ఓ గ్రామంలోని రైతు, ప్రతి పౌర్ణిమ రోజు సాయంత్రం రామాలయం వద్ద అన్నదానం చేసేవాడు. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అక్కడికి వచ్చి భోజనం చేసేవారు. ఒక పౌర్ణిమ రోజు సాయంత్రం గ్రామం నుంచి వెళ్తున్న ఓ ప్రవచనకర్తకు అన్నదానం విషయం తెలిసింది. రైతును కలుసుకొని ఆప్యాయంగా పలకరించాడు. ‘అన్నదానం అన్ని దానాలకన్నా మిన్న’ అని చెబుతూ అలాంటి కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు రైతును అభినందించాడు. కానీ, రైతు బాధగా ముఖం పెట్టి ‘చాలామంది గ్రామస్తులు నేను చేస్తున్న అన్నదానం గురించి రకరకాలుగా చెప్పుకొంటున్నారు.
స్వార్థం, కీర్తి కాంక్షతో నేను ఈ పని చేస్తున్నానని మాట్లాడుతున్నారు. ఎక్కువ పాపాలు చేసి, పాపపరిహారంలో భాగంగా అన్నదానం చేస్తున్నానని మరికొందరు నిందలు వేస్తున్నారు. నిజంగా నాకు ఎలాంటి స్వార్థం లేదు. నా మనసుకు తోచింది కాబట్టి చేస్తున్నాను. మంచికి పోతే ఇలా నిందలు పడాల్సి వస్తున్నది’ అని బాధపడ్డాడు. ప్రవచనకర్త స్పందిస్తూ.. పక్కనే ఫుట్బాల్ ఆడుతున్న పిల్లలను చూడమని చెప్పాడు. ‘వాళ్లు ఏం చేస్తున్నారో తెలుసా?’ అని రైతును అడిగారు. ‘దొరికినవారు దొరికినట్టు బంతిని తన్నుతున్నారు’ అన్నాడు రైతు. ‘మనమూ అలాగే ఉండాలి.
మనకు మంచి అనిపించింది చేస్తూ పోవాలి. ఎదుటివారి అభిప్రాయాల, ఆలోచనల కాలి బంతి కాకూడదు. ఎందుకంటే ఆ బంతి ఎటు పోతుందో చెప్పలేం. ‘పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి!’ అని తెలిసిందే కదా. ఎంత మంచిపని చేసినా రంధ్రాన్వేషణ చేసే వాళ్లు ఉంటారు. వారి ఆలోచనలకు ప్రాధాన్యమిస్తే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతాయి. ఏ స్వార్థం లేకుండా అన్నదానం చేస్తున్నావు. నీ అంకితభావం చూసి విమర్శకులు కూడా నిందలు వేయడం నిదానంగా మానుకుంటారు. నీ గొప్పదనాన్ని అర్థం చేసుకుంటారు’ అన్నాడు. ఆ మాటలకు పొంగిపోయిన రైతు.. అక్కడ అన్నదానానికి వచ్చిన వారికి హుషారుగా భోజనం వడ్డించాడు.
– ఆర్సీ కృష్ణస్వామి రాజు, 93936 62821