తిరుమల : ప్రతినెలా మొదటి మంగళవారం తిరుమల (Tirumala) , తిరుపతి స్థానికులకు టీటీడీ (TTD) కల్పిస్తున్న స్థానిక కోటా దర్శనాల్లో స్వల్ప మార్పు చేశారు. ఈనెల 4న మొదటి మంగళవారం రథసప్తమి పర్వదినం రావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండో మంగళవారానికి స్థానిక కోటా (Local Quota) దర్శనాలను మార్పు చేశారు.
ఈ మేరకు తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్, తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో 9వ తేది ఆదివారం టోకెన్లను జారీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. స్థానికులు ఈ మార్పును గమనించి టోకెన్లు పొందాలని టీటీడీ అధికారులు కోరారు.
శ్రీవారి హుండీకి రూ. 2.52 కోట్లు ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు కేవలం రెండు కంపార్టుమెంట్లలో మాత్రమే వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం (Sarvadarsan) అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 51,818 మంది భక్తులు దర్శించుకోగా 19,023 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 2.52 కోట్లు ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు.