ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి) నుంచి నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. శయన ఏకాదశి నుంచి కార్తిక శుద్ధ ద్వాదశి వరకు గృహస్థులు, వానప్రస్థులు, ఆషాఢ పౌర్ణమి నుంచి సన్యాసులు ఈ వ్రతాన్ని పాటించే సంప్రదాయం ఉంది. ప్రస్తుత కాలంలో సన్యాసులు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు.
అరుదుగా గృహస్థులు కూడా ఈ వ్రతదీక్షలో ఉంటున్నారు. ఇందులో భాగంగా ఒకే పూట భోజనం, బ్రహ్మచర్యం పాటించడం, భూతల శయనం వంటి నియమాలు పాటిస్తారు. వ్రతాన్ని ఆచరించేవారు ఊరి పొలిమేర దాటరాదన్న నియమం ఉంది. చాతుర్మాస్య వ్రతం మానవ జీవనశైలిని క్రమబద్ధీకరించడానికి తోడ్పడుతుంది. ఆషాఢం నుంచి కార్తికం వరకు ప్రకృతిలో పలు మార్పులు జరుగుతుంటాయి. వర్షాలు కురిసి వాగులూ, వంకలూ నిండుగా ప్రవహిస్తుంటాయి.
రకరకాల మొక్కలు పెరిగి పరిసరాలు చీదరగా తయారవుతాయి. అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఈ కాలంలో ఎక్కువ. అందుకే, పరిసరాలను మార్చడం వల్ల కలిగే సమస్యలను నివారించడానికి పొలిమేరను దాటకూడదని శాస్త్రం నిర్దేశించింది. ఆధ్యాత్మిక సాధన కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాతుర్మాస్య వ్రతం ఏర్పాటు చేశారని పెద్దలు చెబుతారు. సన్యాసులు ఈ నాలుగు నెలలూ ఒకేచోట దీక్షగా వ్రతం ఆచరిస్తారు. కఠిన నియమాలు పాటిస్తూ ధ్యానమగ్నులై ఉంటారు. తపోశక్తిని పెంచుకొని.. సమాజ ఉద్ధరణకు దానిని ధారపోస్తారు.