యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చమయి పశ్యతి
తస్యాహం న ప్రణశ్యామి స చమే న ప్రణశ్యతి॥
‘ఎవరైతే, సకల ప్రాణుల్లోనూ ఆత్మరూపంలో ఉన్న నన్ను దర్శిస్తారో.. అలాగే, ప్రాణులన్నిటినీ నాలో అంతర్గతాలుగా ఉన్నట్టుగా చూస్తారో.. అలాంటి వారికి నేను అదృశ్యుడను కాను. వారు కూడా నాకు అదృశ్యులు కారు’ అంటున్నాడు గీతాచార్యుడు. భగవంతుడి అనంతత్వాన్ని, ఏకత్వాన్ని, విశ్వమయతను తెలియచేస్తుందీ శ్లోకం. భగవంతుడిని కేవలం ఒక నిర్దిష్ట ప్రదేశంలో వెదకడం కాకుండా, ప్రతి జీవిలోనూ, ప్రతి వస్తువులోనూ, ప్రతి సంఘటనలోనూ చూడగలగడం గొప్ప విశేషం. విశ్వంలోని ప్రతిదీ భగవంతుడిలో అంతర్భాగమని, భగవంతుడి నుంచి వేరుగా ఏదీ లేదని గ్రహిస్తే.. భగవంతుడి నుంచి దూరం అవ్వం. మన నుంచి భగవంతుడూ దూరం కాడు. భగవంతుడి తత్వాన్ని అవగాహన చేసుకున్న వారికి సకల చరాచర సృష్టియందు ఒకే అనుభూతి ఉంటుంది. అలాంటివారికి సమదర్శన అలవడుతుంది. వ్యవహారంలో అందరినీ సమంగా చూడాలి, అందరిపట్ల సమంగా ప్రవర్తించాలి అనేది ప్రసిద్ధం. అయితే, భగవంతుడికైనా సమదర్శనమే కాని, సమవర్తన సాధ్యపడదు.
భగవంతుడి మార్గంలో చరించే సాధకుడు.. అందరిలోనూ సుప్రతిష్ఠితుడై ఉన్న దైవమందు ఏకత్వాన్ని సాధించి, యోగి అయ్యి నిరామయుడై జీవిస్తాడు. ‘వెలుగు’ లేదా ‘యెఱుక’గా దర్శిస్తూ.. జీవించడం వల్ల ఆత్మజ్యోతిని వెలిగించుకొని, దానిని వ్యాపింపజేస్తూ ఉంటాడు. ప్రతివ్యక్తికీ భౌతిక శరీరం ఉంటుంది. అందులో నేను అనే ఆత్మ ఉంటుంది. శరీర అవసరాలు వేరు. ఆత్మ అవసరాలు వేరు. శరీరానికి ఆకలి తీరడానికి ఆహారం కావాలి. కాని, ఆత్మకు నాణ్యమైన ఆహారం కావాలి. అదీ గౌరవప్రదంగా ఉండాలి. అలాగే ప్రతివ్యక్తీ సంపదను కోరుకుంటాడు. రక్షణను, అధికారాన్నీ ఆశిస్తాడు. విద్యను, గౌరవాన్నీ అభిలషిస్తాడు. మొదటిది స్థూల శరీరానికి, రెండోది కారణ శరీరానికి, మూడోది సూక్ష్మ శరీరానికి ప్రతీకలుగా నిలుస్తాయి. మూడిటినీ సమన్వయం చేసుకున్న వ్యక్తి సమగ్రతను సాధించినట్లుగా భావించాలి. అభ్యుదయాన్ని సాధించాలనే ఆశయం.. ఆశగా మారి ప్రకృతిని వశం చేసుకున్నా ఆకలి తీరని స్థితికి ఎదుగుతుంది. భూమండలం అంతా కైవసమైనా అధికార దాహం చల్లారదు. మూలాన్ని అవగాహన చేసుకోవాలనే తపన అహంకారాన్ని ఆశ్రయించి భగవంతుడిని శాసించాలనే భావనకు బీజం వేస్తుంది. వీటన్నిటినీ అధిగమించడం స్థూల సూక్ష్మకారణ శరీరాలకు అతీతమైన స్థితిగా చెబుతారు. అనుకోకుండగా ఊహించనంత సంపదను పోగుచేసుకుంటే, అహంకారం కనులు గప్పి.. లక్ష్యం మసకబారిపోతుంది.
ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ ఆగాలో తెలియదు. సంపదలేక, విద్యలేనివాడికి లక్ష్యం, గమ్యం ఉండదు. విద్య మాత్రమే కలిగి సంపదలేనివారు పరిమితమైన లక్ష్యాన్ని మాత్రమే చూడగలుగుతారు. విద్య, సంపద కలిగిన వారి చూపు దర్శనంగా పరివర్తన చెంది అసాధ్యమైన లక్ష్యాలను, అపరిమిత దూరంలో కూడా దర్శింపజేస్తుంది. ఎవరైతే భౌతిక భ్రాంతిని అధిగమిస్తారో.. వారికి ప్రాకృతికమైన చూపు లయమై దర్శనం కలుగుతుంది. దృష్టి అనేది భౌతికమైనది. అది సంపదను మాత్రమే చూడగలుగుతుంది. దివ్యదృష్టి అంతరంగానికి సంబంధించినది. అది అధికారాన్ని, రక్షణను చూడగలుగుతుంది. దర్శనం.. ఆత్మపరమైనది. అది ఆత్మను దర్శింపజేస్తుంది. అత్యంత శక్తిమంతమైనది. అనంతమైన ఆనందాన్ని అనుగ్రహిస్తుంది. అష్ట సిద్ధులను సాధించడం దార్శనికత వల్ల సాధ్యపడుతుంది. సాధనలో కుండలినీ శక్తి విశుద్ధచక్రంలో ప్రవేశిస్తే ఈశిత్వసిద్ధి లభిస్తుంది. సకల చరాచర ప్రపంచంలో భగవంతుడిని, తనలో సకల ప్రకృతినీ దర్శించడం సాధ్యమవుతుంది. అప్పుడు ఆ సాధకుడు.. తనకు, భగవంతుడికి భిన్నమైన అస్తిత్వం లేదనే సత్యాన్ని గుర్తించగలుగుతాడు. నిజానికి భగవంతుడికన్నా భిన్నమైనది ఉంటే, భగవంతుడి సంపూర్ణత్వం ప్రశ్నార్థకమవుతుంది. ఏకత్వ భావనాగతమైన దర్శనం మనందరికీ కలగాలని ప్రార్థిస్తూ..