ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః!
‘చరాచర ప్రకృతిలోని సకల జీవులను తనతో సమంగా భావిస్తూ, తనలో దర్శిస్తూ, ఇతరుల కష్టసుఖాలకు సహృదయంతో స్పందించేవారిని, పరమ యోగులుగా పరిగణిస్తాను’ అంటాడు కృష్టపరమాత్మ. వ్యక్తి ఎలాగైతే శరీరంలోని అవయవాలను తనవిగా భావిస్తూ అన్నిటినీ సమానంగా ఆదరిస్తాడో, అలాగే తన అంశ అయిన అన్ని జీవరాసులనూ పరమాత్మ సమంగానే చూస్తాడు. పరమాత్మలాగే పరమయోగులూ ప్రపంచంలోని ప్రతి జీవినీ సమదృష్టితో దర్శిస్తారు. జీవకోటీ శ్రేయస్కరమైన మార్గంలో తరించాలనీ తపిస్తారు.
‘సమం పశ్యతి‘ అంటే సమదర్శనం. సృష్టిలో ఒకే విధంగా జనించని అందరినీ సమంగా దర్శించడం సాధ్యమా? ఒక్కొక్కరి బలాలు, బలహీనతలు వేరువేరుగా ఉంటాయి. అలాంటప్పుడు అం దరినీ సమదృష్టితో ఆదరించాలి అనడం వినడానికి బాగుంటుందేమో కాని ఆచరణలో సాధ్యమా? నిజానికది చూసేవారి దృష్టికోణమే కాని, చూడబడేవారికి సంబంధించినది కాదు! కాబట్టి అసాధ్యం కాదు.. సాధన చేస్తే సమదృష్టి అలవడడం జరుగుతుంది.
వ్యక్తిలో భౌతిక ఆధ్యాత్మిక పార్శ్వాలలో జాత్యంతరీకరణ జరగాలి. జాతి అంటే స్థాయి. నిజానికి వ్యక్తుల సాధనలో వారి స్థాయిని బట్టి వారి దృష్టి పరిణతి చెందుతుంది. భౌతిక దృష్టికోణంతో పరిశీలిస్తే.. ‘నేను నాది, నీవు నీది‘ అనే భేదభావం కలుగుతుంది. స్థాయి కొంత ఉన్నతమైతే ఎదుటివారిని భౌతికంగా కాకుండా ఆత్మగా భావిస్తాం. భేదమనేది భౌతికమే కాని ఆత్మపరంగా లేదనే సత్యం అవగతమైతే జాతి మత స్థాయి భేదాలకు ప్రాధాన్యం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూస్తాం.
స్థాయిని మరింత పెంచుకున్న సాధకులు అందరిలోనూ పరమాత్మను దర్శించగలుగుతారు. అయితే వారు కూడా భౌతిక జగత్తును పట్టించుకుంటారు.. కాకపోతే ఫలితాలపై ఉదాసీన వైఖరితో కర్మలను ఆచరిస్తారు. సమాజంలో మంచిని మాత్రమే స్వీకరించి చెడును వదిలేస్తారు. పరమయోగులు అత్యున్నత స్థాయికి చెందినవారు. వారంతటా భగవంతుడిని దర్శిస్తుంటారు. ఏ స్థాయి వ్యక్తులకైనా కర్మాచరణ తప్పనిసరి. అయితే స్వీయ క్రమశిక్షణ, ధ్యానాది కర్మల ద్వారా అంతర్గత శాంతిని సాధిస్తూ.. ప్రక్రియ ఆధారంగా పనిచేసే వ్యక్తి పనిని ఆస్వాదిస్తూ, పనిని ఉపాసనా మార్గంగా మలుచుకుంటాడు. అతనిలో జరిగే జాత్యంతరీకరణ వ్యక్తిని ఉన్నతీకరిస్తుంది. ఫలితం ఆశించిన వ్యక్తి ఫలితానికి బంధీ అవుతాడు.
పరమయోగిని నాయకుడిగా చెప్పుకొంటే, నాయకుడు సహచరులందరినీ సమదృష్టితో చూడాలి. అందరూ ఉన్నతమైన జీవితాన్ని అందుకోవాలని భావించాలి. ‘సమం పశ్యతి‘ అనే మాటకు అర్థమిదే. నేటి సమాజం స్వార్థమే పరమావధిగా అభివృద్ధి చెందుతున్నది. ప్రజల అవసరాలు, అంచనాలు మారుతున్నాయి. భౌతిక ప్రగతికే పట్టంగడుతూ ఫలితాపేక్షకు బంధీలైన నాయకులు పరిణతి సాధించలేరు. ప్రజల శ్రేయసు లక్ష్యంగా పనిచేసే నాయకుడిని పరమయోగిగానే పరిగణించాలి. నాయకుడి దక్షతకది పరీక్షే! ఎన్నో సవాళ్లు పలకరిస్తున్న సమయంలో తీసుకునే నిర్ణయాలలో సమత్వం పాటించగలడా? స్వీయ-అవగాహన కలిగిన నాయకులు వ్యక్తిగత ప్రగతితోపాటు ఆధ్యాత్మిక సుగతికీ ప్రాధాన్యమిస్తారు. దానితో నాయకులు మరింత ప్రభావవంతంగా పనిచేయడమే కాకుండా నిరంతర అభివృద్ధి కోసం తమ బృందాలకు ప్రేరణనిస్తారు.
నాయకుడిలో సమదృష్టి వల్ల బృందం పనితీరు ఉదాత్తతను సంతరించుకుంటుంది. అంతర్ దృష్టి ఆవిష్కృతమై వైఖరి మారుతుంది. క్రమశిక్షణ జీవితంలో భాగమవుతుంది. ఆధ్యాత్మిక పురోగతితోపాటు వృత్తిపరమైన విధులను సమతుల్యం చేయడం ద్వారా నాయకులు ఆధునిక కార్యాలయాలలోని సంక్లిష్టతలను అధిగమించగలుగుతారు. తోటివారిని ఉన్నతీకరిస్తూ తనను తాను ఉన్నతీకరించుకునే నాయకులు భౌతిక సంపదను సృష్టించడమే కాక ఆధ్యాత్మికంగానూ ఎదుగుతారు. అదే పరిణతి చెందిన నాయకత్వానికి సూచిక అవుతుంది. అలాంటి వారే పరమయోగులుగా ఆదర్శమూర్తులు అవుతారు.