‘మనః షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి’ (భగవద్గీత: 15.7).
‘బద్ధజీవితం కారణంగా జీవులు మనసుతోపాటు ఆరు ఇంద్రియాలతో తీవ్రమైన సంఘర్షణ పడుతుంటారు’. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు ప్రయోగించిన ‘కర్షతి’ అనే పదం ‘తీవ్ర సంఘర్షణ’ను, ‘పెనుగులాట’ను సూచిస్తుంది. ‘పీత కష్టాలు పీతవి’ అనే నానుడిలో జ్ఞానం, విజ్ఞానం అన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ సామెత మనకు చెప్పే సత్యమేమంటే, ఈ లోకంలో ఎవరికైనా కష్టాలు తప్పవు. అందుకే, ఎవరి కష్టాలు వారివే కానీ ఒకరికి, ఇంకొకరికి పోలిక ఉండదు.
దేవదేవుడే ఈ జగత్తును ‘దుఃఖాలయం’గా అభివర్ణించాడు. రామాలయంలో రామ దర్శనమైనట్లు, విద్యాలయంలో విద్య దొరికినట్లు, వస్ర్తాలయంలో దుస్తులు లభించినట్లు, గ్రంథాలయంలో చదవడానికి పుస్తకాలున్నట్లు.. ప్రపంచమనే దుఃఖాలయంలో అనుభూతమయ్యేవి దుఃఖాలు, కష్టాలే. అయితే, ఈ విషయం చెప్పడానికి ముఖ్యకారణం మనలోని చైతన్యాన్ని జాగృతం చేయడానికే! తద్వారా మనం అన్ని కష్టాలకూ మూలకారణాన్ని తెలుసుకొని దాన్ని సమూలంగా నశింపజేసే యత్నం చేయగలుగుతాం. ఆ కార్యసాధనలో మార్గదర్శనం చేసేదే భగవద్గీత!
కార్యకారణ కర్తృత్వే హేతుః ప్రకృతి రుచ్యతే
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే॥
భగవద్గీత (13.20)
‘సమస్త భౌతిక కార్యకారణాలకు ప్రకృతే కారణం. కాగా, ఈ జగత్తులో నానారకాల దుఃఖాలకు, సుఖాలకు జీవుడే కారణం’. గీతలో చెప్పిన ఈ దివ్య సందేశాన్ని బట్టి మనిషి తన సుఖదుఃఖాలను తానే ఏర్పర్చుకుంటున్నాడు. అందుకే, ‘ఎవరి కష్టాలు వారివే అనడానికి బదులు, ఎవరి కష్టాలు వారు కొనితెచ్చుకొనేవే’ అనడం ‘భగవద్గీత’ ప్రకారం సరిగ్గా సరిపోతుంది. మనిషికి ఈ రహస్యం అర్థమైతే సగం కష్టాలు తీరినట్లే. అతడు ఎప్పుడూ తన దుఃఖాలకు, కష్టాలకు ‘ఇతరులే కారణం’ అని భావిస్తాడు. ఫలితంగానే ఆయా వ్యక్తుల పట్ల ద్వేషం, కోపం, పగ వంటివి వృద్ధి చెందుతుంటాయి. అవి అతడి దుఃఖాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.
మరి ఈ కష్టాలు, అవరోధాల నుంచి ఎలా బయటపడాలి? ఇదే మనిషికి అంతుబట్టని ప్రశ్న. ‘తథాస్తు దేవతలుంటారు, అపశకునం పలుకకు’ అని పెద్దలు అంటుంటారు. అసలు దీని అర్థమేమంటే, ‘మనం మంచిమాట పలికితే మంచి, చెడు మాట పలికితే ఆ చెడు జరుగుతుందని’ భావం. ‘ఈ తథాస్తు దేవతలు ఎవరు?’ భగవద్గీతలో ‘హృదయస్థ పరమాత్ముడే అనుమంత’గా, అంటే ‘అనుమతించేవాని’గా వర్ణితమయ్యాడు. ఆత్మ చైతన్యం మన దేహమంతా వ్యాపించి ఉంటుంది. కాగా, పరమాత్ముని పరమచైతన్యం ప్రతి జీవిలోనూ వ్యాపించి ఉంటుంది. ఆ విధంగా హృదయంలో ఉండే పరమాత్ముడే సాక్షిగా, అనుమతించేవానిగా, భోక్తగా, మహేశ్వరునిగా వర్తిస్తాడని ‘భగవద్గీత’ చెబుతున్నది. ‘ఫలానా కార్యం జరుగదేమో’ అని పదేపదే అనుకుంటుంటే హృదయంలో ఉండే పరమాత్ముడు అనుమతించేవాడు (తథాస్తు) కనుక అనుకున్నట్లుగానే కార్యం బెడిసికొడుతుంది. అలా కాకుండా, ‘ఫలానా కార్యం జరిగే తీరుతుంది’ అని పదేపదే పలకడం ద్వారా హృదయస్థ పరమాత్ముని అనుమతితో అది అనూహ్యంగా నెరవేరుతుంది. ‘ద్వాసుపర్ణా సయుజా సఖాయ’ అని ‘ముండకోపనిషత్’ (3.1.1) కూడా పేర్కొన్నది. పరమాత్ముడు నిరంతరం ఆత్మతోపాటుగానే ఉండి జీవుడు కోరుకున్నవన్నీ తీరుస్తుంటాడు. కనుక, అతడే తథాస్తు దైవం!