తిరుమల : సూర్య జయంతి ( Surya Jayanthi ) సందర్భంగా ఆదివారం తిరుమలలో రథసప్తమి (Rath Saptami ) ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.
ఒకే రోజున శ్రీమలయప్ప స్వామి సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై దర్శనం ఇవ్వడం విశేషం. ఆదివారం ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు మలయప్పస్వామి సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తిపారవశ్యంతో నిండిపోయాయి.


ఆకట్టుకున్న విద్యార్థుల ఆదిత్య హృదయం, సూర్యాష్టకం..
రథసప్తమి పర్వదినం సందర్భంగా సూర్యప్రభ వాహనసేవలో టీటీడీ శ్రీవేంకటేశ్వర బాలమందిరానికి చెందిన విద్యార్థులు ఆలపించిన ఆదిత్యహృదయం, సూర్యాష్టకం శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉత్తర మాడ వీధిలోకి సూర్యప్రభ వాహనం వచ్చిన అనంతరం విద్యార్థులు లయబద్ధంగా శ్లోకాలు ఆలపించారు.


ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, ఎమ్మెస్ రాజు, పనబాక లక్ష్మి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, భాను ప్రకాష్ రెడ్డి, ఎన్. సదాశివరావు, నరేష్ , శాంతా రామ్, జానకి దేవి, దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.