ఓ రాజు భటులతో కలిసి వేట కోసం అడవికి వెళ్లాడు. జంతువులను వేటాడుతూ రాజు దారి తప్పాడు. సూర్యాస్తమయం కావస్తున్నా.. భటులు తమ రాజును కలుసుకోలేకపోయారు. అప్పటికే రాజు బాగా అలసిపోయాడు. చీకట్లు ముసురుకుంటుండటంతో ఆయనకు విశ్రాంతి తీసుకోవాలనిపించింది. ఇంతలో ఓ సాధువు కనిపించాడు. తను విశ్రమించడానికి ఏదైనా వసతి చూపాల్సిందిగా సాధువును కోరాడు రాజు. పక్కనే ఉన్న తన చిన్న గుడిసె చూపించి, అందులో విశ్రాంతి తీసుకోమని చెప్పాడు సాధువు. ఆ మాటకు రాజుకు కోపం వచ్చింది. ‘నేనెవరో తెలుసా! ఈ రాజ్యానికి రాజును. ఏనుగు చచ్చినా బతికినా వెయ్యే అన్నట్లు ఎక్కడ ఉన్నా నేను రాజునే’ అన్నాడు. సాధువు నవ్వుతూ ‘బొందిలో ప్రాణం ఉన్నంతవరకే ఈ శరీరానికి విలువని మరిచారు రాజా! మీరు మరి కొద్ది దూరం వెళ్లండి. ఇంకేదైనా వసతి దొరుకుతుందేమో…’ అన్నాడు. చీకటి పడతుండటం, దారి తెలియకపోవడంతో సాధువును సాయం రావాల్సిందిగా కోరాడు రాజు. ఇద్దరూ నడక ప్రారంభించారు.
కాసేపటికి పెద్ద గులాబీ తోట మధ్యలో ఓ రైతు ఇల్లు వారికి కనిపించింది. ఇద్దరూ వెళ్లి రైతును కలిసి పరిచయం చేసుకుని విషయం వివరించారు. రైతు వారిని లోనికి ఆహ్వానించాడు. వారికి పాలు, పండ్లు ఇచ్చాడు. అక్కడికి వంద అడుగుల దూరంలో చిన్న కొలను ఉంది. అక్కడ పడుకోవడానికి అనువైన స్థలాన్ని రాజుకు చూపాడు రైతు. అటుగా వెళ్తుంటే రాజు చెప్పులు తెగిపోయాయి. రైతే స్వయంగా వాటిని తన ఇంట్లో పెట్టించాడు. రాజు కొలను ఒడ్డున ప్రశాంతంగా నిద్రించాడు. తెల్లవారడంతోనే రాజు, సాధువు ఇద్దరూ నిద్రలేచారు. కళ్లు నులుముకుంటూ.. ‘రాత్రంతా శరీరం విలువ గురించి మీరన్న మాటలే మెదిలాయి.
నేను రాజును కదా, నా ప్రాణం పోయాక, ప్రజలు నన్ను పట్టించుకోరా?’ అని అడిగాడు రాజు. సాధువు నవ్వి ‘మీరు నాకు సహకరిస్తే ఇప్పుడే రుజువు చేస్తాను!’ అన్నాడు. రాజును ప్రాణం పోయిన వాడిలా నటించమన్నాడు. రాజు అలాగే శవంలా పడుకున్నాడు. సాధువు రైతు దగ్గరికి వెళ్లి.. ‘రాజు చనిపోయాడని, భటులు వచ్చేంతవరకు రాజు మృతదేహాన్ని మీ ఇంటి వరండాలో ఉంచమ’ని కోరాడు. రైతు కనికరం లేకుండా, సాధువు ముఖం మీదే తలుపు వేశాడు. ‘అలా చేస్తావేం! ఎంతైనా మన రాజుగారు కదా!’ అన్నాడు సాధువు. ‘రాజైనా, భటుడైనా.. ఊపిరి పోయాక మిగిలేది శవమే కదా! ఎవరైనా మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?’ అని కేకలేశాడు. ఇదంతా ప్రత్యక్షంగా అనుభవించిన రాజుకు జ్ఞానోదయం అయ్యింది. తెగిన చెప్పులకున్న విలువ కూడా ప్రాణం లేని శరీరానికి ఉండదని తెలుసుకున్నాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు 93936 62821