ కుమారుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలని ప్రయత్నిస్తాడు. అది సురుచి కంటపడుతుంది. తన పుత్రుడైన ఉత్తముడితో సమానంగా ధ్రువుడు కూర్చోవడం ఆమెకు నచ్చదు. తన కడుపులో పుట్టనివాడికి మహారాజు ఒడిలో కూర్చునే భాగ్యం ఏనాటికీ లేదంటూ ధ్రువుడిని అనరాని మాటలంటుంది. ఎంతో తపస్సు చేసి నారాయణుడిని మెప్పించి కనీసం వచ్చే జన్మలోనైనా తన కడుపున జన్మించే వరాన్ని పొందితే గాని, మహారాజు ఒడిలో కూర్చోవటం కుదరదని హేళన చేస్తుంది. సురుచిపై మక్కువ గల ఉత్తానపాదుడు సైతం ఆమె మాటలకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉంటాడు.
సవతి తల్లి పరుషమైన మాటలకు నొచ్చుకున్న ధ్రువుడు కన్నతల్లి సునీతి దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్తాడు. ‘కఠోర తపస్సు చేసి శ్రీమన్నారాయణుడిని మెప్పించి, వరాన్ని పొందమ’ని ధ్రువుడికి హితవు చెప్తుంది తల్లి. ఆ మాటలు ధ్రువుడిని కార్యోన్ముఖుణ్ని చేస్తాయి. నారాయణుడిని తపస్సుతో మెప్పించి తన తండ్రి, తాతల సామ్రాజ్యం కన్నా మరింత పెద్ద సామ్రాజ్యాన్ని పొందాలని నిశ్చయించుకొని అరణ్యానికి బయల్దేరుతాడు ధ్రువుడు. ఆ పసిబాలుడికి తగిన మార్గనిర్దేశం చేయాల్సిందిగా భగవంతుడు నారద మహర్షిని పంపుతాడు. ఇదే దేవుడి దయాగుణం. తనను చేరాలని, సేవించాలని ఎవరైనా మనసారా భావిస్తే.. అలాంటి భక్తుడి దగ్గరికి ఏదో ఒకరూపంలో మరో విశుద్ధభక్తుడిని పంపి తగిన ఉపకారం చేస్తాడు.
ధ్రువుడి చెంతకు వచ్చిన నారదముని ‘పసివాడివైన నీకు తపస్సు తగదు. తిరిగి ఇంటికి వెళ్లిపో. కావాలంటే పెద్దయ్యాక తపస్సు చేద్దువుగాని’ అంటాడు. దృఢచిత్తుడైన ఆ బాలుడు తన సంకల్పాన్ని వీడడు. తనకు మార్గనిర్దేశం చేయాల్సిందిగా నారద మహర్షిని కోరుతాడు. ఆ బాలభక్తుడి పట్టుదలకు ప్రసన్నుడైన నారదుడు ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే విష్ణు మంత్రాన్ని ఉపదేశించడమే కాకుండా, తపో నియమాల గురించి చెప్తాడు. పిల్లవాడే అయినా, ధ్రువుడు గురువు ఆదేశాలను నిష్ఠగా పాటిస్తూ, కఠోరంగా తపస్సు ఆచరిస్తాడు. బాలుడి తపస్సు తీవ్రతకు ఊర్ధలోకాలు సైతం కంపించాయి. వేలాది ఏండ్లు తపస్సు చేసినా యోగులకు సైతం దక్కని విష్ణుమూర్తి దర్శనం, అకుంఠిత దీక్షతో తపమాచరించిన ధ్రువుడికి స్వల్ప వ్యవధిలోనే లభించింది.
దేవాదిదేవుడి దివ్యమంగళ స్వరూప సౌందర్యాన్ని దర్శించిన ధ్రువుడు ముగ్ధుడై తన్మయత్వంతో ఏం మాట్లాడలేకపోతాడు. బాలుడి పరిస్థితి గ్రహించిన స్వామి తన శంఖంతో ధ్రువుడి శిరస్సును తాకగానే, జ్ఞాన ప్రవాహంతో సమస్త విజ్ఞానం భాసిల్లి శ్రీహరిని ఉత్తమ శ్లోకాలతో ప్రార్థించాడు. తన తండ్రికన్నా గొప్ప రాజ్యాన్ని పొందాలన్న కాంక్షతో తపస్సు ఆచరించిన ధ్రువుడు, భగవంతుడి దర్శనంతో అశాశ్వతమైన ఈ భౌతిక ప్రపంచాన్ని అల్పమైనదిగా భావించి రాజ్యకాంక్షను వీడుతాడు. దేవదేవుడు ధ్రువుడికి సమస్త భోగభాగ్యాలనూ ప్రసాదించి చివరికి మోక్షాన్ని అనుగ్రహించాడు. మోక్షాన్ని సాధించటం ఏ ఒక్క వర్గానికో మాత్రమే పరిమితమైనది కాదని, ప్రతి ఒక్కరూ దాన్ని సాధించగలరని తెలిపే స్ఫూర్తిదాయకగాథ ధ్రువ చరితం. భగవంతుడి సేవాపథం వయో పరిమితులకు అతీతమైనది. భక్తిమార్గానికి ఉన్న అద్భుతమైన గుణం ఇదే. శ్రీచైతన్య మహాప్రభువు కృపతో కలియుగంలో యుగధర్మమైన విష్ణుమంత్రం ప్రతి ఒక్కరికీ అందుబాటులో వుంది. అదే..
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
ఈ హరేకృష్ణ మహామంత్రాన్ని నిత్యం జపిస్తే ధ్రువుడిలా ప్రతి ఒక్కరూ జీవిత పరిపూర్ణతను సాధించగలుగుతారు.
-శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస ప్రభూజి , 93969 56984