సనాతన ఆధ్యాత్మిక ప్రవాహంలో అవధూత సంప్రదాయం నిరంతర స్రవంతి. ఆ సజీవ జలధారకు పరమశివుడు జన్మస్థలమైతే.. త్రిమూర్తి అంశతో జన్మించిన దత్తాత్రేయుడు సంగమ క్షేత్రం. దత్త సంప్రదాయాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న సిద్ధ పురుషులు అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామివారు.
సమాజం మారాలి. తన ఇల్లూ, ఒళ్లూ దగ్గరికి వచ్చేసరికి అందరూ అప్రమత్తతగా ఉంటారు. జాగ్రత్తగా చూసుకొంటూ ఉంటున్నారు కదా! అలాగే సంఘమనే ఇల్లు మనది అని ప్రతిఒక్కరూ అనుకోవాలి. అప్పుడే రోగాలు రావు. సమస్యలు రావు. దుర్మార్గులు దాడి చెయ్యటానికి అవకాశం ఉండదు. క్రమక్రమంగా ‘నాది’ అనేది విడిచి ‘మనది’ అనేది పెంచుకోవాలి.
ఆయన పలుకు మధురం. ఆయన గానం అమృతం. కఠోపనిషత్తును కూడా సులభంగా అర్థమయ్యేలా అనుగ్రహిస్తారు. కఠిన పరిస్థితుల్లో ఉన్న భక్తులకు ఔదుంబర వృక్షమై నీడనిస్తారు. అవధూత సంప్రదాయానికి ఆలవాలం స్వామి హృదయం. అంతుబట్టని దత్త తత్త్వానికి భాష్యం వారి వదనం.
దత్త మార్గాన్ని ఉపదేశిస్తూ… సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ.. ఆధ్యాత్మిక విలువలను పెంపొందిస్తూ.. స్వామి సేవతోపాటు సమాజ అభ్యున్నతికీ దశాబ్దాలుగా తన తపస్సును ధారపోస్తున్నారు. అవధూత దత్తపీఠం ద్వారా భారతావనిలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా దేశదేశాల్లో భారతీయ ఆధ్యాత్మిక గరిమను చాటిచెబుతున్న మహనీయులు స్వామివారు. దేవీ నవరాత్రుల సందర్భంగా ఇటీవల హైదరాబాద్కు విచ్చేసిన గణపతి సచ్చిదానంద స్వామితో ‘చింతన’ ప్రత్యేక సంభాషణ…
నమస్కారం స్వామీజీ! సనాతన ధర్మం పరిరక్షణకు అవధూత దత్తపీఠం దశాబ్దాలుగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది! ప్రస్తుతం పీఠం ఆధ్వర్యంలో కొనసాగిస్తున్న ధార్మిక ప్రచార విశేషాలను మాతో పంచుకోగలరు!
సనాతన ధర్మం పరిరక్షణకు అవధూత దత్తపీఠం అహరహం కృషి చేస్తూ వస్తున్నది. ఆ సమయానికి, ఆ సందర్భానికి తగినట్లుగా, దత్తుడు నడిపించినట్లుగా మేము నడుస్తూ ఉంటాం. పీఠంలోనూ, మా పీఠశాఖలలోనూ శాస్త్ర ప్రకారంగా నిరంతరం క్రతువులు జరుగుతూ ఉంటాయి. లోక కల్యాణార్థమై ఆయా కాలాలలో చేయవలసిన పూజలు, హోమాలు, వ్రతాలు విధిగా జరుగుతూ ఉంటాయి.
విదేశాల్లోనూ దత్తపీఠం ఎన్నో ఆలయాలను నిర్మించింది! ధార్మిక ప్రచారం నిర్వహిస్తున్నది! గతంతో పోలిస్తే ఇప్పుడు విదేశాల్లో మన ధర్మం పట్ల ఎలాంటి వైఖరి ఉందని గమనించారు?
మన హిందూ సంప్రదాయం పట్ల శ్రద్ధ పెరిగింది. మన ధర్మం పట్ల భయం, భక్తి పెరిగాయి. పైకి పాశ్చాత్యపు పోకడలు ప్రదర్శిస్తూ ఉన్నా ఇంటా, బయటా కూడా దేవుడికి దండం పెడుతూనే ఉన్నారు. అందుకే అక్కడ ఉన్న అన్ని ధార్మిక సంస్థలలోని భక్తులు ఆధ్యాత్మికరంగంలో అపూర్వ విజయాలు సాధిస్తున్నారు. ఎవరూ సాధించలేని రికార్డ్లు నెలకొల్పుతున్నారు. ఆధ్యాత్మిక పురోగతి కనిపిస్తున్నందుకు చాలా సంతోషం.
ఆధ్యాత్మిక సేవతోపాటు సామాజిక సేవలకూ దత్తపీఠం కృషి చేస్తున్నది. సేవాపథంలో మీరు అమలు చేస్తున్న ప్రణాళికల వివరాలు..
మాది దత్త సంప్రదాయం. దత్తుడు చెప్పినట్టుగా మేము నడుస్తూ ఉంటాం. దత్తుడు ‘ఈ సత్కార్యాన్ని ఇప్పుడు చెయ్యి’ అని ఆజ్ఞాపిస్తాడు. వెంటనే దానిని మేము ఆచరిస్తాం. అంతేకానీ ముందుగా నిర్ణయించి పెట్టుకొని అమలు చేయడం, అనుకూలంగా లేకపోవటంతో అమలు చేయకపోడం అనేవి ఉండవు. పీఠ పర్యవేక్షణలో అన్నదానం, విద్యాదానం, వృద్ధుల కోసం ‘అమ్మ ఒడి’, ‘వాగ్దేవి’ పేరుతో మూగ, చెవుడు సమస్యలు ఉన్న పిల్లలకు తగిన పాఠశాల, ఇంకా వృద్ధాశ్రమాలు, గోసేవ వంటి సేవలు కొనసాగుతున్నాయి.
ఆధ్యాత్మికతను, అధునాతన విజ్ఞానాన్ని ఎలా సమన్వయం చేసి చూడాలి? అసలు ఈ సమన్వయం అనేది సమంజసమైనదేనా?
సమంజసమైనదే! ఈనాటి భౌతికశాస్త్రం అణుఖండాల చలనాన్ని గురించి పరిశీలించి, పరిశోధించి నోబెల్ బహుమతులు సాధించి.. చివరికి మన సిద్ధాంతంలోకే చేరుతున్నది. ఇది మన కంటికి కనిపిస్తూనే ఉంది. సంతోషం. నిన్నటి దాకా జడమనుకొన్నది ఇవాళ విజ్ఞానశాస్త్రం ప్రకారంగా కూడా చేతనమే అవుతున్నది. ఉపనిషత్తులలో ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’ ఈ ప్రపంచమంతా బ్రహ్మపదార్థమే అని పేర్కొని ఉంది. అంటే చైతన్యమే అని నిశ్చయంగా ఘోషించింది. పూర్వం కార్తవీర్యుడు ద్వైతంలో కొట్టుమిట్టాడుతూ ఉండేవాడు. సందేహాలతో సతమతమవుతూ ఉండేవాడు. ఒకనాడు అతను దత్తస్వామిని ఆశ్రయిస్తే ఆయన యోగోపదేశం చేసి శక్తి పాతం చేశాడు. అప్పుడు అతను ఈ శాస్త్రవేత్తల లాగా సాధన చేసి, సత్యాన్ని తెలుసుకొన్నాడు. ఆ సందర్భంలో ‘దేశే కాలే పదార్థే వా చిదాత్మెకో విభాతి మే చిదానందో మహాత్మేశ పదార్థాలన్యోన విద్యతే॥’ అని కార్తవీర్యుడు పేర్కొన్నాడు. అంటే, ‘నాకంతా చిదానందమే కనిపిస్తున్నది. ప్రతివస్తువులోనూ చిదానందమే గోచరమవుతున్నది. చైతన్యం కంటే వేరే వస్తువు లేనే లేదు’ అని చెప్పాడు. ఇలా అధ్యాత్మికతతో విజ్ఞానాన్ని సమన్వయం చేసుకొని చూస్తే సత్ఫలాలు దక్కి లోకానికి మేలు కలు గుతుంది. సమన్వయం లేకుండా సాధన చేస్తే దుష్ఫలాలు సంభవించి కీడు జరుగుతుంది.
ఇటీవల కొన్ని పుణ్యక్షేత్రాలలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తూ, ఇలా జరుగుతుంటే మీ దేవుడు ఏం చేస్తున్నాడంటూ కొంతమంది విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ అంశాన్ని ఎలా చూడాలి? ఇటువంటి సందర్భాల్లో భగవంతుడు ఎందుకు నిదర్శనాలు చూపడం లేదు?
దేవుడు ఎంతో దయగలవాడు. భూమాత లాగా ఎంత క్షమిస్తాడో ప్రళయం వచ్చినప్పుడు అంతగా కంపించి కోపిస్తాడు. మేడ కట్టటానికి (మంచికి) చాలా కష్టపడాలి కానీ, కూల్చటానికి (కీడుకు) ఎంత సేపు? తప్పు చేయగానే వెంటనే శిక్ష పడిపోవాలి అనేది మన సిద్ధాంతం కాదు. మన ధర్మం అసలే కాదు. పగవాడికి కూడా అన్నం పెట్టి పంపిస్తుంది మన ధర్మం. వాడు మంచి వాడిగా మారటానికి చాలా అవకాశాలు ఇస్తుంది. ఇక పాపం పండినప్పుడు, ఒక్కసారిగా ఉప్పెన వచ్చి పూర్తిగా తుడిచిపెట్టినట్లుగా, దేవుడు కలియుగంలోని దుష్టుల అంతు చూస్తాడు. అయితే దుష్టులు అవహేళన చేస్తున్నారని సత్కార్యాలు ఆపకూడదు. చీమలు కలిసి ఉంటే ఏనుగును బంధించేస్తాయి. అలాగే కలిసికట్టుగా ఉంటే దుష్టులేమీ చెయ్యలేరు. విడిగా ఉంటేనే వారికి అవకాశం దొరుకుతుంది. ఎప్పటికప్పుడు ఇలాంటి ప్రశ్నలే తలెత్తుతూ ఉంటాయి. ప్రయత్నం చేయకుండా, దేవుడేమీ చేయడం లేదు, నిదర్శనాలు చూపటం లేదనడం ఎంతవరకు సబబు?
సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు… ఇవన్నీ ఇప్పటి తరం నుంచి దాదాపుగా దూరమైంది. ఇలాగైతే, కొంతకాలానికి మన సంస్కృతి పూర్తిగా మారిపోయే ప్రమాదం ఉంది కదా! ఇలాంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం ఎలాంటి ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించాలి?
మన గీతను మార్చే గీతాచార్యుడు చెప్పిన గీతలోని మాటే అందరికీ శిరోధార్యం. ‘తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే’ అంటే శాస్త్రమే మనకు ప్రమాణం. శాస్త్రం చెప్పినట్లుగా ఆచరిస్తే మన ఆధ్యాత్మికతకు ఎలాంటి లోటు రాదు. మన జీవనశైలి అస్తవ్యస్తం కాదు. ‘చక్కగా చేతులు కాళ్లు, కడుక్కోవాలి’ అని మన శాస్త్రం ఆనాడే చెప్పింది. కానీ మనం ‘ఆఁ పాటించకపోతే ఏమౌతుంది లే’ అని మరిచిపోతే కరోనా వచ్చి గుర్తు చేసి, లోకానికే శుచి, శుభ్రత నేర్పింది. ఇంకా ఎన్నో పాఠాలు నేర్పింది. కాబట్టి మన శాస్త్రం చెప్పింది చెప్పినట్లుగా చేస్తే మన సంస్కృతి బాగుంటుంది. సంప్రదాయాలు బాగుంటాయి. ఆచారాలు బాగుంటాయి. కుటుంబం బాగుంటుంది.
దైవం మంత్రాధీనం అనీ, మంత్రం శబ్దం, స్వర ప్రధానమని అంటారు. అయితే, ఆధునిక విద్యకు అలవాటుపడిన నేటి తరం అలాంటి కష్టతరమైన మంత్రాలు పఠించే, స్తోత్రపాఠాలు చేసే అవకాశం ఉండదు! స్వరయుక్తంగా మంత్రపఠనం చేయలేని వాళ్లు ఆధ్యాత్మిక సాధనలో ఎలాంటి మార్గాన్ని అనుసరించాలి!
పూర్వం మరా అనే పదాన్ని పలికి మహర్షి అయిన మహనీయుడు ఉన్నాడు కదా! అందుచేత నామస్మరణ మార్గాన్ని అనుసరిస్తే మంచిది. దక్షిణాదిన, ఉత్తరాదిన గల దాసులు, సంతులు, సత్పురుషులు అందరూ కూడా నామసంకీర్తన మార్గాన్నే అనుసరించి తరించారు. మా మార్గం కూడా ఇదే! ఇదే అన్నిటికీ పునాది. మంత్రోపాసనకు ఇదే మొదటి మెట్టు. భగవన్నామస్మరణ చేస్తే ఏకాగ్రత, జ్ఞాపకశక్తీ రెండూ పెరుగుతాయి. వయస్సు కూడా సహకరిస్తుంది.
స్వధర్మమే అన్ని విధాలా శ్రేష్ఠమని గీతాచార్యుని ఉవాచ. అయితే ఆధునిక జీవనంలో ఒక మనిషి తన స్వధర్మాన్ని ఎలా గుర్తించాలి?
తన చక్కని ప్రవర్తన వల్ల ఇతరులు కూడా తనలాగానే జీవించాలి. తన లాగానే ఇతరులు కూడా సంతోషంగా ఉంటూ అభివృద్ధి చెందటానికి వీలు కల్పించాలి. దేవతలను తృప్తి పరుస్తూ, దేవతల వల్ల తాను కూడా సంతృప్తి పొందుతూ ఉండాలి. ఇటువంటి ప్రవర్తననే తన స్వధర్మమని మనిషి గుర్తించాలి. ‘తపస్సు, శౌచం, దయ, సత్యం’ అనే వాటిని పట్టుకొని ధర్మాన్ని అనుసరించాలి. తపస్సుతో గర్వం తొలగిపోతుంది. శుచిగా ఉండటంతో దుస్సాంగత్యం తప్పుతుంది. దయ కలిగి ఉండటంతో మదం తగ్గుతుంది. సత్యంగా ఉండటంతో అసత్యం తొలగిపోతుంది.
మంత్రోపదేశ గురువు లక్షణాలు ఎలా ఉండాలి? ఆయన అనుగ్రహం పొందాలంటే భక్తుడు పాటించాల్సిన నియమాలేంటి?
గురువు సాధన దశను దాటి మంత్రసిద్ధుడు, యోగసిద్ధుడై ఉండాలి. అటువంటి గురువు అనుగ్రహం పొందటానికి భక్తుడు దృఢమైన నియమనిష్ఠలు కలిగి ఉండాలి. శుచి శుభ్రతలు పాటించాలి. భక్తిశ్రద్ధలు కలిగి ఉండాలి. గురు ముఖతః మంత్రోపదేశం పొందే అదృష్టం అందరికీ దక్కకపోవచ్చు. అలాంటి వ్యక్తులు ఏదైనా మంత్రం సాధన చేయాలంటే ఏ పద్ధతిని పాటించాలి?
‘భజగోవిందం భజగోవిందం’ భగవన్నామాన్ని జపించాలి.
సాధకులకు సైతం మనసు స్థిమితంగా ఉండదు కదా! మంత్రం జపం చేస్తున్నా, మరేదైనా పారాయణం చేస్తున్నా మనసు పరిపరివిధాల ఆలోచనల్లోకి వెళ్లిపోతుంటుంది కదా! అలా మనసును కట్టడి చేయలేనప్పుడు ఆ మంత్రానుష్ఠాన ఫలితం దక్కకుండా పోతుందా?
ఎందుకు దక్కదు. ఫలితం దక్కుతుంది. ఈ పరిస్థితి గొప్ప గొప్ప మహర్షులకే సంభవించి, వారి మనస్సు జారిపోయింది. అప్పుడు వారు ఆ సమయాలలో ఏం చేశారు? కిందకి జారిపోయారా? లేదు. మళ్లీ ప్రయత్నించి సాధన చేశారు. తపస్సిద్ధిని పొందారు. అందుచేత మహర్షుల లాగా విడవక ప్రయత్నిస్తూ ఉండటమే అందుకు తగిన ఉపాయం.
గంగలో మునకేయడం ద్వారా పాపాలు పోతాయనీ, కార్తిక మాసంలో దీపారాధన చేస్తే దోషాలు తొలగిపోతాయనీ చాలామంది చెబుతున్నారు! చాలామంది గంగలో మునకేసి.. తమ పాపాలన్నీ కడిగేసుకోవచ్చు అనే భావనకు వస్తున్నారు! శాస్త్రం సూచించిన ఇలాంటి పరిహారాల్లో అంతరార్థం తెలియజేయండి?
సందేహస్పర్శ ఉండకూడదు. ఉంటే ఫలితం దక్కదు. కనుక సందేహం లేకుండా భక్తి విశ్వాసాలతో గంగాస్నానం చేస్తే పాపాలు పోతాయి. ఆ పాపాలను గంగామాత తీసుకొంటుంది. ఇది సత్యం. ఇందుకు ఎన్నో పురాణగాథలు నిదర్శనాలుగా ఉన్నాయి. కనుక శాస్త్రం ‘చిత్తశుద్ధే ప్రధానమ’ని ఘోషించింది.
అన్ని ధర్మాలను పరిత్యజించి తననే శరణు వేడమని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఉద్బోధించారు. అయితే, అన్ని ధర్మాలను త్యజించడం అంటే ఏమిటి? దీనిని ఎలా అర్థం చేసుకోవాలో తెలుపగలరు?
ఇది గీతాచార్యుడు చేసిన బోధ కదా! అందుచేత ఆచార్యుడు మొదటగా ఏ మాటలు బోధించిన తరువాత ఈ మాట బోధించాడు అనేది గుర్తు పెట్టుకోవాలి. కానీ, ఈ చివరి మాటొక్కటే పట్టుకొని పాటిస్తే అధోగతి పాలు కావటం జరుగుతుంది. ‘సర్వధర్మాన్’ అన్న చోట ధర్మాధర్మాలను రెంటినీ కూడా స్వీకరించాలి అనే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆచార్యుడు మొదటగా కర్మ చెయ్యమన్నాడు. తరువాత ఆయన రెండోసారి ఫలాన్ని విడిచి పురుషార్థంపై ఆధారపడి కర్మ చెయ్యమన్నాడు. ఆ తరువాత మూడోసారి ఆ పురుషార్థాన్ని కూడా విడిచిపెట్టి నన్ను శరణు పొందు అన్నాడు. నేననే భేదభావం లేని ఏకస్వరూప పరమాత్మను శరణుపొందు అన్నాడు. ఇదీ అన్ని ధర్మాలను విడిచిపెట్టు అన్న మాటకు అర్థం. ఈ సోపానాలు పట్టించుకోకుండా చివరిది మాత్రమే పాటిస్తాను అంటే పతనం కావటం జరుగుతుంది. దీనిని ఇలాగే చక్కగా అర్థం చేసుకోవాలి.
ఉద్యోగం, వ్యాపారం ఇలా దైనందిన జీవితంలో చిక్కుకుపోయిన మనిషి నిషిద్ధ ఆహార విహారాదులకు పాల్పడుతూ ఉన్నాడు! ఇలాంటి వ్యక్తులు మన పెద్దలు సూచించిన సనాతన జీవన విధానాన్ని ఎలా అనుసరించాలి? వారికి ప్రత్యామ్నాయం ఏమిటి?
ముఖ ప్రక్షాళనము, శరీరాన్ని పరిశుభ్రం చేసుకోవటం అనేవి కూడా దైనందిన జీవితమే కదా! మరి ఇదీ తప్పనిదే గా! మరి ఇక్కడ నియమమెందుకు? అక్కడ నియమభంగం ఎందుకు? ఈ రెండిటికీ మధ్య గల అడ్డం ఏమిటి? అంటే లాభం. లాభం కోసం (స్వార్థం కోసం) దిగజారితే వ్యక్తిత్వమే దిగజారిపోతుంది. లేకపోతే గొప్పగా ఉంటుంది. ప్రాణాన్ని రక్షించుకోవలసిన పరిస్థితిలో విశ్వామిత్రమహర్షి చేసినట్లుగా చెయ్యవచ్చు కానీ, ప్రాణం నిలిచిన తరువాత ‘తప్పనిసరి అని మాత్రం తప్పు చెయ్యకూడదు. తప్పు చెయ్యకుండా అనుక్షణం జాగ్రత్తగా ఉంటే, గతంలో చేసిన దోషాలు కూడా సమసిపోతాయి. ఇక నువ్వు ఎప్పుడు పదిమంది మంచి కోరుతూ నిస్వార్థపరుడిగా జీవిస్తున్నావు అంటే అప్పుడే నువ్వు సనాతన జీవన విధానంలో నడుస్తున్నట్టు లెక్క.
– కణ్వస