ఔను ఇది సాధ్యమే! దేవుడు మాట్లాడతాడు. దేవుడు కనబడడు కదా మరి ఆయన మాట్లాడతాడు అని కోరుకోవడం అనౌచిత్యం కాదా, అదెలా సాధ్యం? దేవుడు మాట్లాడాడని, అది బైబిలు ద్వారా పలికాడనీ, బైబిలును ఆయన వాక్కుగా భావిస్తుంది క్రైస్తవం. కొండల మాటునుంచి, పొదల చాటు నుంచి, మేఘాల తెరల నుంచి దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. మోషేకు పది ఆజ్ఞలు అందించిన దేవుడు. తన బలమైన స్వరాన్ని ప్రపంచానికి గట్టిగా వినిపించాడు. అది ఆది క్రైస్తవ్యానికి ఓ ప్రేమ పునాది వాక్యంగా, సేవా వారధిగా నిలిచిపోయింది. బాధల్లో ఉన్నవారికి ఎవరో ఓ పెద్దాయన పెద్ద మనసుతో సాయపడినప్పుడు ‘దేవుడిలా వచ్చి కాపాడాడు’ అని అంటారు. తనకు న్యాయం జరిగినప్పుడో, ఒక మోసగాడికి నష్టం జరిగినపుడో ‘దేవుడున్నాడు’ అని గట్టిగా నినదిస్తారు.
సాధారణ స్థితి నుంచి మహోన్నతుడైన దేవుని స్థానం దాకా తాను చేసే సత్క్రియల ద్వారా మనిషి ఎదుగుతాడు అనే నీతిని అందించే సంఘటనలూ, సిద్ధాంతాలూ చాలానే ఉన్నాయి. మరో మనిషి రూపంలో వచ్చి దేవుడు సాయపడగలడంటే కూడా ఇదే పరమార్థం. దేవుడు ప్రేమమయుడు. అదే ప్రేమతో ప్రతివ్యక్తీ దేవుడిలా మారడానికి, దేవుడు అయిపోవడానికి.. దైవపీఠానికి పోటీ పడితే ప్రపంచమంతా దైవమయమై, ప్రేమమయమైపోదా? ప్రభువు ప్రాణత్యాగం ద్వారా మనతో దేవుడు చాలా మాట్లాడాడు. క్రీస్తు పరలోకం నుంచి మానవ లోకానికి వచ్చింది తన మహిమను ప్రకటించుకోడానికి కాదు, మనిషిని కూడా దేవునిగా మార్చేయడానికే!
– ప్రొ॥బెర్నార్డ్ రాజు, 98667 55024