విదేశాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఒక యువకుడు వ్యాపారం చేయాలనుకున్నాడు. అదే విషయం తండ్రికి చెప్పాడు. వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని రోజులపాటు కొడుకును గుడికి వెళ్లమన్నాడు తండ్రి. రోజూ దేవుడికి కొబ్బరికాయ కొట్టి, కర్పూర హారతి కూడా ఇవ్వమన్నాడు. ‘వ్యాపారం వివరాలు అడగకుండా, గుడికి వెళ్లమంటాడేంటి?’ అనుకున్నాడు కొడుకు. అయినా తండ్రి మాటను కాదనలేక రోజూ గుడికి వెళ్లసాగాడు. దేవుడికి కొబ్బరికాయ కొడుతున్నాడు, కర్పూర హారతి ఇస్తున్నాడు. యువకుడు రోజూ గుడికి రావడం గమనించిన పూజారి ‘మొక్కు ఏమైనా ఉందా బాబూ?’ అని అడిగాడు.
‘అలాంటిదేమీ లేదండి. మా నాన్నగారు గుడికి వెళ్లి, రోజూ కొబ్బరికాయ కొట్టమనీ, హారతి ఇవ్వమనీ చెప్పారు’ అని బదులిచ్చాడు యువకుడు. ఆ తండ్రి మాటల్లోని ఆంతర్యం గ్రహించిన పూజారి యువకుడితో ‘మీ నాన్న మాటల్లో చాలా విషయం దాగుంది. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వచ్చి చేరుతాయో ఎవరికీ తెలియదు. సంపద కూడేటప్పుడు ఎలా వచ్చి చేరుతుందో తెలియదు. ఇక హారతి విషయానికి వద్దాం.. సంపద తరిగిపోవడం మొదలైతే కర్పూరంలా కరిగిపోతుందని నీకు హెచ్చరిక చేయడానికి ఈ రెండు పనులూ చేయమన్నాడు’ అని వివరించాడు పూజారి. ‘వ్యాపారం చేయడం గొప్పకాదు. దాన్ని ధర్మబద్ధంగా నిర్వహించాలి. అలాగే సంపద శాశ్వతం కాదు. డబ్బు ఎప్పుడైనా రావొచ్చు, పోవచ్చు. కలకాలం నిలిచేది ధర్మం, న్యాయం మాత్రమే’ అని చెప్పాడు. ‘హారతి రహస్యం’ తెలుసుకున్న యువకుడు తండ్రి దగ్గరికి వెళ్లి కృతజ్ఞతలు చెప్పాడు.
…? ఆర్.సి.కృష్ణస్వామి రాజు, 93936 62821