రైతుల పండుగ చుక్కల అమావాస్య. ఆషాఢ అమావాస్య నాడు ఈ పర్వం చేసుకుంటారు. పొలాలు పచ్చగా పండాలని ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రత్యేకంగా ఇది మహిళల పండుగ. మంచి సంతానం కలగాలని, పిల్లలు వృద్ధిలోకి రావాలని, భర్త క్షేమంగా ఉండాలని కోరుతూ ముత్తయిదువలు గౌరీదేవిని ఆరాధిస్తారు. పెండ్లి కాని యువతులు, మంచి వరుణ్ని కోరుతూ అమ్మవారిని దీపస్తంభం వ్రతంతో పూజిస్తారు. వ్రతం చేసేవాళ్లు సూర్యాస్తమయం వరకు నిష్ఠగా ఉపవాసం ఉంటారు. సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీపస్తంభాన్ని నిలిపి, దీపాలను వెలిగించి, ఆ వెలుగులో గౌరీదేవిని పూజించడం వ్రత నియమం.
వ్రతం మొదటిసారి నిర్వహిస్తున్న వాళ్లు పాలు, చక్కెర కలిపి చేసిన వరిపిండితో వంద చుక్కలను అమ్మవారి సన్నిధిలో వేసి, వందపోగుల హారాన్ని ధరిస్తారు. వంద సున్నపు చుక్కలతో దీపస్తంభాన్ని అలంకరిస్తారు. ప్రతి సంవత్సరం వాటి సంఖ్యను పెంచుతూ ఐదేండ్లపాటు వ్రతాన్ని నిర్వహిస్తారు. చివరగా వెండితోగాని, బంగారంతోగాని చేసిన చుక్కలను దానంగా ఇచ్చి ఉద్యాపన చేసి, వ్రత సమాప్తి చేయాలని స్కాంద పురాణం చెబుతున్నది. దీపస్తంభానికి చుక్కలు పెట్టి పూజించే అమావాస్య కావడంతో, దీనికి చుక్కల అమావాస్య అనే పేరు వాడుకలోకి వచ్చింది.