తిరుపతి : తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి (Kapileswara Swamy Temple) వారి బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివనామస్మరణ మధ్య ధ్వజారోహణ (Dhvajarohanam) ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది.
పంచమూర్తులైన సోమస్కంధమూర్తి, కామాక్షి అమ్మవారు, వినాయక స్వామి, చండికేశ్వరస్వామి, వల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామివారి ఉత్సవమూర్తుల సమక్షంలో నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు. ధ్వజారోహణంలో భాగంగా మొదట ధ్వజపటం అధిరోహణ, ఆ తరువాత ధ్వజస్తంభానికి అభిషేకం, బలి, నివేదన, దీపారాధన, ఉపచారాలు నిర్వహించారు.
ఏడాదికోసారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణం రోజున మాత్రమే ధ్వజస్తంభానికి విశేషంగా అభిషేకం చేస్తారని అర్చకులు తెలిపారు. ఆలయ ప్రధానార్చకులు మణివాసన్ గురుకుల్ (Manivasan Gurukul) మీడియాతో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 10 రోజులపాటు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయని తెలిపారు.
ఈనెల 26న శివరాత్రి (Shivaratri) పర్వదినం విశేషంగా జరుగనుందని చెప్పారు. 27న కల్యాణోత్సవం, 28న త్రిశూల స్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయని వివరించారు. అనంతరం పల్లకీ ఉత్సవం నిర్వహించారు. పల్లకీపై స్వామి, అమ్మవారు తిరుపతి పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్ర బాబు, ఏఈవో సుబ్బరాజు, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, అర్చకులు ఉదయ గురుకుల్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.