అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేవ్యయామ్
సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే॥ (భగవద్గీత 2-34)
మానవ జీవితంలో ఏ వ్యక్తికైనా సరే కీర్తి రాకపోయినా ఫర్వాలేదు. కానీ, అపకీర్తి రాకూడదు. ప్రతి మనిషీ తనకు అపకీర్తి రాకుండా చూసుకుంటాడు. వ్యక్తి తను చేసే పనుల వల్ల కావచ్చు, ప్రవర్తన వల్ల కావచ్చు కొన్ని సమయాల్లో అపకీర్తిపాలయ్యే ప్రమాదం ఉన్నది. తన పరిధిలో ఉన్నంతవరకు, తన శక్తి సామర్థ్యాలను బట్టి వీలైనంతవరకు అపకీర్తి రాకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తుంటాడు. ఇది లోకధర్మం, మానవ ప్రవృత్తి.
అర్జునుడు సుక్షత్రియుడు. అనివార్యమైన సందర్భాల్లో యుద్ధానికి విముఖుడు కారాదు. ‘క్షతాద్ యోవై త్రాతయతి ఇతి న క్షత్రియః స్మృతః’- అన్న మాటలను బట్టి ఎక్కడైనా, ఎటువంటి వినాశనం జరిగే అవకాశం ఉన్నా దాన్ని నిరోధించే యుద్ధానికి వెనుదీయరాదు. యుద్ధం చేసైనా శత్రువుల నుంచి రాజ్యాన్ని, ప్రజలను రక్షించాలి. అదే క్షత్రియ ధర్మం. ఇప్పుడు ఈ పనిని అర్జునుడు విధిగా చేయవలసిన అవసరం వచ్చింది. ఈ సంకట సమయంలో అర్జునుడు యుద్ధ విముఖుడు అయినందువల్ల కృష్ణ భగవానుడు అతణ్ని కర్తవ్యోన్ముఖుణ్ని చేసే క్రమంలో ‘అర్జునా! నువ్వు సుక్షత్రియుడివి, ధర్మరక్షణ కోసం ధర్మయుద్ధం చేయడమే నీ స్వధర్మం. అదే నీకు తగిన పని. కానీ, యుద్ధ విముఖత తగినది కాదు. యుద్ధం కన్నా శ్రేయస్కరమైన మరొక మార్గం లేదు కదా! అందుకే ఈ క్లిష్ట సమయంలో నువ్వు యుద్ధం చేయకపోవడం అపకీర్తిని తెచ్చిపెడుతుంది’ అని హెచ్చరించాడు కృష్ణ భగవానుడు.
మానవుడికి ధర్మ జీవనం ప్రధానం, స్వధర్మ నిర్వహణ మనిషి బాధ్యత. దాన్ని విస్మరించి వ్యవహరించిన వ్యక్తికి అపకీర్తి తప్పదు. కురుక్షేత్ర సంగ్రామం మొదలయ్యేదాకా అర్జునుడిలో ఎటువంటి వైముఖ్యమూ లేదు. పైగా అతను మహావీరుడన్న విషయం విరాటరాజు కోసం పోరాడిన సందర్భంలోనే తేటతెల్లమైంది. పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్ర్తాన్ని సాధించిన తపోధనుడు అర్జునుడు. అరణ్యవాస సమయంలోనూ గంధర్వులతో పోరాడి తమ సోదరులైన దుర్యోధనాదులకు విముక్తి కలిగించిన యోధుడు. కాబట్టి, కౌరవ సైన్యంతో యుద్ధం అతనికేం కొత్త కాదు. అపజయ భయమూ లేదు. కానీ, ఒకానొక మాయ ఆవరించిన అర్జునుడు నిస్పృహతో యుద్ధ విముఖుడు కావడం అసలు ప్రయోజనానికి భంగకరం అవుతుంది. అందుకే పార్థసారథి అయిన పరమాత్ముడు అర్జునుడి హృదయసారథిగా మారి భగవద్గీతను బోధించి క్షత్రియుడి ధర్మనిర్వహణ బాధ్యతను వివరించాడు.
ఇది కేవలం అర్జునుడివరకే పరిమితం గాక, సమస్త మానవజాతికి అన్వయించగలిగే అంశంగా గుర్తించాలి. కృష్ణుడి బోధ ప్రతివ్యక్తిని కార్యోన్ముఖుడిని చేస్తుందనడంలో సందేహం లేదు.
కర్తవ్యం విస్మరించి ప్రవర్తించిన వ్యక్తి అపకీర్తి పాలవడం తథ్యం. ఎంతోకాలం శ్రమిస్తేగానీ కీర్తి సాధ్యం కాదు. ఏదో ఒకసారి బాధ్యత సరిగ్గా నిర్వహించని కారణంగా అతను అపకీర్తిపాలయ్యే ప్రమాదం ఉన్నది. ఎంతో నిబద్ధత, సామర్థ్యంతో సాధించిన కీర్తి క్షణాల్లో నాశనం కావడం ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన మనిషికి మరణంతో సమానం. వీరుడైనవాడు ధర్మ వ్యతిరేకుల విషయంలో తన పరాక్రమాన్ని చూపించాలి. సందర్భానికి తగినరీతిలో స్పందించి అవసరమైనప్పుడు యుద్ధం చేసైనా, తన కీర్తిని పెంచుకోవాలి కానీ చివరలో వెనుదిరగడం మరణ సదృశమే అవుతుంది. అది పిరికితనం కిందికి వస్తుంది. అంతవరకూ ఆ వ్యక్తిని వేనోళ్ల కీర్తించినవాళ్లే, ఆ తర్వాత అవహేళన చేయడం గమనిస్తే, అంతకన్నా అపకీర్తి మరొకటి ఉండదు. కృష్ణభగవానుడు చేసిన ఈ దివ్య సందేశం సర్వ మానవాళికీ శిరోధార్యం.
–గన్నమరాజు గిరిజామనోహరబాబు