రాముని గుడి లేని ఊరైనా ఉంటుంది, కానీ హనుమంతుడి గుడి లేని ఊరు ఉండదనేది జనవాక్యం. గ్రామ రక్షకుడిగా, ఊరి పొలిమేరల సంరక్షకుడిగా ఆంజనేయుడికి ఉన్న ప్రాధాన్యం అలాంటిది మరి! అందుకే కొన్ని ఊళ్లలో అయితే ఊరి మధ్యలో ఒకటి, సరిహద్దుల్లో ఒకటి, పొలిమేరలో ఒకటి ఇలా హనుమంతుడి గుళ్లు రెండు, మూడు ఉంటాయి. అయితే కోతులు వ్యావసాయికంగా, లేదంటే మరోలా మనిషికి ఏ అవసరంలోనూ ఉపయోగపడవు. రామాయణంలో… సీతాన్వేషణకు లంకకు వెళ్లిన హనుమంతుడు ఓ చెట్టుమీద దాగి ఉంటాడు. ఆయన నోటినుంచి రామనామం వెలువడుతూ ఉంటుంది. అప్పుడు అనుకోకుండా సీత ఆయనను చూస్తుంది. మొదట ఆమె అది కలేమో అనుకుంటుంది. కలలో కోతులు వస్తే మంచిది కాదన్న విషయాన్నీ గుర్తు చేసుకుంటుంది. అదీగాక వానరాలను చంచలత్వానికి ప్రతీకగా భావిస్తారు. అయితే, వానరాకారుడైన హనుమంతుడు మాత్రం కోట్లాది భారతీయుల గుండెల్లో నిలిచిపోయాడు. దీనికి కారణం సూర్యుడి దగ్గర ఆయన ఆర్జించిన అపారమైన పాండిత్యం, వాయుదేవుడి పుత్రుడిగా సాటిలేని పరాక్రమం, రామునిపట్ల భక్తి, సుగ్రీవుడిని కష్టకాలంలోనూ విడువని మైత్రి ఇన్ని ఉత్తమమైన గుణాల వల్ల హనుమంతుడు ఆరాధ్యుడయ్యాడు.
హిందూ దేవాలయాల్లో ప్రధాన దైవం గర్భాలయంలో కొలువుదీరి ఉంటాడు. ఆయా దేవీదేవుళ్ల వాహనాలు మూలమూర్తికి ఎదురుగా ఒక మంటపంలో ఉంటాయి. వైష్ణవ మందిరాల్లో అయితే గరుత్మంతుడు, శివాలయంలో అయితే నందీశ్వరుడు ఇలా వాహనాలు దేవుళ్లను చూస్తూ ఉంటాయి. రాముడు విష్ణుమూర్తి అవతారమే అయినప్పటికీ, గరుత్మంతుడు కాకుండా ఆ స్థానాన్ని హనుమంతుడు ఆక్రమించాడు. ఇక సాధారణంగా హిందూ మందిరాల్లో గర్భాలయంలోకి వెళ్లడానికి మామూలు సందర్భాల్లో పూజారి మినహా ఎవ్వరికీ అవకాశం ఉండదు. ఆ రకంగా చూస్తే గర్భాలయంలో కొలువైన రాముడు భక్తులకు కొంచెం దూరంగా ఉంటాడు. అదే రామభక్తుడైన హనుమంతుడు మాత్రం ఎంతో చేరువలో ఉంటాడు. ఆయనకు మొక్కితే రాముడికి మొక్కినట్లే అని భావిస్తారు. అందుకే హనుమాన్ చాలీసాలో ‘తుమ్హరే భజన రామ్కో పావై/ జనమజనమకే దుఃఖ బిసరావై’ అంటాడు తులసీదాసు. నిన్ను కొలవడం ద్వారా ఎవ్వరైనా సరే రాముణ్ని చేరుకుంటారు, ఫలితంగా జన్మజన్మల వేదనంతా దూరం చేసుకుంటారని ఈ చౌపాయీ అర్థం. అందుకే ఉత్తర భారతదేశంలో… ‘పహ్లే హనుమాన్, ఫిర్ భగవాన్’ (మొదట హనుమంతుడు, ఆ తర్వాతే భగవంతుడు) అన్న నానుడి వాడుకలో ఉంది.
చింతలపల్లి హర్షవర్ధన్