శుకముని పరీక్షిత్తుతో.. రాజా! ఆ హేమంత రుతువు ప్రథమ మాసం మార్గశిరంలో మొదటి రోజున నందుని మంద(గొల్లపల్లె)లోని ఇందువదనలు గోపకన్యలు వేకువలో ముందుగా నిద్రలేచారు. ఆనందంగా కాళిందీ నదికి వెళ్లి స్నానాలు చేశారు. గట్టున ఇసుకతో అందంగా గౌరీదేవి ప్రతిమను రూపొందించి, పుష్పాలతో అలంకరించారు. చందనం అలది, ధూప దీపాలతో అర్చించి పలు విధాల నైవేద్యాలు అర్పించారు. ఇలా నెల పొడవునా హవిష్యాన్నం భుజిస్తూ నెలతలు- గోపకాంతలు శ్రీపతిని- కృష్ణుని పతిగా కోరి కాత్యాయనీ వ్రతం ఆచరించారు.
కం॥ ఓ కాత్యాయని! భగవతి!
నీకున్ మ్రొక్కెదము నేము నేడనుకంపన్
మా కిందరకును వైళమ
శ్రీకృష్ణుడు మగడు గాగ జేయుము తల్లీ!
భగవతీ! ఓ కాత్యాయనీదేవీ! నీకు అనేక వందనాలు. దయతో మా అందరికీ తొందరగా నందసుతుని పతిగా ప్రసాదించవమ్మా!
కం॥ ఓ తల్లి! మాకు కృష్ణుడు
చేతో విభుడైన నాడు చెలువల మెల్లన్
నేతి వసంతము లాడుచు
జాతర సేసెదము భక్తి చాతురి తోడన్
‘ఓ అమ్మా! ఉమాదేవీ! మాకు మా(లక్ష్మీ)పతి మగడు అయిన నాడు మేమందరమూ నేతి వసంతాలాడుతూ, పాడుతూ భక్తితో కడు వేడుకగా నీకు జాతర చేస్తాం’ అంటూ కాత్యాయనీ దేవిని కటాక్షించమని కోరేవారు. ‘భూయాన్నంద సుతః పతిః’ (శ్రీకృష్ణుడు మగడు గాగ జేయుము) అన్న అష్టాక్షరీ మంత్రాన్ని ఆర్తితో నిష్ఠగా జపించేవారు. “పాతి ఇతి పతిః” పతి అనగా రక్షించువాడు అని అర్థం. సర్వరక్షకుడు కనుక శ్రీహరియే నిజమైన పతి. తనకే రక్షణ లేని జీవుడు మరో జీవుని ఎలా రక్షించగలడు? ‘నీవే నా పతియు గతియు నిజముగ కృష్ణా’ అనికదా మన ప్రార్థన! శ్రీపతి పతి అయితే ఏ సతికీ దుర్గతి వైధవ్య దుఃఖం లేదు.
‘కతి అయనాని మోక్షమార్గాః సంతి’- మోక్షానికి ఎన్ని మార్గాలున్నాయి? అంటూ విచారణ చేసేవాడు కత్యయనుడు. బ్రహ్మవేత్త ఐన కత్యయన మహర్షికి ఒక కల్పంలో పుత్రికగా ఆవిర్భవించిన కారణాన అమ్మవారికి ‘కాత్యాయని’ (బ్రహ్మవిద్య) అని పేరు. నందనందనుడు గోవిందుని పొందుకోరి కుందరదనలు గోపికలు గానం చేసిన ‘ఓ తల్లి మాకు కృష్ణుడు..’ అన్న కంద పద్యం పోతన్న గారి సొంతం.
రాజా! ఆ గజగమనలు యమునా తీరం చేరి ఒక విజన (ఏకాంత) స్థలంలో వలువలు చీరలు విడిచారు. కళంక రహితలైన ఆ పంకజనేత్రలు జంకు లేక జలకాలాడటానికి జలంలో దిగారు. వారిజాక్షుని కృష్ణునిపై పాటలు పాడుతూ అవ్వారిగా తమ ఇచ్ఛ కొలదీ వారి (జల) విహారాలు జలక్రీడలు ఆడారు. రాజా! వారి గోపికల విహరణలు.. గోవిందుని స్మరిస్తూ వారు పొందిన ఆనంద పారవశ్యాలు లోకంలోని వారికి ఇతరులకు ఎందైనా ఉన్నాయా? ఆ తోయజ(పద్మ)నేత్రలు యమునా నదీ తోయాలలో (జలాలలో) దిగంబర స్నానాలు చేస్తున్నారని, దూరగుడైనా దూరంలో ఉన్నా సర్వపారగుడు (సమర్థుడు) తోయజాక్షుడు యోగేశ్వరేశ్వరుడు శ్రీకృష్ణుడు తెలుసుకొని, వారిని అనుగ్రహించాలని వ్రతం చివరి రోజున త్వరిత గతిని తోడి గోపబాలురతో అచ్చటికి విచ్చేశాడు. కదలకుండా ఇక్కడే ఉండండని తోడివారికి కనుసైగ చేసి, సరిగా సమయం చూసి ఆ గొల్ల చెలువల గోపికల వలువలు దొంగిలించి ఒక కదంబ వృక్షం కడిమిచెట్టు ఎక్కి కూర్చున్నాడు. పరమార్థంలో… గోపికల ‘అనాది అజ్ఞాన ఆవరణ’మనే అంబరా(చీర)లను అపహరించాడు. కృష్ణుడు అంటేనే కర్షించే లాగివేసే వాడని అర్థం. ఏమిటి ఆ లాగేది అంటే.. జీవులకున్న ‘దేహమే నేను’ అన్న అభిమానమనే అజ్ఞానాన్ని దేహాత్మబుద్ధిని. ‘గోపాయితుం ఇచ్ఛతి ఇతి గోపీ’ తన్ను తాను మరుగుపరచుకొనే దాచుకొనే ప్రయత్నమే గోపీత్వం జీవత్వం. ఇలాంటి బుద్ధి స్వభావం ఉన్నంతవరకు జీవులందరూ స్త్రీలే గోపికలే. సృష్టిలో ఒక్క జగన్నాథుడే పురుషుడు! అట్టి పురుషోత్తముని పరోక్షమని భావిస్తూ సిగ్గుతో బెదిరిపోయే స్వభావం కలవారే గోపికలు. వారు వారిజాక్షుని వస్ర్తాలిమ్మని వేడుకొన్నారు. బతిమలాడారు..
కం॥ మామా వలువలు ముట్టకు
మామా! కొనిపోకు పోకు మన్నింపు తగన్
మా మానమేల కొనియెదు? మా
మానస హరణమేల? మానుము కృష్ణా!
మామా! మా కోకలు ముట్టుకోమాక, పట్టుకు పోమాక, మమ్ములను మన్నించు. మా మానమెందుకు హరిస్తావు? మా మనస్సులను ఎందుకు దోచుకుంటావు? నీకు వావి వరుసలు ఉన్నట్లు లేదు. అయినవారు, కానివారు అన్న వివేకం ఉండాలి కదా? కృష్ణా! నీ గుట్టు కనిపెట్టామయ్యా. ఈ తుంటరి పనులన్నీ మానుకో. రాజీవలోచనా! మేము అబలలం. మా చీరలు మాకు ఇవ్వకుంటే ఈ విషయం నందరాజుకు చెపుతాము.
శా॥ ఇంతుల్ తోయము లాడుచుండ మగవారేతెంతురే? వచ్చిరా
యింతల్ సేయుదురే? కృపా రహితులై యే లోకమందైన నీ
వింతల్ నీ తల బుట్టెగాక మఱి యేవీ కృష్ణ! యో చెల్ల! నీ
చెంతన్ దాసులమై చరించెదము మా చేలంబు లిప్పింపవే!’
‘కృష్ణా! ముగుదలు స్నానాలు చేస్తుంటే మగవారు ఆ పరిసరాలకు రావచ్చునా? వచ్చారే పో, జాలిలేక రెచ్చిపోయి ఇలా నొచ్చుకొనే అల్లరి పనులు చెయ్యొచ్చా? ఔరా! ఈ వింత చేష్టలు నీకే చెల్లాయి. కృష్ణా! నీకు దాస్యం చేస్తూ నీ చెంతనే పడి ఉంటాము. మా పటములు చీరలు మాకిప్పించు’. పై శార్దూల వృత్తం పోతన అమాత్యుల చిత్త సంజాతం స్వీయం. ‘ఇంతల్ సేయుదురే’ అన్న మాటలో ఎంత కవిత్వముందో! అది భావుక భక్తులకు ఆలోచనామృతం! పరమాత్మ ఇలా పలికాడు.. ‘ఏ పడుచువాణ్ని పతిగా కోరి మీరు ఈ కాత్యాయనీ వ్రతం చేశారో చెప్పండి. అబద్ధమాడితే మీ మీద ఒట్టు. ఈ వలపు మీతోనే పుట్టింది కాదు. ఇల(భూమి)పై అంతటా ఉన్నదే. ‘నేను’ పరాయివాడనా? ‘ఎఱుగనే మీలోన నెప్పుడు నున్నాడ, నేను జూడని మర్మమెద్ది గలదు?’ నేను ఎప్పుడూ అంతర్యామిగా మీలోనే ఉన్నాను. (‘ప్రజ్ఞానం బ్రహ్మ’ తెలివే స్వరూపంగా ఉన్నవానికి తెలియనిదంటూ ఏదైనా ఉంటుందా? సర్వజ్ఞునికి మరుగు, మర్మములనేవి ఉంటాయా?) నాకు తెలియని, నేను చూడని రహస్యమేముంది కనుక? దాసుని దోషాలు దండంతో సరి! నాకు నమస్కరించి మీమీ వస్ర్తాలు పుచ్చుకోండి.’ పరమార్థంలో కృష్ణుడు లేని, కృష్ణుడు కాని గోపిక ఉందా? మట్టి లేని ఘటం (కుండ) ఉంటుందా? తంతువు (దారం) లేని పటం (వస్త్రం) ఉంటుందా? శ్రీశుకులు రాజా! చాలా సేపు మథనపడి, చివరకు ఎలాగో మనసులు దిట్టపరచుకొని ఆ బాలలందరూ ఒక చేతితో మర్మాంగం మాటు పరచుకొని నీటి నుంచి వెలికి వచ్చి, ఒంటిచేతితో కొంటె కృష్ణునికి వందనం చేశారు. పరమాత్మ.. ‘అయ్యో! ఒకటికి రెండు తప్పులు! వ్రతదీక్షలో దిగంబర స్నానం వరుణదేవునికి అపచారం. అంబికాదేవికీ అపరాధమే. ఏకహస్తాభివాదనం భగవదపచారం. ఆ చేతిని ఖండనం నరకడమే దానికి దండనం! మీకు వ్రతఫలం దక్కాలంటే చక్కగా రెండు చేతులూ ఎత్తి నాకు నమస్కరించండి’ అన్నాడు. వ్రతఫలం దక్కదనే సరికి వ్రేతలందరూ వెతచెంది వెంటనే నుదుట చేతులు జోడించి, ఒయ్యారంగా వంగి భగవంతుడు హరికి వందనం చేశారు. స్వామి సంతసించి వారి మృణ్మయ వస్ర్తాలను చిన్మయం చేసి, మాంసపిండాలను దేహాలను మంత్రమయం గావించి అనుగ్రహించాడు. రాసలీలా ప్రవేశానికి అర్హత కలిగించాడు.
ఈ లీలా సమయానికి గోపబాలునికి ఏడేళ్ల వయసు. పరమార్థం విచారించక కేవలం బాహ్యార్థం చూచి ఆధునిక విమర్శకులు అశ్లీల ప్రసంగమని ఆక్షేపిస్తారు. జీవుడు వాస్తవానికి సచ్చిదానంద స్వరూపుడే! కాని, ఆ స్వరూపం పంచకోశాలనే ఆవరణలతో (స్థూల శరీరం అన్నమయకోశం; ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు సూక్ష్మ (లింగ) శరీరం; ఆనందమయ కోశం కారణ శరీరం) కప్పబడి ఉంది. ఈ ఆవరణలు తొలగితేనే ఆత్మస్వరూప దర్శనం. శరీర త్రయ తాదాత్మ్యం (దేహమే నేను అనే అభేద బుద్ధి) తొలగించుటే చీర హరణం. లోకంలో రసం ఆనందం అనుభవానికి ఎప్పుడు వస్తుంది? తల్లికి, పాలు తాగే పిల్లకీ మధ్య వస్త్రమనే అడ్డు ఉన్నంతవరకు తల్లికి వాత్సల్యరసానుభవమూ ఉండదు. బిడ్డకి పాలు తాగే అవకాశమూ ఉండదు. అంతేకాదు, వస్త్రమనే ఆవరణ తొలగనిదే లోకంలో దాంపత్య శృంగార రసాస్వాదనకు కూడా అవకాశం కలుగదుగా! అలాగే, ఆవరణ భంగం కానిదే రాసలీలా రసానుభూతి కూడా లేదు. వస్ర్తాపహరణం ఆవరణ భంగలీల! రాసలీల జీవబ్రహ్మ ఐక్యలీల! రాజా! ఇలా నారాయణుడు ఇచ్చిన చీరలను ఆ నారీమణులు ధరించి నందకిశోరుని ఆనందంగా అవలోకిస్తూ అక్కడే కదలకుండా నిలబడిపోయారు. చతురనటమూర్తి వారి చెంతకు చేరి.. ‘అటమీద రాత్రుల యందు మీకు నన్ను బొందగల్గు నమ్మిపొండు’ రాగల రాత్రులందు మీకు నా కలయిక లభిస్తుంది. నా మాటలు నమ్మి మీరు ఇళ్లకు వెళ్లండి అని చెప్పగా వ్రతఫలం దక్కిందని ముకుందుని చరణారవిందాలను మదిలో స్మరిస్తూ ఆనందంగా నంద గోకులం వెళ్లిపోయారు. ప్రపంచ జ్ఞప్తి స్ఫురణలేని రాత్రివేళ, గాఢ సుషుప్తిలో ‘నన్ను బొందగల్గు’ నాయందు ఐక్యం కాగలరు అని పరమార్థం!