నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః
మూఢోయం నాభిజానాతి లోకో మామజమవ్యయమ్!
(భగవద్గీత 7-25)
కృష్ణుడు అర్జునునితో ‘నేను నా యోగమాయతో కప్పి ఉండటం వల్ల అందరికీ గోచరింపను లేదా అందరూ నన్ను దర్శించలేరు. అజ్ఞానులు తమవలెనే నాకూ జననమరణాలు ఉంటాయని భ్రమ చెందుతున్నారే కానీ, నన్ను శాశ్వతునిగా, జన్మరహితునిగా, పరమేశ్వరునిగా తెలుసుకోలేకపోతున్నారు’ అన్నాడు.
యోగమాయ అంటే ఏమిటి? అజుడు, అవ్యయుడు అయిన భగవంతుడు అవసరార్థం అవతరించడం, ప్రయోజనం సిద్ధించాక అవతార సమాప్తి జరగడం సాధారణంగా జరుగుతుంది. ఈ ప్రక్రియలో భగవంతుడూ సాధారణ మానవుల్లాగానే పుట్టడం, గిట్టడం కనిపించినా తత్వం తెలియని వారు అవతరించడం జననంగా, అవతార సమాప్తిని మరణంగా భ్రమిస్తారు.
భగవంతుడు యోగశక్తిని విశ్వమంతటా వ్యాపింపచేసి అనేక రూపాలలో ప్రపంచంలో వెలుగుతూ ఉండటం వల్ల ఆ యోగశక్తిలో దాగిన భగవంతుని సత్య స్వరూపాన్ని గుర్తించడం సామాన్యులకు అలవికాదు. ఆ యోగశక్తినే యోగమాయగా చెబుతారు. యోగమాయతో కప్పి ఉన్న కారణంగా దార్శనికత లేని సామాన్యులు అంతర్యామిని దర్శించలేరు. అయితే ఎవరైతే సర్వ సమర్పణా భావనతో, సంపూర్ణమైన శ్రద్ధాసక్తులతో, తెలుసుకోవాలనే జిజ్ఞాసతో భగవంతుడిని అన్వేషిస్తారో వారు మాత్రమే భగవంతుడిని సాక్షాత్కరింప చేసుకోగలరు.
అయితే.. ఇక్కడ ఒక సందేహం.. జీవుడు మాయచే కప్పి ఉండటం సహజమే కాని భగవంతుడు కూడా అలా ఉండటం ఎలా జరుగుతుంది? సూర్యుడిని మేఘాలు కప్పివేశాయి అంటాం. నిజంగా సూర్యుడిని మేఘాలు కప్పివేయవు కదా! సూర్యుడికి మానవుల దృష్టికి మధ్య మేఘాలు నిలిచాయి. అలాగని కప్పలేదా అంటే కప్పినట్లు మనం చూస్తున్నాం. అంటే.. కప్పడం అనేది వ్యావహారిక సత్యం కాగా కప్పబడకపోవడం పారమార్థిక సత్యం. నిజానికి మాయ భగవంతుడిని కప్పివేయ గలిగితే.. అనంతుడైన భగవంతుని కన్నా మాయే గొప్పది అవుతుంది. అది అసత్యం కదా!
ఇక్కడ భగవంతుడు ‘నేను’ అంటున్నాడు. నేను అంటే… ఇది రెండక్షరాల పదం.. ‘నే’ అనేది నేనును అనగా వ్యష్టిని, ‘ను’ అనేది నువ్వు అనగా సమష్టిని తెలుపుతుంది. అనగా భగవంతుడు లేదా ‘నేను’ అనేది అన్నిటియందు అంతర్యామిగా ఉంటుంది. సకల జీవరాశి వ్యష్టిగా భగవంతుడనే సమష్టిలో జననమై, పెరిగి, అందులోనే లీనమై ఉంటాయి. కృష్ణుడు ఇక్కడ చెప్పిన ‘నేను’ సమష్టికి ప్రతీక. మానవులు బుద్ధిచే విచారించి ఆ ‘నేను’లో జీవితాన్ని స్థిరపరుచుకోవాలని భగవద్గీత ఉపదేశం.
అంతర్యామి శక్తిరూపంలో ఉంటుంది కాబట్టి ఆకారం, పేర్లు, గుణాలు దానికి ఉండవు. ఎప్పుడైతే వీటిని తీసుకుంటుందో అది అంతర్యామిగా ప్రకాశింపదు.. ప్రకటితం కాదు.. ఆకృతిగానే ప్రకటితమవుతుంది. నామరూపాకృతులను పొందినా, అంతర్యామి తన తత్వాన్ని గుర్తించగలడే కాని సాధారణ జనాలకది సాధ్యపడదు. తెలుసుకోవడం జ్ఞానం కాగా తెలుసుకోలేక పోవడం అజ్ఞానం. భగవంతుడి తత్వాన్ని తెలుసుకోలేని వారికి ప్రతి జీవిలోనూ ఉన్న అంతర్యామిని తెలుసుకోవడం సాధ్యపడదు. దట్టమైన గోడకు ఆవలివైపున ఉన్న దానిని దర్శించడం సాధారణ జనాలకు ఎలాగైతే అసాధ్యమో అలాగే జీవుల హృదయాలలో అంతర్యామిగా వెలుగొందే భగవంతుడిని తెలుసుకోవడం కూడా అసాధ్యమే. అయితే ఎవరైతే శ్రద్ధతో, ఆసక్తితో తెలుసుకోవాలనే తపనతో ప్రయత్నిస్తారో వారు సాధనలో ఆవలివైపు దర్శించే అవకాశం ఉన్నది.
బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్కుడు ‘అంతర్యామిని‘ గురించి చెబుతూ.. ఎవడైతే భూమిపైనా, భూమిలోపల ఉంటాడో.. తనలో ఉన్నా భూమి ఎవరినైతే తెలియదో.. ఎవరి శరీరమే భూమియో, భూమిలో ఉంటూనే భూమిని ఎవరైతే నియంత్రించగలడో అతనే అంతర్యామి అంటాడు. అతనే పంచభూతాలలోనూ ముల్లోకాలలోనూ అన్ని దిక్కులలోనూ ఉన్నాడు.. కాకపోతే అవేవీ అతనిని గుర్తించలేవు.. ఆ అంతర్యామియే ఆత్మ, అంటాడు.
ఒక సంస్థలో నాయకుడూ అన్ని విభాగాలలోనూ తను ఉంటాడు, అన్ని విభాగాలను నియంత్రిస్తాడు కాని ఎక్కడా తానుగా కనిపించడు. అన్ని కార్యాలు అతని నియంత్రణలో జరిగినా దాని ప్రభావాన్ని గుర్తించని క్రిందిస్థాయి వారు అతనూ తమలాగే ఏదో బాధ్యతను నిర్వహిస్తున్నాడని భావిస్తారు. ఎవరైతే సంస్థ స్వరూప స్వభావాలను కార్య నిర్వహణా విధాలను క్షుణ్నంగా తెలుసుకుంటారో.. వారికి నాయకుని విలువ
తెలుస్తుంది.
-పాలకుర్తి రామమూర్తి