‘శివ’ అంటే ఎవరు? మనిషా, కల్పనా లేక దైవమా? ‘శివ’ అంటే ‘ఏది లేదో అది’ (శూన్యత). నేడు ఆధునిక విజ్ఞానశాస్త్రమూ అన్నీ శూన్యం నుంచే వచ్చి శూన్యంలోనే కలిసిపోతాయని నిరూపిస్తున్నది. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ఎంతో ప్రముఖమైన ఈ వ్యక్తి చుట్టూ ఎన్నో కథలు, పురాణాలూ ఉన్నాయి. ఈ సృష్టికి మూలం, విశ్వమౌలిక లక్షణమూ విశాలమైన శూన్యమే. ఈ నక్షత్ర మండలాలు కేవలం చల్లిన నీటి తుంపరలా దానిలోని చిన్న భాగమే. మిగతాదంతా విశాలమైన శూన్యమే. దీనినే ‘శివ’ అంటారు. అదే గర్భం. ప్రతిదీ దీని నుంచే పుడుతుంది, తిరిగి దానిలోనే లయమైపోతుంది. అన్నీ శివుడి నుంచే వచ్చి, తిరిగి శివుడిలోనే కలిసిపోతాయి. శివుణ్ణి అస్తిత్వం ఉన్నవానిగా కాక అస్తిత్వం లేనివానిగా వర్ణిస్తారు. శివుణ్ణి వెలుగుగా కాకుండా చీకటిగా వర్ణిస్తారు. వెలుగు లోకంటే చీకటిలోనే ఓ గొప్ప సాధికారత దాగుంది. చీకటి అన్నిచోట్లా ఉంటుంది. అంతా నిండి ఉన్నదొక్క చీకటే.
‘శివ’ అనగానే మనకు ఆదియోగి స్ఫురణకు వస్తాడు. ‘యోగ’ అంటే ‘తలకిందులుగా నుంచోటమో లేక శ్వాసను బిగపట్టి ఉంచటమో’ కాదు. ఈ సృష్టి ఎలా జరిగిందనే దాని ప్రాథమిక స్వభావం తెలుసుకోవటానికి, దాన్ని అత్యున్నత స్థాయికి (సంభావ్యతకు) ఎలా తీసుకెళ్లవచ్చో తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానమే యోగ. యోగశాస్త్ర బోధన మొట్టమొదటిసారిగా కాంతిసరోవరమనే సరస్సు ఒడ్డున జరిగింది. ఇది హిమాలయాల్లోని కేదార్నాథ్కు కొన్నిమైళ్ల దూరంలో ఉంది. అక్కడ ఆది యోగి ఈ అంతర్గత పరిజ్ఞానాన్ని సప్తఋషులైన తన మొదటి ఏడుగురు శిష్యులకు విధివిధానంగా నేర్పించారు. ఇది మతాలన్నీ పుట్టకమునుపే జరిగింది. మానవాళిని (మళ్లీ ఒక్కటిగా చేయలేనివిధంగా) విడగొట్టడానికి మార్గాలు సృష్టించకముందే, మానవ చైతన్యాన్ని పెంచటానికి అవసరమైన శక్తివంతమైన సాధనాలను సాక్షాత్కరింపజేసుకొని, నేర్పించటం జరిగింది.
ఎవరినైనా ‘యోగి’ అనాలంటే, అతను ‘ఈ సృష్టి మొత్తం తానే’ అని అనుభూతి చెందాలి. ఈ విశ్వాన్నంతా మీలో భాగంగా ఒక్క క్షణమైనా అనుభూతి చెందాలంటే మీరు ఆ శూన్యమైపోవాలి. శూన్యమే అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటుంది. ఇక వేరేదేదీ, అన్నిటినీ తనలో ఇముడ్చుకోలేదు. ఒక పాత్ర సముద్రాన్ని తనలో ఇముడ్చుకోలేదు. కానీ, ఈ గ్రహం సముద్రాన్ని తనలో ఇముడ్చుకోగలదు. మళ్లీ, అదే గ్రహం ఈ సౌరవ్యవస్థను తనలో ఇముడ్చుకోలేదు. మళ్లీ, అదే సౌరవ్యవస్థ తనలో ఈ గ్రహాలను, సూర్యుడ్నీ ఇముడ్చుకోగలదు. కానీ, పాలపుంతను తనలో ఇముడ్చుకోలేదు. ఇలా, స్థాయిని పెంచుకుంటూపోతే అన్నిటినీ తనలో ఇముడ్చుకోగలిగేది శూన్యం మాత్రమే. ‘యోగ’ అనే పదానికి అర్థం ‘ఐక్యత’. దీన్ని అనుభూతి చెందినవారే ‘యోగి’ అవుతారు. అంటే, కనీసం ఒక్క క్షణమైనా అతను శూన్యాన్ని అనుభూతి చెందాలి.
దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో శివుడంటే భారతీయ క్యాలెండర్ చిత్రపటంగా మాత్రమే పరిచయమయ్యారు. ఆయన్ని బూరెబుగ్గలవానిగా, నీలవర్ణునిగా చూపిస్తారు. ఎందుకంటే, ఆ క్యాలెండర్ కోసం బొమ్మ గీసిన కళాకారుడికి ఒక్క ముఖం గీయటమే తెలుసు. కృష్ణుడ్ని గీయమని అడిగితే ఆ చేతిలో ఒక వేణువు పెడతాడు. రాముణ్ని గీయమంటే చేతిలో ఒక ధనుస్సు ఉంచుతాడు. శివుణ్ణి అడిగితే తలమీద ఒక చంద్రవంకను ఉంచుతాడు, అంతే తేడా! యోగ సంప్రదాయంలో శివుణ్ణి ఒక దేవుడిగా చూడరు. ఆయన హిమాలయ ప్రాంతంలో నివసించినవాడు, ఈ భూమ్మీద నడయాడినవాడు. యోగ పరంపరకు మూలంగా ఆయన మానవ చైతన్యానికి చేసిన సహాయం మహాద్భుతమైంది, ఎంతమాత్రం విస్మరించలేనిది!
సద్గురు జగ్గీ వాసుదేవ్