భక్తకవి పోతన సంస్కృత భాగవతాన్ని తెనిగించడం తెలుగు ప్రజల బహుజన్మల తపః ఫలం! సూర్యవంశంలో అవతరించిన ఉత్తమ శ్లోకుడు- పవిత్ర కీర్తిమంతుడు, ఆర్య లక్షణ శీలవ్రతుడు- మహాపురుష లక్షణ శీలములే వ్రతాలుగా గలవాడు, ధర్మవీర్యుడు- ధర్మమనే మహాశక్తియుతుడు, రాజ సత్తముడు (శ్రేష్ఠుడు), తనకు పరమ ఆరాధ్యుడు అయిన శ్రీరామచంద్రుని పవిత్ర చరిత్రను నవమ స్కంధంలో, డెందమును ఆనంద డోలికలలో ఓలలాడించు అందమైన అనుప్రాసలతో, వీనుల విందైన అంత్యప్రాసలతో అలంకరించి, తన సహజ కవితాశక్తిని రామభక్తితో రంగరించి అంగరంగ వైభవంగా అభివ్యక్తీకరించి రక్తి కట్టించాడు పుంభావ సరస్వతి పోతన!
శుకుడు పరీక్షిత్తుతో.. రాజా! ఎట్టకేలకు దగ్గరి చుట్టరికాన్ని కూడా కలుపుతూ స్వారస్యం ఉట్టిపడే లాగున అట్టహాసంగా సాగరుడు ఇలా ఉటంకించాడు-
ఆ॥ ‘హరికి మామ నగుదు, నట మీఁద శ్రీదేవి
తండ్రి, నూరకేల? తాగడింపఁ
గట్టఁగట్టి దాఁటు కమలాప్త కులనాథ
నీ యశోలతలకు నెలవుగాఁగ’
‘ఓ సూర్యకులాబ్ధి సోమా! నేను శ్రీహరి మామను. ఆపై భామామణి శ్రీదేవికి తండ్రిని. ఊరక నన్ను బాధించడం దేనికమ్మా! కల్యాణరామా! నీ కీర్తి లతలకు కాణాచి (ఉనికిపట్టు)గా నాపై సేతువు కట్టి నన్ను దాటు.’ కరుణాసాగరుడు రాముడు వరుణాలయు (సాగరు)ని కరుణించి వెనుకటి వలె విరాజిల్లుమని వీడుకొల్పాడు. పై ఆటవెలది అమూలకం. అమాత్యుని సృష్టి. వానర శ్రేష్ఠులు పర్వత శిఖరాలను పాదపాల (చెట్ల)తో సహా పెకలించి తెచ్చి వారిధిపై వారధి కట్టారు. సాగర తరణం చేసిన రాఘవుడు, రావణ సోదరుడు విభీషణుడు తన చరణారవిందాలను శరణు వేడగా కరుణతో అతనికి అభయమిచ్చి అక్కున చేర్చుకొన్నాడు. విభీషణుడు తోడురాగా తనకు సరిజోడు లేని మొనగాడు రాముడు పోడిమితో- సుఖంగా లంకానగరంపై దాడి చేశాడు. కరులు (ఏనుగులు) కమనీయమైన కొలనులో దిగి దానిని కలచివేసినట్లు వానరులు నిశ్శంకగా లంకలోనికి ప్రవేశించి వావిరి (క్రమం)గా దానిని నానా బీభత్సం గావించారు.
పిమ్మట రావణుడు పంపగా కుంభ నికుంభులు, సురాంతక నరాంతక, దుర్ముఖ ధూమ్రాక్ష, మహాకాయాది అసుర వీరులు సమరానికి వచ్చి సుగ్రీవ, ఆంజనేయ, అంగద, జాంబవంతాది మహావీరుల తోటి ద్వంద్వ యుద్ధంలో అమరులైపోయారు. యతివంటి సుమిత్రా సుతుడు అమరులకు కూడా అజేయుడు, మాయోపాయుడైన అతికాయునికి ఆహవం- యుద్ధంలో సుగతి కలిగించాడు. భండన భీముడు రాముడు నీలమేఘ వర్ణుడు, భుజబల పూర్ణుడు ఐన కుంభకర్ణుని ఖండించాడు. ఇంద్రియజిత్తు సౌమిత్రి- లక్ష్మణుడు.. ఇంద్రజిత్తుని- ఇంద్రుని జయించిన మేఘనాథుని అమోఘ కౌశలంతో అంతమొందించాడు. సనాతన ధర్మంలో ఇంద్ర విజయం కన్నా ఇంద్రియ విజయం మిన్న.
శుక ఉవాచ… రాజా! తన వారంతా కదనరంగంలో యమసదనానికి చేరిన కతన (కారణాన) అమరారి పుష్పక విమానమెక్కి సమరానికి వచ్చి రౌద్రావేశంతో రామభద్రునితో తలపడ్డాడు. దేవేంద్రుడు పంపగా మాతలి తెచ్చిన దివ్యరథాన్ని అధిరోహించి రాముడు రావణునితో ఇలా అన్నాడు..
మ॥ ‘చపలత్వంబున డాఁగి హేమ మృగమున్ సంప్రీతిఁబుత్తెంచుటో
కపట బ్రాహ్మణ మూర్తివై యబల నా కాంతార మధ్యంబునం
దపలాపించుటయో మదీయ శిత దివ్యామోఘ బాణాగ్ని సం
తపనం బేగతి నోర్చు వాడవు? దురంతం బెంతయున్ రావణా!’
‘అమర విరోధీ! నాతో సమరం సాగించడం అంటే నీచంగా మాటున దాగి మాయా మృగాన్ని (బంగారు లేడిని) పంపించడం, కపట బ్రాహ్మణుడివై కాంతార మధ్యం- కారడవిలో అటమటమున (మోసంతో) ఒక అబలను- నా కాంతను అపహరించి ఆక్రందింప చేయడం అనుకున్నావా? వాడిగల మొక్కవోని నా దివ్య బాణానల (అగ్ని) వేడిని- ఉక్కపోతను ఎంతో దురంతమైన ఈ వంత (బాధ)ను ఓ అరిహంతా (శత్రు సంహారకా)! నీవెంతని ఓర్చుకోగలవు?
కం॥ ‘నీ చేసిన పాపములకు
నీచాత్మక! యముడు వలదు నేఁడిట నా నా
రాచముల ద్రుంచి వైచెద
ఖేచర భూ చరులుఁ గూడి క్రీడన్ జూడన్’
‘ఓరీ నీచుడా! నీవు చేసిన పాపాలకు పరేతరాట్టు- యమునితో పనిలేదు. ఖేచరులు- ఆకాశ సంచారులు, భూ చరులు కలిసి వినోదంగా వీక్షిస్తుండగా నేడు ఇక్కడే నిన్ను నా నారాచా (బాణా)లతో నరికి పారేస్తా’ అంటూ ఇన (సూర్య)కుల పావనుడు రాముడు, కఠిన భాషా శ్రవణుడు- పరుష పదజాలం కలవాడూ, అనిమిష బల విద్రావణుడూ- దేవతల సైన్యాన్ని పారదోలేవాడూ, వైరిదార గర్భ స్రావణుడూ- శత్రు భార్యలకు గర్భస్రావం కలిగించేవాడూ ఐన రావణునిపై ప్రళయాగ్ని సమానమైన భయంకర సాయకాన్ని- బాణాన్ని సంధించాడు.
కం॥ దశరథ సూనుండేసిన
విశిఖము హృదయంబుఁ దూర వివశుండగుచున్
దశకంధరుడు గూలెను
దశవదనంబులను రక్తధారలు దొరఁగన్’
దాశరథి వేసిన బాణము హృది- హృదయంలో దూసుకుపోగా దశకంఠుడు రావణుడు తూలిపోతూ పది ముఖాల నుంచి రుధిర (రక్త) ధారలు కారుతుండగా పృథివిపై కూలిపోయాడు. విశ్వేశ్వరుని శిరస్సుపై విరాజిల్లుతూ, విర్రవీగుతూ ఉండే దశకంఠుని పది పెద్దపెద్ద తలలు ఇప్పొద్దున గద్దల కాళ్లచే దొర్లించబడుతున్నాయి కదా! శివ శివా! జీవుల పురాకృత కర్మఫలం ఎంత విషమంగా ఉంటుందో విశదీకరించలేము కదా! అమరాంతకుని మరణవార్త విని అంతఃపురంలోని కాంతలు ఆర్తనాదాలు చేస్తూ భూత బేతాళాదులకు సదన (నిలయ)మైన కదనరంగానికి వచ్చి రోదించారు. వారిలో పట్టమహిషి మండోదరి రావణుని చూచి…
ఉ॥ ‘హా దనుజేంద్ర! హా సురగణాంతక! హా హృదయేశ! నిర్జరేం
ద్రాదుల గెల్చి నీవు కుసుమాస్ర్తుని కోలల కోర్వలేక సో
న్మాదమునన్ రఘుప్రవరు మానిని నేటికిఁ దెచ్చితప్పుడేఁ
గాదని చెప్పినన్ వినక కాలవశంబున బొందితక్కటా!’
‘అయ్యో అసురేంద్రా! హృదయేశ్వరా! అమరుల పాలిటి అంతకుడువు నీవు. గీర్వాణ (దేవతా) వరులను గెల్చిన నీవు మరుని (మన్మథుని) కోలలకు- పూల బాణాలకు ఓర్వలేకపోయావు కదా! పరాంగనా (పర స్త్రీ) విముఖ సువ్రత కాముని, రాముని వరాంగనను- అర్ధాంగిని ఏల వ్యర్థంగా అపహరించి తెచ్చావు? నేను వలదని వారించినా వినక ఇప్పుడు ఇలా కాలగతికి చిక్కావు కదా!’
కం॥ ‘దురితముఁ దలఁపరు గానరు
జరుగుదు రెటకైన నిమిష సౌఖ్యంబులకై
పరవనితా సక్తులకును
బరధన రక్తులకు నిహముఁ బరముం గలదే?’
‘ఇతరుల వనితలను, ధనాదులను కోరు దుర్మతులు, క్షణకాల సుఖ నిరతులు దేనికైనా తెగిస్తారు. వారు దానిని దురిత (పాప)మని తలంచరు. మంచి చెడ్డలను ఇంచుకైనా మదినెంచరు. అట్టివారికి ఇహపరాలు ఉంటాయా?’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించింది.
రామచంద్రుని అనుజ్ఞతో విభీషణుడు అన్నగారి ఉత్తర క్రియలు జరిపాడు. అనంతరం, చిరంతనుడు- భక్తుల హృదంతరంలో నిరంతరం నివసించువాడు, విశోకుడు, శోకనాశనుడు ఐన జానకీజాని- రాఘవేంద్రుడు అశోకవనానికి వెళ్లి శింశుపా వృక్షమూలంలో…
శా॥ ‘దైతేయ ప్రమదా పరీత నతి భీతన్ గ్రంధి బంధాలక
వ్రాతన్ నిశ్వసనా నిలాశ్రుకణ జీవం జీవదారామ భూ
జాతన్ శుష్క కపోల కీలిత కరాబ్జాతన్ బ్రభూతన్ గృశీ
భూతం బ్రాణసమేత సీతఁ గనియెన్ భూమీశుఁడా ముందటన్’
రాక్షస వనితలచే పరీత- చుట్ట బడినదీ, అత్యంత భీత- మిక్కిలి భయపడినదీ, ముడులుగా పెనగొన్న ముంగురుల, వ్రాత- సమూహం కలదీ, తన నిట్టూర్పులనే గాలుల చేత, కన్నీటి ధారల చేత బతుకుతున్న ‘ఆరామ భూజాతన్’- ఉద్యానవనంలోని వృక్షాలు కలదీ, శుష్కించిన చెక్కిలిపై చేర్చబడిన ‘కరాబ్జాతన్’- హస్తమనే పద్మం కలిగినదీ, ‘కృశీ భూతన్’- మిక్కిలి కృశించినదీ, ‘ప్రాణ సమేతన్’- ఎలాగో ప్రాణాలు ఉగ్గబెట్టుకొన్న ‘భూ జాతన్’- భూమి సుత సీతను చూచి వెత చెందాడు. సతి సీత దోష రహిత అన్న సంగతి అగ్ని ముఖంగా (పూత- పవిత్రగా) ప్రకటింపజేసి, దేవతల అనుమతి మేరకు శ్రీమతిని స్వీకరించాడు.
ఉ॥ ‘శోషిత దానవుండు నృపసోముడు రాముడు రాక్షసేంద్రతా
శేష విభూతిఁ గల్ప సమజీవిని గమ్మని నిల్పెనర్ధి సం
తోషణుఁ బాపశోషణు నదూషణు శశ్వదరోషణున్ మితా
భాషణు నార్యపోషణుఁ గృపాగుణ భూషణు న వ్విభీషణున్’
రక్కసులను ఉక్కడగించిన వాడు, రాజులలో చుక్కలరేడు- రామచంద్రుడు, అర్థులను (యాచకులను) సంతోషణుడు- ఆనందింపజేయువాడు, పాపశోషణుడు- నిష్పాపుడు, అదూషణుడు- దోషహీనుడు, శశ్వదరోషణుడు- ఎన్నడూ రోషం (కోపం) లేనివాడు, మిత భాషణుడు, ఆర్య పోషణుడు- పెద్దలను సంతృప్తిపరచేవాడు, కృపాగుణ భూషణుడు- దయాగుణం ఆభరణంగా కలవాడూ అయిన విభీషణుని అసుర సామ్రాజ్యానికి అధిపతిని చేసి కల్పాంతం వరకు జీవించమని దీవించి, సింహాసనం అధిష్ఠింపజేశాడు శ్రీరామచంద్రుడు.
(సశేషం)