Spirit | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘స్పిరిట్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు హేమంత్ మధుకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో హీరోయిన్ పాత్రల గురించి మాట్లాడిన హేమంత్ మధుకర్.. ఆయన సినిమాల్లో కనిపించే రొమాంటిక్ సన్నివేశాలను చూసి హీరోయిన్లకు కేవలం గ్లామర్ పాత్రలే ఉంటాయని అనుకోవడం తప్పని అన్నారు. సందీప్ తన కథల్లో మహిళా పాత్రలను చాలా బలంగా, భావోద్వేగాలకు దగ్గరగా రాస్తారని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ‘అర్జున్ రెడ్డి’లో శాలినీ పాండే పోషించిన ప్రీతి పాత్రను, అలాగే ‘యానిమల్’లో రష్మిక మందన్న చేసిన గీతాంజలి పాత్రను ఉదాహరణగా చెప్పారు. ఆ పాత్రలు కేవలం హీరోకు జోడీగా మాత్రమే కాకుండా కథలో కీలకమైన భావోద్వేగ బలాన్ని ఇచ్చాయని అన్నారు. త్రిప్తి దిమ్రి ఎంపికపై కూడా హేమంత్ స్పందించారు. నటీనటుల మధ్య పోలికలు పెట్టడం సరికాదని, ప్రతి పాత్రకు తగిన నటుడిని లేదా నటిని దర్శకుడు ఎంపిక చేస్తాడని చెప్పారు. ‘స్పిరిట్’లోని పాత్రకు త్రిప్తి దిమ్రి పూర్తిగా సూట్ అవుతుందని భావించి సందీప్ ఆమెను ఎంపిక చేశారని వెల్లడించారు.
అంతేకాదు, ఈ సినిమాలో త్రిప్తి నటన ప్రేక్షకుల అంచనాలను మించేలా ఉంటుందని హేమంత్ మధుకర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే ‘యానిమల్’ సినిమాతో త్రిప్తి దిమ్రికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ప్రభాస్ సరసన ‘స్పిరిట్’లో నటించడం ఆమె కెరీర్లో మరో కీలక మలుపుగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ‘స్పిరిట్’ సినిమా విషయానికి వస్తే.. ఇది పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సందీప్ రెడ్డి వంగా స్టైల్లో యాక్షన్, ఎమోషన్, ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమా రూపొందనుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.