సీతాదేవి అపహరణ జరిగింది. పర్ణశాలకు వచ్చి సీత లేని విషయాన్ని గుర్తించిన రామలక్ష్మణులు పరిపరి విధాలుగా ఆమె అదృశ్యాన్ని గురించి విచారించసాగారు. ఆ ఆవేదనలో మాయామానుష విగ్రహుడైన రాముడు భావోద్వేగాలను అదుపుచేసుకోలేక ఒక సామాన్యుడిగా ఆలోచిస్తూ లక్ష్మణుడితో… ‘నేనున్నప్పుడే కదా ఈ లోకం ఉండేది, దాన్ని నేను చూసేది. నేనే లేకపోయాక ఈ లోకం ఉనికిని చూసేదేముంది? ఈ లోకమే ఉండదు. ఎందరో వచ్చారు, పోయారు అయినా ఈ లోకం అలాగే ఉన్నది కదా! ఈ లోకం ఎవరికి ఉన్నదంటే ఉన్నవారికే ఉన్నది… పోయిన వారికి లేదు కదా!’ అంటాడు. ‘సీత లేనినాడు నేనూ లేను.. అప్పుడు ఈ సృష్టి నిర్మాణ సంపత్తి ఎందుకు ఉండాలి? దీన్ని నిర్మూలించేస్తాను’ అన్నాడు.
రామచంద్రుడి మాటల్లో తాత్వికత ఉన్నది. ‘నేను’ ఉన్నట్లయితేనే ఈ అఖిలమూ ఉన్నది, ‘నేను’ లేకపోతే ఏదీ లేదు అంటాడు రాముడు. లోతుగా విచారిస్తే తాను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడనే భావన ఈ మాటల్లో ధ్వనిస్తున్నది. నిజానికి ‘నేను’ అనేది ప్రపంచానికి కేంద్రం వంటిది. దానిచుట్టూనే వ్యవహారాలన్నీ తిరుగుతూ ఉంటాయి. మహత్తు పిమ్మట కనిపించేది అహంకారమే. ‘నేను’ అనేది ఎవరో తెలుసుకున్నా, అందులో లయమైనా అఖిలమూ తనకు వేరుగా ఉండదనే భావన నిలుస్తుంది. అంతా ఒక్కటిగానే ఉన్నప్పుడు అందులో తానూ ఉంటాడే కానీ, తనకంటూ ప్రత్యేకమైన అస్తిత్వం ఉండదు. నదిగా ఉన్నప్పుడే దానికి అస్తిత్వం. కానీ, సముద్రంలో కలిసినప్పుడు దాని అస్తిత్వం కోల్పోయి, ప్రత్యేకతను కోల్పోయి తానే అంతటా ఉంటుంది. తనలో అంతా నిలుస్తుంది.
ఆ ‘నేను’ను తెలుసుకోవడం కష్టసాధ్యమే! అసాధ్యం మాత్రం కాదని రుషులు రుజువు చేశారు. దానికి సాధన అవసరం. ఉన్న స్థితి నుంచి ఆనందానికి మార్గం చూపే ఊర్ధ్వ ముఖ పరిణామక్రమం జరగాలి. అదీ ప్రామాణికమైన ప్రస్థానంలో సాగాలి. విమలమైన చైతన్యమై కాలానికి, ప్రకృతికి అతీతమైన, మాయావరణాన్ని దాటి నీడలు లేని వెలుగులు పంచే మార్గం గుండా శివశిక్తుల సంయోగస్థానంలో బ్రహ్మానంద స్థితికి చేరాలి. అప్పుడు అభేదంలో నుంచి భేద స్థితికి వ్యత్యాసం ఏమిటో బోధపడుతుంది. ఇదంతా అక్షరజ్ఞానమై దానికి అనుభవం జతయిన వేళ మాత్రమే ఆ ‘నేను’ ఏమిటో అవగతమవుతుంది. మృత్యువును, మృత్యు దశలను, మృత్యు రహస్యాన్ని, మృత్యు తత్వాన్ని, మృత్యుధర్మాన్ని అవగాహన చేసుకున్నవాడు ‘నేను’ ఆంతర్యాన్ని అవగాహన చేసుకొని కైవల్య శ్రీపదాన్ని చేరుకుంటాడు. అంటే ‘నేను’ తత్వాన్ని ‘ఎరుక’ పరుచుకుంటాడు. చివరికి జీవన్ముక్తుడవుతాడు.
‘సీతే నా తత్వం’ అంటాడు రాముడు. నేను అనేది పురుషశక్తి అయితే, సీత స్త్రీ శక్తి. ఒకటి ‘శివుడు’, రెండోది ‘శివా’. ఈ రెండూ పరస్పర ఆధారితాలు. ఒకటి లేక రెండోదానికి ఉనికి లేదు. కార్యావిష్కరణకు స్త్రీ, పురుష శక్తులు రెండూ అవసరం. అందుకే .. ‘ఆమె ప్రాణం.. నేను ప్రాణి’ అన్నాడు. ఈ రెండూ ఓతప్రోతమై భాసిస్తేనే సృష్టి. ఒకటి లేక ప్రకృతిలో మరొకదానికి ‘జనుస్సు’ (పుట్టుక, జన్మం) లేదు. ‘మేం ఇరువురం లేనినాడు ఈ జగన్నిర్మాణ సంపత్తి ఎందుకుండాలి. దాన్ని ఇప్పుడే నాశనం చేస్తాను’ అంటాడు. జగత్తు నిర్మాణమనేది ‘సంకల్ప’ జనితం. సంకల్పమే లేని వేళ జగత్తే లేదు. లయకాలంలో భవుడు (శివుడు) ఎలా ప్రవర్తిస్తాడో ఆ విధానాన్ని చూపుతానంటాడు రాముడు.
మానవీయ సుఖ దుఃఖాలకు ప్రాతినిధ్యమైన స్థితిలో ‘నేను’ వెలుగుచూస్తుంది. యోగవాశిష్ఠం లాంటి వేదాంతాన్ని వశిష్ఠ మహర్షి దగ్గర అభ్యసించిన రాముడి లాంటివాడే ‘నేను ఉంటేనే అఖిలమూ ఉన్నది, లేనట్లయితే ఏదీ లేదు’ అన్నాడంటే భావోద్వేగాల గాఢత ఎలాంటిదో అర్థమవుతుంది.
పాలకుర్తి రామమూర్తి