శుక యోగి రాజయోగి పరీక్షిత్తుతో… మహారాజా! నరకుడు నేల కూలడం చూసి దేవతలు, మునులు… ‘అమ్మయ్యా! ఈ దురాత్ముని మరణాన్ని కనులారా కన్నాము. ఇక మనం మన్నాము-బతికాము’ అని మింటి నుండి వెంటనే పూలవాన కురిపిస్తూ లీలా మానుష విగ్రహుని, వనమాలిని వినుతించారు. అంత, భూదేవి నరకాంతకుని చెంతకు చేరి రత్నఖచిత చాంపేయ- స్వర్ణ కుండలాలను, వైజయంతి మాలను, వరుణుని వెల్ల గొడుగును, వేల్పుల మణిపర్వతాన్ని వాసుదేవునికి సమర్పించి, అంజలి గావించి, ఆ కంజ నేత్రునికి పన్నగశాయికి భక్తితో ఇలా విన్నవించింది… ఓ పరమేశ్వరా! పద్మనాభా! పద్మనేత్రా! పద్మచరణా! పద్మమాలా విభూషితా! నందనందనా! నీకు వందన చందనాలు.. చ॥ ‘దయ నిటు సూడుమా! నరక దైత్యుని బిడ్డడు వీడు, నీ దెసన్ భయమున నున్నవాడు, గడు బాలుడనన్య శరణ్యు, డార్తు, డా శ్రయరహితుండు, దండిక్రియ శౌర్యము నేరడు, నీ పదాంబుజ ద్వయి బొడగాంచె భక్త పరతంత్ర సువీక్షణ! దీనరక్షణా!’
ధరానాథా! భక్త పరాధీనా! దీన రక్షణా! దానవ శిక్షణా! దయతో ఇటు చూడు. మార జనకా! వీడు మన కుమారుని- నరకుని తనయుడు. మన మనవడు భగదత్తుడు! నగధరా! వీడు నీకు భక్తుడు. వినయం కలవాడు. ఈ చిన్నవాడు నిన్ను చూసి భయపడుతున్నాడు. వేరు దన్ను (ఆసరా, బలం) లేనివాడు. తండ్రి వలె ధూర్తుడు కాడు. ఆర్తి పొందినవాడు. దండితనం- శక్తి (పరాక్రమం) లేనివాడు. ఈ బడుగు- అశక్తుడు నీ అడుగు దమ్ము (పాదపద్మా)లనే నమ్ముకొన్నవాడు. ఉడురాజ వదనా- చంద్రాననా! ఈ కడు దీనుని విడువక కరుణతో కాపాడు’. ఇలా (భూ)దేవి భక్తి ప్రపత్తులతో బలానుజు- కృష్ణునికి మరల తలవంచి పలుకు- మాటలనే పూలతో పూజించింది. భక్త మందారుడు గోవిందుడు అర్భకు-పిన్నవాడైన భగదత్తునికి అభయం ఇచ్చి అన్ని సంపదలూ అనుగ్రహించాడు.
అనంతరం జగదవనుడు- లోక రక్షకుడు, భువన సుందరుడు జనార్దనుడు నరకుని భవనంలోకి ప్రవేశించి ఆ పరమ కఱటి- దుర్మార్గుడు దురుము- యుద్ధాలలో నరపతులను శర (బాణ) పరంపరలతో ఓడించి చెర పట్టి తెచ్చిన పదారువేల వంద మంది వ్రతధన్యలు, మాన్య- పూజ్యలైన రాజకన్యలను చూచాడు.
మ॥ ‘కనిరా రాజకుమారికల్ పరిమళత్కౌతూహలా క్రాంతలై
దనుజాధీశచమూ విదారు నతమందారున్ శుభాకారు నూ
తన శృంగారు వికారదూరు సుగుణాధారున్ మృగీలోచనా
జన చేతోధనచోరు రత్న మకుటస్ఫారున్ మనోహారునిన్’
ఆ రాజపుత్రికలు, రాక్షస సైన్య సంహారుడు, ఆశ్రిత మందారుడు- శరణాగతులకు అమరానోకహం (కల్పవృక్షం) వంటివాడు, సుందరాకారుడు, నిత్యనూతన శోభా విలసితుడు, వికార రహితుడు, సుగుణాభిరాముడు, మానినీ (గోపీ) మానస చోరుడు, రత్న కిరీటధరుడు, మనోహరుడూ అయిన శ్రీధరుని, హరిని మిక్కిలి కుతూహలంతో దరిసించారు. అలా పరికించి ఆయన సౌందర్య, చాతుర్య, గాంభీర్యాది సుగుణాలకు ఆకర్షితలై అతడే తమకు ప్రాణేశ్వరుడని వరించారు…
కం॥ ‘విన్నారమె యీ చెలువము?
గన్నారమె యిట్టి శౌర్య గాంభీర్యంబుల్?
మన్నారమింత కాలము
గొన్నారమె యెన్న డయిన గూరిమి చిక్కన్’
శుకుడు- రాజా! ఆ భామలందరూ తమలో తాము ఇలా చెప్పుకొన్నారు… జగజెట్టి నందపట్టి- కృష్ణుని యందు ఉట్టిపడే- సందడి చేసే ఇట్టి అందాన్ని గూర్చి, ఇందువదనలారా! ఎందైనా మరెక్కడైనా విన్నామా? ఇంతటి శౌర్యాన్ని, గాంభీర్యాన్ని ఎప్పుడైనా కనుగొన్నామా? ఇంతకాలం మన్నారమే- జీవించామే కాని, ఇట్టి అనురాగాన్ని ఇందీవరాక్షు- పద్మనేత్రలారా! మరెందైనా అందుకొన్నామా? పొందామా?
సీ॥ ‘వనజాక్షి! నేగన్క వైజయంతిక నైన,
గదిసి వ్రేలుదు గదా కంఠమందు
బింబోష్ఠి! నేగన్క బీతాంబరము నైన,
మెఱసి యుండుదు గదా మేని నిండ
గన్నియ! నేగన్క గౌస్తుభమణి నైన,
నొప్పు సూపుదుగదా యురమునందు
బాలిక! నేగన్క బాంచజన్యమునైన,
మొనసి చొక్కుదు గదా మోవి గ్రోలి’
ఆ॥ ‘పద్మగంధి! నేను బర్హదామము నైన
జిత్రరుచుల నుందు శిరమునందు
ననుచు బెక్కుగతుల నాడిరి కన్యలు
గములు గట్టి గరుడగమను జూచి’
‘ఓ వనజా(కమలా)క్షీ! నేను వైజయంతీమాల నయినైట్లెతే ఆ వాసుదేవుని మెడలో ఎడ లేకుండా వేలాడే దానను గదా! ఓ బింబాధరా (దొండపండు వంటి పెదవులు గలదానా)! నేను గనక పీతాంబరం- పట్టు వస్ర్తాన్నై ఉంటే ఇప్పట్టున అతని మేనుపై చుట్టుకొని మెరిసిపోతూ ఉండేదానను గదా! ఓ బాలా! నేను కౌస్తుభమణినై ఉంటే, కాలపురుషుడైన గోపాలుని వక్షఃస్థలంపై లీలగా వెలుగుతూ ఉండేదానను గదా! ఓ కన్యామణీ! నేను పాంచజన్య శంఖాన్నై ఉంటే అతని పెదవిని తాకి- అధరామృతం గ్రోలుతూ సదా పరవశిస్తూ ఉండేదానను గదా! ఓ పద్మగంధీ! నేను నెమలి పింఛాన్నైనట్లయితే, ఆయన తలపై పలు వన్నెల వలపుల విమల కాంతులతో విలసిల్లే దానను గదా! అని పలు విధాల భావిస్తూ ఆ కన్యలు బృందాలుగా కూడి, ‘సౌజన్యమూర్తియైన అరవిందాక్షుని- గోవిందుని చూచారు. నేనే వెన్ను (కృష్ణు)ని భార్యనౌతానని ఆర్యలైన ఆ కన్నెలందరూ వలపు కలవర పెట్టగా తమలో తాము తలపోశారు’. హృద్య అనవద్యాలైన పై పద్య పారిజాతాలన్నీ అమూలకాలు. పోతన కల్పనా సంజాతాలు.
శుకముని- అవనీపతీ! ఇలా మన్నన- ఆదరణలకు ఉవ్విళ్లూరుతున్న ఆ కన్నెలందరకూ నల్లనయ్య తెల్లని చీరలను, బంగారు ఆభరణాలను, మైపూతలను పంపాడు. ఈ పదహారువేల వంద మంది ఇంతులను కంత జనకుడు శ్రీకాంతుడు పల్లకీలలో ఎక్కించి ద్వారకకు సాగనంపాడు. తర్వాత యాదవేంద్రుడు మోదంతో దేవేంద్రుని పట్టణం అమరావతికి వెళ్లి, నరకుడు అపహరించిన, తమ ఘృణు- కాంతులతో సూర్యమండలాన్ని తిరస్కరిస్తున్న మణికుండలాలను దేవమాత అదితికి సమర్పించాడు. సత్యభామతో కూడి శచీ సమేతుడైన నముచి (రాక్షస) సూదనుని- దేవేంద్రుని వరివస్యలు- పూజలు అందుకున్నాడు హరి. తరువాత, చంద్రానన సత్యభామ కోరికపై శౌరి నందన వనంలో ప్రవేశించి…
మ॥ ‘హరికేలం బెకలించి తెచ్చి భుజగేంద్రా రాతిపై బెట్టె సుం
దర గంధానుగత భ్రమద్భ్రమర నాదవ్రాతముం బల్లవాం
కుర శాఖాఫల వర్ణపుష్ప కలికా గుచ్ఛాదికోపేతమున్
గిరిభిత్త్రాతము బారిజాతము ద్రిలోకీ యాచకాఖ్యాతమున్
కమ్మని నెత్తావుల కోసం కమ్ముకుంటున్న మత్తిల్లిన తుమ్మెదల ఝంకారాలతో నిండినదీ, పల్లవా (చిగురుటాకు)లతో, పూగుత్తులతో, ఫలాలతో కూడినదీ, ముల్లోకాల్లోని అర్థుల- యాచకుల కోరికలు ఈడేర్చడంలో ఖ్యాతి గాంచినదీ, జంభారి- ఇంద్రునిచే రక్షించబడే పారిజాత వృక్షాన్ని కంసారి తన చేతితో పెకిలించి, ఉరగారి- గరుడునిపై ఒరుపు- విలాసంగా పెట్టాడు. సాత్రాజితి- సత్యతోపాటు వైనతేయుని పై ఎక్కి ప్రయాణమైనాడు. అంత, త్రిలోకాధిపతిననే గర్వంతో మఘవ (ఇంద్రుడు)- ఓ ఖగరాజతురంగా (గరుడ గమనా)! దొంగతనంగా పారిజాతాన్ని అపహరించి వెళ్లవద్దంటూ దైవ సైన్యంతో విహగ వాహనుని- కృష్ణుని ఎదిరించాడు.
శుకుడు- రాజా! ఇంద్రాదుల పదవీ భోగాలన్నీ భగవదనుగ్రహ ఫలాలే గదా! అదీగాక, మేదినీసుతుడు- భూపుత్రుడు నరకుడు పెట్టే వెత (బాధ)లను భరించలేక తాను (అమరేంద్రుడు) యాదవేంద్రునికి సాష్టాంగపడి శరణువేడగా, కరుణించి హరి నరకుని సంహరించి దేవతలను రక్షించిన సంగతి సురపతి మరచిపోయాడు. ‘ఎఱుక వలదె? నిజ్జరేంద్రత కాల్పనే? సురల తామసమున జూడ నరిది’- ‘ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేని ఇంద్రపదవి ఎందుకు? తగలెయ్యనా? అమరుల అహంకారం అత్యాశ్చర్యంగా ఉంది’. తనను ఎదిరించిన అమరేంద్రాదులను ఓడించి, ఆశ్రిత పారిజాతమైన దైత్యారి శౌరి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చి సత్యభామాదేవి ఉద్యానవనంలో నాటించాడు. నరకుని బారి నుండి తప్పించి తెచ్చిన వరరాజ కన్యలందరకూ మురహరుడు గృహోపకరణాలతో పాటు వేరువేరు మందిరాలను ఏర్పరచాడు. కంత జనకుడు, అనంతుడు మహానుభావుడు శ్రీకృష్ణుడు ఒకే శుభ ముహూర్తాన, ఈ పదారువేల భవంతులలో ఉన్న పదారువేల మంది ఇంతులను- క్షత్రియ కాంతలను పదారువేల రూపాలతో, పదారు వేల రీతులతో తన దివ్య విభూతులతో శోభిస్తూ విధివిధానంగా వివాహమాడాడు. చక్రధారి ఎక్కువ తక్కువలు లేకుండా ఈ చక్కనమ్మల, చక్కెర బొమ్మలకందరకూ అన్ని విధాల కనిపిస్తూ మక్కువ మీర చక్కని గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆప్త- పూర్ణకాముడై ఆనందించాడు.